రాష్ట్ర రైతులకు కేంద్రం ‘పెట్టుబడి’  2,824 కోట్లు | Central Govt investment for State Farmers is 2824 crores | Sakshi
Sakshi News home page

రాష్ట్ర రైతులకు కేంద్రం ‘పెట్టుబడి’  2,824 కోట్లు

Published Sat, Feb 2 2019 4:47 AM | Last Updated on Sat, Feb 2 2019 11:48 AM

Central Govt investment for State Farmers is 2824 crores - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో ప్రవేశపెట్టిన ‘ప్రధానమంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధి’పథకం కింద తెలంగాణలో 47.08 లక్షల మంది సన్న, చిన్నకారు రైతులు రూ. 2,824 కోట్ల పెట్టుబడి సాయం పొందనున్నారు. ఆయా రైతులందరికీ రూ. 2 వేల చొప్పున మూడు విడతల్లో (ఏటా రూ. 6 వేలు) వారి బ్యాంకు ఖాతాల్లో సొమ్ము జమ కానుంది. ప్రస్తుత రబీ సీజన్‌కు అంటే గతేడాది డిసెంబర్‌ నుంచి ఈ పథకం అమలులోకి వస్తున్నందున ఈ ఏడాది మార్చి నాటికి రైతులకు డబ్బు జమ అవుతుందని భావిస్తున్నారు. అందుకు అవసరమైన రైతు బ్యాంకు ఖాతా నంబర్లను కేంద్ర ప్రభుత్వానికి అప్పగిస్తామని రాష్ట్ర వ్యవసాయశాఖ వర్గాలు తెలిపాయి. 

రాష్ట్రంలో 90 శాతం మంది రైతులకు ప్రయోజనం... 
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పెట్టుబడి పథకం వల్ల రాష్ట్రంలోని 90 శాతం మంది రైతులకు ప్రయోజనం కలుగనుంది. వ్యవసాయశాఖ లెక్కల ప్రకారం తెలంగాణలో మొత్తం రైతుల సంఖ్య 57.24 లక్షలుకాగా అందులో ఐదెకరాల లోపున్న సన్న, చిన్నకారు రైతుల సంఖ్య 47.05 లక్షలుగా (అంటే 90 శాతం మంది) ఉంది. సన్న, చిన్నకారు రైతుల్లో అత్యధికంగా ఎకరం లోపు భూమి ఉన్నవారు 14.86 లక్షల మంది ఉన్నారు. రాష్ట్రంలో 1.40 కోట్ల ఎకరాల వ్యవసాయ భూమి ఉండగా సన్న, చిన్నకారు రైతుల చేతిలో 95.59 లక్షల ఎకరాలు (అంటే 68.05 శాతం) ఉంది.  

‘రైతుబంధు’ఆదర్శంగా... 
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతుబంధు పథకాన్ని ఆదర్శంగా తీసుకొని కేంద్రం ప్రధానమంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధి పథకానికి శ్రీకారం చుట్టింది. అయితే కేంద్రం తెచ్చిన ఈ పథకాన్ని దేశవ్యాప్తంగా ఇప్పటికిప్పుడు అమలు చేయడం అంత సులువు కాదని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. అన్ని రాష్ట్రాల్లోనూ రైతుల బ్యాంకు ఖాతాలు అందుబాటులో లేకపోవడమే అందుకు కారణమని, కాబట్టి సార్వత్రిక ఎన్నికల నాటికి రైతు బ్యాంకు ఖాతాలను సేకరించి ఇవ్వడమనేది సులువైన వ్యవహారం కాదని చెబుతున్నారు. 

లక్ష్యం ఒకటే అయినా ... 
రాష్ట్రం అమలు చేస్తున్న రైతుబంధు పథకం, కేంద్రం తెచ్చిన పెట్టుబడి సాయం పథకం లక్ష్యం రైతులను ఆర్థికంగా ఆదుకోవడమే అయినప్పటికీ వాటి అమలు మాత్రం వేర్వేరుగా ఉంది. తెలంగాణలో రైతుబంధు కింద ప్రస్తుతం ఎకరాకు రూ. 4 వేల చొప్పున పెట్టుబడి సాయం ఇస్తుండగా కేంద్రం ఐదెకరాల్లోపు వ్యవసాయ భూమి ఉన్న రైతులకే ఏటా రూ.6 వేల చొప్పున సాయం అందించనుంది. ఈ లెక్కన ఐదెకరాలున్న ఒక రైతు.. రైతుబంధు ద్వారా ఏడాదికి రెండు సీజన్లకు కలిపి రూ.40 వేలు పొందితే కేంద్ర పథకం ద్వారా రెండు సీజన్లకూ కలిపి రూ.6 వేలే పొందుతాడు. దీనిపై పలువురు రైతులు పెదవి విరుస్తున్నారు. రాష్ట్రంలో రైతుబంధు కింద అన్ని వర్గాలూ పెట్టుబడి సాయం పొందుతుండగా మోదీ ప్రభుత్వం తెచ్చిన పథకంతో ఇప్పుడు సన్న, చిన్నకారు రైతులకే అదనంగా కేంద్ర సాయం అందనుందని వ్యవసాయశాఖ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. కేంద్ర పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వంతో కలిపి అమలు చేస్తే కేంద్రానికి పేరు రాదన్న భావనతోనే విడిగా అమలు చేస్తున్నారంటున్నారు.

తెలంగాణ ఊసే లేదు 
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ ప్రభుత్వం అమలుచేస్తున్న రైతు బంధు పథకాన్ని స్ఫూర్తిగా తీసుకుని కేంద్ర ప్రభుత్వం తాజా బడ్జెట్‌లో రైతుబంధు తరహాలో ఐదెకరాలలోపు రైతుకు ఏటా రూ.6 వేల చొప్పున సాయాన్ని ప్రకటించింది. ఈ ఒక్క విషయంలోనే తెలంగాణ చర్చకు వచ్చింది తప్ప బడ్జెట్‌లో తెలంగాణకు సంబంధించి ప్రత్యేక ప్రస్తావనే లేదు. ఏపీ, తెలంగాణలో కలిపి గిరిజన విశ్వవిద్యాలయాలకు రూ.8 కోట్లు కేటాయించారు. ఈ అంశంలో తప్ప మరెక్కడా తెలంగాణ ప్రస్తావన రాలేదు. ఏపీ పునర్‌ వ్యవస్థీకరణ చట్టం ప్రకారం పారిశ్రామికాభివృద్ధికి ఇవ్వాల్సిన రాయితీల్లో భాగంగా ఏపీకి, తెలంగాణకు కలిపి వడ్డీ రాయితీ కింద 2018–19 బడ్జెట్‌ అంచనాలను రూ.100 కోట్లుగా చూపారు. సవరించిన అంచనాల్లో సున్నాగా చూపారు. అంటే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో నిధులు కేటాయించలేదు. 2019–20కి కూడా నిధులు కేటాయించలేదు. ఎక్స్‌టర్నల్‌ ఎయిడెడ్‌ ప్రాజెక్టులు, పలు జాతీయ సంస్థలకు ఏటా ఇచ్చే సాధారణ ప్రణాళికేతర వ్యయాన్ని కొన్ని పద్దుల్లో చూపారు. తెలంగాణలో ప్రతిపాదిత ఎయిమ్స్‌కు నిధుల ప్రస్తావన ఈ బడ్జెట్‌లో కనిపించలేదు. పునర్‌ వ్యవస్థీకరణ చట్టంలో ప్రతిపాదించిన బయ్యారంలో స్టీలు ఫ్యాక్టరీ ఏర్పాటు ప్రస్తావన కూడా ఈ బడ్జెట్‌లో లేదు. 

కేంద్ర పన్నుల్లో వాటా ఇలా.. 
తెలంగాణకు 2019–20 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర పన్నుల్లో రాష్ట్రాలకు పంచే మొత్తం (42 శాతం వాటా) నిధుల్లో 2.437 శాతం దక్కింది. ఇది రూ.20,583.05 కోట్లకు సమానం. గత ఏడాదికంటే దాదాపు రూ.2,022 కోట్లు అధికం. ఇందులో కార్పొరేషన్‌ టాక్స్‌ రూ.6,665.84 కోట్లు, ఆదాయ పన్ను రూ.5,600.58 కోట్లు, సెంట్రల్‌ జీఎస్టీ రూ.6,229.45 కోట్లు, కస్టమ్స్‌ టాక్స్‌ రూ.1,293 కోట్లు, కేంద్ర ఎక్సైజ్‌ డ్యూటీ రూ.794 కోట్లు ఉన్నాయి. 2014–15తో పోల్చితే ఇప్పుడు కేంద్ర పన్నుల్లో వచ్చే వాటా రెట్టింపు కావడం విశేషం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement