కనగానపల్లి : పాముకాటుకు గురై విద్యార్థిని మృతి చెందిన సంఘటన మండల కేంద్రం కనగానపల్లిలో జరిగింది. కేశవయ్య, సరస్వతి దంపతుల రెండవ కుమార్తె ఎం.గాయత్రి (11) జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆరో తరగతి చదువుతోంది. సోమవారం పాఠశాలకు సెలవకు కావడంతో వేరొక చోట ట్యూషన్‌కు వెళ్లి సాయంత్రం ఇంటికి వచ్చింది. తలనొప్పిగా ఉందని చెప్పడంతో తల్లిదండ్రులు స్థానిక ఆర్‌ఎంపీ వద్ద చూపించి ఆయనిచ్చిన మాత్రలు వేశారు. మంగళవారం ఉదయానికి గాయత్రి ఆరోగ్యం మరింత క్షీణించడంతో మరోసారి ఆర్‌ఎంపీ వద్దకు తీసుకెళ్లారు. విషపురుగు కాటు వేసినట్టు ఉందని ఆర్‌ఎంపీ తెలిపాడు. దీంతో కుమార్తెను కాపాడుకోవడానికి తల్లిదండ్రులు నాటువైద్యునికి దగ్గరకు తీసుకెళ్లారు. మందు ఇచ్చేలోప ఆరోగ్యం మరింత విషమిస్తుండటంతో ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. పరీక్షలు చేసిన ఆరోగ్య సిబ్బంది గాయత్రి అప్పటికే మృతి చెందిందని నిర్ధారించారు. సకాలంలో వైద్యం చేయించి ఉంటే ప్రాణాలునిలిచేవని పీహెచ్‌సీ డాక్టర్ నారాయణస్వామినాయక్ తెలిపారు. కళ్లెదుటే చనిపోయిన కుమార్తెను చూసి తల్లిదండ్రులు రోదించారు. జెడ్పీ పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు వచ్చి విద్యార్థిని మృతదేహానికి నివాళులర్పించారు.