
అశోక్ ముఖానికి తగిలిన తీవ్ర గాయం, గాయపడిన శివకృష్ణారెడ్డి
సాక్షి, కడప అర్బన్ : కడప, కమలాపురం నియోజకవర్గాల పరిధిలో ఆదివారం టీడీపీ శ్రేణులు వైఎస్సార్‌సీపీ మద్దతుదారులపై దాష్టీకానికి దిగారు. వారి ఇళ్లల్లోకి వెళ్లి దాడి చేయడంతోపాటు.. మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించి మెడలోని బంగారు చైన్‌ను కూడా లాక్కెళ్లి దోపిడీ దొంగల్లా తెగబడ్డారు. కడప నగరంలోని తాలూకా పోలీసుస్టేషన్ పరిధిలోగల 48వ డివిజన్‌లో నివాసముంటూ ఇటీవల వైఎస్సార్ సీపీలో చేరిన శివకృష్ణారెడ్డి అనే యువకుడిపై టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అమీర్‌బాబు సోదరుడు నిసార్ అహ్మద్ తన అనుచరులతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు.
అలాగే కమలాపురం నియోజకవర్గంలోని కడప నగర పరిధిలోని మేరినగర్‌లో నివసిస్తున్న లక్ష్మీదేవి ఇంటికి ఓబులంపల్లె నుంచి సోదరుడు తప్పెట అశోక్ ఆమెను చూసేందుకు ఆదివారం వచ్చాడు. అదే సమయంలో ఆ ప్రాంత వైఎస్సార్ సీపీ నేత సుధాకర్‌రెడ్డి కుమారుడు ఫ్యాన్ గుర్తుకు ఓటేయాలని స్థానిక ప్రజలను ఇంటింటికీ వెళ్లి అభ్యర్థించారు. అందరి ఇళ్లకు వెళ్లినట్లే లక్ష్మీదేవి ఇంటికి వెళ్లి ఫ్యాన్ గుర్తుకు ఓటేయాలని చెప్పి వచ్చారు.
కొంతసేపటికి అదే ప్రాంతానికి చెందిన టీడీపీ వర్గీయులు ఈశ్వరయ్య, నారాయణ, శేఖర్(కమలాపురం టీడీపీ అభ్యర్థి పుత్తా నరసింహరెడ్డి అనుచరులు) మరికొంతమంది కలిసి లక్ష్మీదేవి ఇంటి లోపలికి వెళ్లి అశోక్‌ను చితకబాదారు. ఆమె మెడలో ఉన్న బంగారు చైన్‌ను లాక్కెళ్లారు. ప్రస్తుతం అశోక్ తన అక్క లక్ష్మీదేవితో కలిసి రిమ్స్‌లో చికిత్స పొందుతున్నాడు. అలాగే టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వీఎస్ అమీర్‌బాబు సోదరుడు నిసార్ అహ్మద్ తన అనుచరులతో కలిసి వెళ్లి కడపలోని రియాజ్ థియేటర్ ఎదురుగా నివసిస్తున్న శివకృష్ణారెడ్డి అనే వైఎస్సార్ సీపీ కార్యకర్తపై దాడికి తెగబడ్డాడు.
టీడీపీకి సంబంధించిన స్టిక్కర్లను తన ఇంటికి అతికించబోతే అడ్డుకున్నందునే ఈ చర్యకు తెగబడ్డారని బాధితుడు శివకృష్ణారెడ్డి తెలిపారు. బాధితుడి ఎడమచేతికి తీవ్ర గాయమైంది. బాధితుడు తాలూకా పోలీసుస్టేషన్‌ను ఆశ్రయించాడు. ఘటనలపై పోలీసులు విచారిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment