సదస్సు ప్రాంగణం వద్ద ధర్నాలో మహిళా రైతులు (ఫైల్)
సాక్షి, కడప : మైలవరం మండలం గొల్లపల్లె వద్ద 1995లో ఏసీసీ యాజమాన్యం సిమెం టు ఫ్యాక్టరీ నిర్మిస్తామంటూ ఎకరా రూ.50 వేలు వంతున పంట పొలాలను కొనుగోలు చేసింది. గొల్లపల్లె, వద్దిరాల, ఉప్పలపాడు, చిన్నవెంతుర్ల, బెస్తవేముల, జంగాలపల్లె గ్రామాలకు చెందిన దాదాపు వెయ్యి మంది రైతులు విడతల వారీగా మూడు వేల ఎకరాలకు పైగా పంట పొలాలను ఏసీసీకీ అమ్మేశారు. ఫ్యాక్టరీ వస్తే తమ బతుకులు మారతాయని, పిల్లలకు ఉద్యోగాలొస్తాయని ఆశపడ్డారు.
వారి ఆశలన్నీ అడియాశలుగానే మిగిలిపోయాయి. పాతికేళ్లు కాలచక్రంలో కరిగిపోయాయి. అప్పటి రైతులు ఇప్పుడు వృద్ధులయ్యారు. వారి కుమారులు సైతం నడివయస్సుకు వచ్చేశారు. ఫ్యాక్టరీ ఊసే కనిపించలేదు. తమను దగా చేసిన ఏసీసీ యాజమాన్యాన్ని నిలదీయాలని రైతులు ఎదురుచూస్తున్న తరుణంలో ఫ్యాక్టరీ ప్రజాభిప్రా య సేకరణ సదస్సు నిర్వహిస్తున్నట్లు ప్రకటించిం ది. పార్టీలకు అతీతంగా ఆ ఆరు గ్రామాల రైతులం తా ఒక్కటై సమస్యలు పరిష్కరించేంతవరకు సద స్సు నిర్వహించనిచ్చేది లేదని భీష్మించుకున్నారు.
ఆరోజు ఏం జరిగిందంటే....
2016 సెప్టెంబరు 9న గొల్లపల్లె సమీపాన ప్రజాభిప్రాయ సేకరణ సదస్సుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఎప్పుడో 1995లో పొలాలు 20ఏళ్ల తర్వాత గుర్తొచ్చామా? మా బతుకులను నాశనం చేశారంటూ బాధిత రైతులు ర్యాలీగా వెళ్లి సదస్సు ప్రాంగణం వద్ద ధర్నాకు కూర్చొన్నారు. వీరికి మద్దతుగా మానవ హక్కుల వేదిక జిల్లా కన్వీనర్ జయశ్రీతోపాటు వైఎస్సార్‌సీపీ నేతలు డాక్టర్ సుధీర్‌రెడ్డి, అల్లెప్రభావతి, అల్లెచెన్నారెడ్డి, రామాంజనేయయాదవ్ ధర్నాలో పాల్గొన్నారు. తర్వాత యాజమాన్యానికి మద్దతుగా ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి వచ్చారు. అప్పటికే పోరాటం తారాస్థాయికి చేరడంతో విధిలేని పరిస్థితుల్లో తాను కూడా రైతుల పక్షాన వచ్చానంటూ ఆదినారాయణరెడ్డి ధర్నాలో పాల్గొన్నారు.
రామసుబ్బారెడ్డి ఈ సమస్యలేవీ తనకు పట్టనట్లు ఆ వైపునకే తొంగిచూడలేదు. ఈ నేపథ్యంలో అప్పటి జిల్లా కలెక్టర్ కేవీ సత్యనారాయణ సదస్సులో పాల్గొనడానికి రావడం, రైతులు అడ్డుకోవడం, ఆయన వెళ్లిపోవడం జరిగింది. ఆ తర్వాత ఆదినారాయణరెడ్డి ఫ్యాక్టరీ యాజమాన్యం తరుపున వకాల్తా పుచ్చుకున్నారు. తాను ముందుండి నష్టపరిహారం ఇప్పిస్తానని, ఫ్యాక్టరీని త్వరలోనే నిర్మిస్తామని, సదస్సును జరగనీయాలంటూ రైతులకు కల్లిబొల్లి కబుర్లు చెప్పారు. అయినా ఆరోజు రైతులెవరూ ఆయన మాట వినలేదు.
ఆది, పీఆర్‌లు ఇద్దరూ ఏకమై..:
అప్పటికే ఆది నారాయణరెడ్డి, రామసుబ్బారెడ్డిలు అధికార టీడీపీలో ఉన్నారు. రైతులపై ప్రత్యక్షంగా కక్ష తీర్చుకో కుండా, అధికార యంత్రాంగం పోలీసుశాఖను ఉసిగొల్పారు. 2016 అక్టోబరు 20న వందలాది మంది పోలీసు బందోబస్తును తెప్పించి, ప్రజాభిప్రాయ సేకరణను మమ అనిపించారు. ఏసీసీ యాజమాన్యానికి మద్దతు పలికి రైతుల నోట్లో మ న్ను వేశారు. ఇకపై ఇలా పోరాటాలు చేయకుండా 57 మంది రైతులపై నాన్‌బెయిలబుల్ కేసులు న మోదు చేయించారు. సాక్షాత్తూ అప్పటి జిల్లా కలెక్టర్ సత్యనారాయణ అంతకుముందు రైతులపై పె ట్టిన కేసులు ఎత్తి వేస్తున్నామని ప్రకటించారు. ఈ ఇద్దరు నేతలు మాత్రం రైతులపై కేసులు కొనసాగేలా పోలీసుశాఖపై ఒత్తిడి తెచ్చారు. ఫలితంగా 57 మంది రైతులు నేటికీ కోర్టుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. ఈ కేసుకు సంబంధించి ఈనెల 24న కూడా జమ్మలమడుగు కోర్టులో వాయిదా ఉంది.
కోర్టు చుట్టూ తిరుగుతున్నా....
రైతులకు మద్దతుగా ధర్నాలో కూర్చొన్న నేరానికి అధికార పార్టీ నేతలు పోలీసులపై ఒత్తిడి తెచ్చి నాపై కూడా కేసు పెట్టించారు. నాతోపాటు 57 మంది రైతులు రెండున్నరేళ్లుగా కోర్టు చుట్టూ తిరుగుతున్నాం. తెలుగుదేశం ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వమని చెప్పడానికి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి?"
– రామాంజనేయ యాదవ్, రైతు, వద్దిరాల గ్రామం, మైలవరం మండలం
రైతులను దగా చేశారు...
2016లో ప్రజాభిప్రాయ సేకరణ సదస్సు సందర్బంగా రైతులమంతా ఏకతాటిపై నిలిచాం. ఏ రాజకీయ నాయకుని ఆశ్రయించలేదు. అయినా వాళ్లంతట వాళ్లు వచ్చి ఏసీసీ యాజమాన్యానికి మేలు చేసి మమ్మల్ని మాత్రం నిలువునా మోసం చేశారు. – లక్ష్మినారాయణ, రైతు, గొల్లపల్లె, మైలవరం మండలం
అంతా ఉత్తిదే....
మా ప్రాంతంలో సిమెంటు ఫ్యాక్టరీ వస్తే ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని ఎంతగానో ఆశపడ్డాం. 2016వ సంవత్సరంలో పోలీసు పహారా మధ్య ప్రజాభిప్రాయ సేకరణ సదస్సు జరపడం చూసి ఇప్పుడైనా ఫ్యాక్టరీ నిర్మిస్తారేమోనని బలంగా నమ్మాను. తీరా చూస్తే అంతా ఒత్తిదేనని తేలిపోయింది. – మహమ్మద్, రైతు, చిన్నవెంతుర్ల, మైలవరం మండలం
Comments
Please login to add a commentAdd a comment