అప్పులకు తాళలేక అన్నదాతల వరుస ఆత్మహత్యలు, పెట్టుబడికి తగిన రాబడి రాకపోవడం, పంట ఉత్పత్తుల ధరల పతనం లాంటి కారణాలతో దేశ రైతాంగం కనీవినీ ఎరుగని సంక్షోభం ఎదుర్కొంటోంది. ఏడాదిన్నర వ్యవధిలో దేశవ్యాప్తంగా రైతులు 18 సార్లు రోడ్డెక్కి ఆందోళనలకు దిగారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. తమిళనాడు, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, పంజాబ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన 184 రైతు సంఘాలు దేశవ్యాప్త నిరసనలకు దిగడంతో రైతన్నల ఆగ్రహజ్వాలలు ఢిల్లీ పీఠాన్ని తాకాయి. ఇటీవల హిందీ బెల్ట్‌లోని మూడు రాష్ట్రాల్లో బీజేపీ పరాజయానికి అన్నదాతల ఆగ్రహమే కారణమని నిర్ణయానికొచ్చిన కేంద్ర ప్రభుత్వం వారిని మచ్చిక చేసుకోవడానికి రకరకాల పథకాలపై అధ్యయనం చేసి, చివరికు తెలంగాణ,ఒడిశా రాష్ట్రాలు అమలు చేస్తున్న పెట్టుబడి సాయమే మంచిదన్న నిర్ణయానికొచ్చింది. కేంద్ర బడ్జెట్‌లో రైతులపై వరాల జల్లులు కురిపిస్తూ ఏడాదికి రూ. 6 వేల పెట్టుబడి సాయాన్ని ప్రకటించింది. కానీ దీని వల్ల రైతులకు కలిగే ప్రయోజనం ఎంత అన్నది ప్రశ్నార్థకమే.
– సాక్షి, హైదరాబాద్
వ్యవసాయ సంక్షోభం ఎలా ఉందంటే..
- మన దేశంలో మొత్తం 26 కోట్ల 30 లక్షల మంది రైతులు ఉండగా, 2016–17 నాబార్డ్ ఆర్థిక సర్వే ప్రకారం ఒక్కో రైతు కుటుంబంపై రూ.1.04 లక్షల అప్పు భారం ఉంది.
- దేశం మొత్తం మీద 52శాతం మంది రైతులు అప్పుల్లో కూరుకుపోయినట్లు నేషనల్ శాంపిల్ సర్వే ఆఫీసు (ఎన్‌ఎస్‌ఎస్‌ఒ) వెల్లడించింది.
- రైతు అప్పుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రథమ స్థానంలో ఉంది. ఏపీలో 92.9శాతం మంది రైతులు రుణగ్రస్థులు కాగా, తరువాతి స్థానాల్లో తెలంగాణ (89.1%), తమిళనాడు (82.5%) ఉన్నాయి.
- ప్రభుత్వ పథకాలపై 64 శాతం మంది రైతులు అసంతృప్తితో ఉన్నట్టు సీఎస్‌డీఎస్ అధ్యయనంలో తేలింది.
- సాగు కమతాల విస్తీర్ణం బాగా తగ్గిపోవడం, ఎకరా, రెండు ఎకరాలు ఉన్న చిన్న రైతుల సంఖ్య పెరగడంతో వారు బేరమాడేశక్తిని కోల్పోతున్నారు. దీంతో దళారులు చెప్పే «ధరకే పంటని అమ్ముకుంటున్నారు.
- పంటల ఉత్పత్తికి తగిన డిమాండ్ లేకపోవడంతో రైతులకు ఆశించిన ధర దక్కడం లేదు.
- గోదాములు, శీతల గిడ్డంగుల కొరతతో పంట ఉత్పత్తులు తొందరగా చెడిపోవడం కూడా రైతులకు నష్టం కలిగిస్తోంది.
- డీజిల్ ధరలు పెరగడం, అంతర్జాతీయంగా రూపాయి విలువ పతనంతో ఎరువుల ధరలు ఎగబాకడంతో పెట్టుబడి వ్యయం అధికమవుతోంది.
- ప్రత్యామ్నాయ మార్గాలుంటే వ్యవసాయ రంగాన్ని వదులుకోవాలని సుమారు 40 శాతం రైతులు భావిస్తున్నారు.
ద్రవ్యోల్బణంలో 40 శాతం వాటా..
ద్రవ్యోల్బణానికి, వ్యవసాయాదాయానికి మధ్య మౌలికంగా కొంత వైరుధ్యం ఉంది. ద్రవ్యోల్బణాన్ని నిర్ణయించే వినిమయ ధరల సూచి (సీపిఐ)లో 40% వరకు ఆహార పదార్థాలే ఉంటాయి. ద్రవ్యోల్బణాన్ని అదుపులో ఉంచడం దేశ ద్రవ్యవిధానంలో కీలకమైన అంశం. ద్రవ్యోల్బణం తగ్గడం వ్యవసాయ ఉత్పత్తుల ధరలను దెబ్బతీసింది. ద్రవ్యోల్బణాన్ని అదుపులో ఉంచడానికి వ్యవసాయాదాయాన్ని నియంత్రించడం మంచిది కాదు. విధాన నిర్ణేతలు ఎదుర్కొంటున్న అతిపెద్ద రాజకీయ–ఆర్థిక సమస్య ఇది.
సాయం కంటితుడుపేనా?
2022 నాటికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని ఇప్పటికే ప్రకటించిన ఎన్డీయే ప్రభుత్వం ఎన్నికల వేళ పెట్టుబడి సాయం రూపంలో తాయిలాలు ప్రకటించింది. భారత్‌లో వ్యవసాయ రంగంపై ఆధారపడిన వారి సంఖ్య 50 శాతానికి పైనే అయినా, ఆ రంగం నుంచి వస్తున్న స్థూల జాతీయోత్పత్తి అంతకంతకు తగ్గిపోయి 17–18 శాతానికి చేరుకుంది. సాధారణ ద్రవ్యోల్బణం కంటే ఆహార ద్రవ్యోల్బణం దారుణంగా పడిపోతోంది. ఇలాంటి పరిస్థితుల్లో పెట్టుబడి సాయం చేయడం కంటి తుడుపు చర్యేనన్న అభిప్రాయం వ్యక్తమవు తోంది. పండిన పంటకి గిట్టుబాటు ధర కల్పిం చడం, వ్యయ భారాన్ని తగ్గించడం, పంట నిల్వ వసతుల్ని మెరుగుపరచడం లాంటి వాటిపై దృష్టి సారించాలి. రాష్ట్రాల వారీగా అక్కడున్న ఖర్చుల ఆధారంగా పెట్టుబడి వ్యయాన్ని నిర్ణయించాలని వ్యవసాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment