సాక్షి, హైదరాబాద్ : వ్యవసాయ భూమి ఎంతున్నా రైతుబంధు సొమ్మును అందరికీ వర్తింపజేయాలని సర్కారు భావిస్తే, వ్యవసాయశాఖ మాత్రం ఆ ఆదేశాలను పట్టించుకోవడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. ప్రభుత్వం నుంచి ఎటువంటి ఆదేశాలు రాకపోయినా స్వతహాగా సీలింగ్ అమలు చేస్తుండటంపై విమర్శలు వస్తున్నాయి. 50 ఎకరాలు దాటిన రైతులకు పెట్టుబడి సాయాన్ని నిలిపివేసినట్లు ఫిర్యాదులు వస్తున్నాయి. ఈ విషయాన్ని వ్యవసాయ వర్గాలు అంతర్గతంగా అంగీకరిస్తున్నా, బహిరంగంగా దీనిపై మాట్లాడటం లేదు. ‘మాకు సర్కారు నుంచి ఎటువంటి ఆదేశాలు జారీ కాలేదు. కానీ 50 ఎకరాలు దాటిన వారికి మాత్రం పెట్టుబడి సొమ్మును నిలిపివేశాం’అని ఓ సీనియర్ అధికారి ‘సాక్షి’కి తెలిపారు. గత రబీలోనూ కొందరు రైతులకు ఇలాగే రైతుబంధు సొమ్మును నిలిపివేసినట్లు అప్పట్లో రైతుల నుంచి ఫిర్యాదులు వచ్చాయి. సీలింగ్‌పై సర్కారు ఎలాంటి మార్గదర్శకాలు జారీ చేయకున్నా అంతర్గతంగా నిర్ణయం తీసుకొని అమలు చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. వాస్తవంగా ప్రభుత్వం ప్రతీ రైతుకు పెట్టుబడి సాయం చేయాలని భావించి బడ్జెట్లో రూ.12 వేల కోట్లు కేటాయించిన సంగతి తెలిసిందే. మొత్తం 54.50 లక్షల మందికి ఈ ఖరీఫ్‌లో ఇచ్చేందుకు కూడా ఏర్పాట్లు చేసింది.
‘గివ్ ఇట్ అప్’నే ప్రోత్సహించాలన్న సర్కారు...
రైతు బంధు పథకం ప్రపంచవ్యాప్త మన్ననలు పొందడంతో పాటు ఏకంగా ఐక్యరాజ్యసమితి కూడా ప్రశంసించింది. దేశంలో పలు రాష్ట్రాలు ఈ పథకాన్ని ఆదర్శంగా తీసుకుని అమలు చేస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం కూడా దీన్ని మోడల్‌గా తీసుకొని పీఎం–కిసాన్ అనే పథకాన్ని ప్రవేశపెట్టింది. కానీ కేంద్రం మొదలు ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా తెలంగాణ మాదిరిగా దీన్ని అమలుచేయడంలేదు. ఇంత సొమ్మును ఏ ప్రభుత్వం ఇవ్వడంలేదు. ప్రతీ రైతుకు ఎకరానికి రూ.5 వేల చొప్పున ఏడాదికి రెండు సీజన్లకు కలిపి రూ.10 వేలు రైతుబంధు కింద ఇస్తున్నారు. మొదట్లో దీని అమలుకు సీలింగ్ తీసుకురావాలని కొందరు అధికారులు ప్రతిపాదించారు. కానీ ముఖ్యమంత్రి దాన్ని ఒప్పుకోలేదు. ఎవరైనా పెద్ద రైతులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి వదులుకుంటే సరేనని, లేకుంటే వ్యవసాయ భూమి ఎంతున్నా ఇవ్వాలన్న నిర్ణయాన్ని తీసుకున్నారు.
స్వచ్ఛందంగా పెట్టుబడి సాయాన్ని వదులుకునే వారి కోసం ‘గివ్ ఇట్ అప్’విధానాన్ని ప్రవేశపెట్టారు. ఆ మేరకు సంబంధిత పెద్ద రైతులు వ్యవసాయాధికారులకు గివ్ ఇట్ అప్ ఫారం ఇవ్వాలని సూచించారు. అలా వదులుకున్న సొమ్మును రైతు సమన్వయ సమితి నిధికి పంపిస్తామని కూడా సర్కారు స్పష్టం చేసింది. కానీ స్వచ్ఛందంగా వదులుకోవడంపై ప్రచారం చేయాల్సిన అధికారులు ఇలా 50 ఎకరాలు దాటిన రైతులకు పెట్టుబడి సాయాన్ని నిర్భందంగా నిలిపివేయడంపై విమర్శలు వస్తున్నాయి. దీనిపై కొందరు రైతులు కోర్టుకు వెళ్లినట్లు సమాచారం. వారిలో కొందరిని అధికారులు బుజ్జగించి సొమ్ము అందజేస్తున్నట్లు తెలిసింది. మొత్తం రైతుల్లో 50 ఎకరాలకు పైగా వ్యవసాయ భూమి ఉన్న రైతుల సంఖ్య దాదాపు లక్షన్నర నుంచి రెండు లక్షల మంది ఉంటారని అంచనా. ‘గివ్ ఇట్ అప్’కు స్పందన రాకపోవడంతో అధికారులు ఇలా చేస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. రైతులు కూడా దీన్ని తప్పుబడుతున్నారు. ఇదిలావుండగా సీలింగ్‌పై ఏ అధికారి కూడా అధికారికంగా స్పందించడంలేదు.
ఇప్పటివరకు రూ. 3,430 కోట్లు అందజేత...
ఈ ఏడాది ఖరీఫ్ రైతుబంధు కింద 33.70 లక్షల మంది రైతులకు రూ. 3,430 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేసినట్లు వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి సి.పార్థసారధి ఒక ప్రకటనలో తెలిపారు. మిగిలిన సొమ్మును కూడా విడతల వారీగా జమ చేస్తామని ఆయన పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment