కష్టపడి డిగ్రీ వరకు చదువుకుని నలుగురికి విద్యాబుద్ధులు చెబుతూ జీవిద్దామనుకున్న ఆ యువకుడికి మూర్చవ్యాధి మృత్యుమార్గం చూపుతోంది. కాళ్లు, చేతులను చుట్టేసి మంచానికే పరిమితం చేసింది. వైద్యానికి ఉన్న కాస్త భూమి హారతి కర్పూరంలా కరిగిపోగా... వృద్ధాప్యంలో ఉన్న తల్లిపైనే ఆధారపడి బతకుతూ...నిత్యం నరకం అనుభవిస్తున్నాడా యువకుడు.
కనగానపల్లి మండలం ముత్తువకుంట్ల గ్రామం ఎస్సీ కాలనీకి చెందిన పక్కీరమ్మ, మారెన్న దంపతులకు నలుగురు కుమారులు. చాలాకాలం క్రితమే మారెన్న మృత్యువాత పడడంతో పక్కీరమ్మే కుటుంబ భారం మోయాల్సి వచ్చింది. చిన్న కుమారుడు కొడాల నరసింహులు చురుగ్గా ఉండడంతో కష్టపడి బాగా చదివించింది. తల్లి కష్టం చూసిన నర్సింహులు కూడా ఒకవైపు డిగ్రీ చదువుతూనే ఆర్డీటీ పాఠశాలలో పిల్లలకు ట్యూషన్ చెప్పుకొంటూ కుటుంబానికి సాయంగా ఉండేవాడు. అయితే మిగతా ముగ్గురు కూమారులు పెళ్లిళ్లు చేసుకుని వెళ్లిపోగా... పక్కీరమ్మ, నరసింహులు కలిసి ఉంటున్నారు.
నరాల బలహీనతతో నరకం
అయితే నరసింహులుకు 22 సంవత్సరాల వయస్సులో చిన్న మెదడులో నరాల బలహీనత ఏర్పడి కాళ్లు, చేతులు పనిచేయకుండా పోవటంతో పాటు నోట మాట కూడా సరిగా రాకుండా పోయింది. ఆర్డీటీ సహకారంతో బత్తలపల్లి, అనంతపురం ప్రభుత్వ, ప్రయివేటు ఆస్పత్రుల్లో వైద్యం చేయించుకున్నాడు. కానీ నయం కాకపోవడంతో డాక్టర్లు హైదరాబాద్, బెంగళూరు వంటి నగరాల్లోని కార్పొరేట్ ఆస్పత్రులలో వైద్యం చేయించుకోవాలని సూచించారు.
దీంతో వారికున్న ఐదు ఎకరాల పొలాన్ని విక్రయించి మూడు సంవత్సరాల పాటు అక్కడే ఉండి వైద్యం చేయించుకున్నాడు. కానీ చిన్న మెదడులో వచ్చిన స్పాస్టిక్ ఎటాక్సిక్ సిండ్రోమ్ (మెదడులోని నాళాలు దెబ్బతినటం) అనే సమస్య వల్ల నరాల బలహీనత ఏర్పడిందని, దీనివల్ల చేతులు, కాళ్లతో పాటు మిగిలిన అవయవాలు సరిగా పనిచేయవని వైద్యులు తెలిపారు. ఈ సమస్య త్వరగా నయం కాదని, అవసరమైన మందులు, సరైన ఆహారం, మంచి వ్యాయామం చేస్తే కొంతవరకు నయం చేసుకోవచ్చునని సూచించారు. అయితే అక్కడే చాలా రోజులు ఉండి వైద్యం చేయించుకోవడానికి అవసరమైన డబ్బులు లేక ఆరు నెలల క్రితం ఇంటికి వచ్చేశాడు.
అన్నీతానై...
నరాల బలహీనతతో కాళ్లు, చేతులు సరిగా పనిచేయక నరసింహులు మంచం మీదే ఉండాల్సి వస్తోంది. దీంతో 80 ఏళ్ల వయస్సున్న పక్కీరమ్మే అన్నీ తానై కుమారుడిని చూసుకుంటోంది. వృద్ధాప్యంలో సరిగా కళ్లు కూడా కనిపించపోయినా కుమారుడిపై ఉన్న మమకారంతో అతనికి సేవలు చేయాల్సి వస్తోంది.
ఆపన్న హస్తం కోసం ఎదురుచూపు
ఆర్థిక స్థోమత అంతంతమాత్రమే కావడంతో తినేందుకు తిండికూడా లేక.. కుమారుడు నరసింహులుకు వైద్యం చేయించలేక పక్కీరమ్మ పడుతున్న బాధలు అన్నీ, ఇన్నీకావు. సమీప బంధువుల నుంచి గానీ, ప్రభుత్వం నుంచి గాని ఎటువంటి సాయం అందటం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఆకలి బాధలతో జీవించటం కన్నా చావే నయమని కన్నీరుమున్నీరవుతోంది. మానవత్వం కలిగిన దాతలు ముందుకు వచ్చి తమను ఆదుకోవాలని వేడుకుంటోంది.
సాయం చేయాలనుకుంటే..
కొడాల నరసింహులు
తండ్రి: మారెప్ప
ముత్తువకుంట్ల గ్రామం, కనగానపల్లి మండలం
బ్యాంకు ఖాతా నంబరు: 31508584829
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా,
కనగానపల్లి బ్రాంచ్
ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్:
ఎస్‌బీఐఎన్0005657
నరసింహులు సెల్ : 9666948405
Comments
Please login to add a commentAdd a comment