
బ్యాంకాక్: విశ్వాసానికి మరోపేరు కుక్క. మూడురోజుల క్రితం థాయ్‌లాండ్‌లో జరిగిన ఓ ఘటన దాన్ని మరోసారి రుజువుచేసింది. యజమాని ప్రమాదానికి గురై మరణించినా.. ఇకనైనా వస్తాడని ఆశగా ఎదురుచూస్తున్న ఓ శునకం వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. థాయ్‌లాండ్‌లోని చాంతాబురిలో సోంపార్న్ సితోంగ్‌కుమ్ (56) అనే రైతు శుక్రవారం ఉదయం పొలానికి నీళ్లు పెట్టేందుకు వెళ్లాడు. బావి గట్టున ఉన్న స్పింక్లర్ వాల్వ్ ఆన్ చేస్తుండగా ప్రమాదవశాత్తూ బావిలో పడిపోయాడు. అతనికి ఈదడం తెలియకపోవడంతో నీట మునిగి మరణించాడు. అయితే, అప్పటి వరకు వ్యవసాయ క్షేత్రంలోనే ఉన్న తన యజమాని కనిపించకపోవడంతో తన పెంపుడు కుక్క ‘మ్హీ’ అతన్ని వెతుక్కుంటూ బావి వద్దకు వచ్చింది.
బావి గట్టుపై ఉన్న సోంపార్న్ చెప్పులు, టార్చ్‌లైట్ వద్ద అతనికోసం పడిగాపులు కాసింది. ఈక్రమంలో తన సోదరుణ్ణి వెతుక్కుంటూ పొలం వద్ద వచ్చిన సోంపార్న్ చెల్లెలు బావి గట్టున ‘మ్హీ’ని చూసి ఆందోళనకు గురైంది. సోంపార్న్ కోసం ఎంత కేకలేసిన లాభం లేకపోయింది. తన అన్న ప్రమాదావశాత్తూ బావిలో పడిపోయి ఉండొచ్చని గ్రహించిన ఆమె వెంటనే రెస్క్యూ టీంకు సమాచారం ఇచ్చింది. రెస్క్యూ బృందం బావిలోంచి సోంపార్న్ మృతదేహాన్ని బయటకు తీశారు. సోంపార్న్‌కు ఆరోగ్యం సరిగా లేదని, అందువల్ల స్పింక్లర్ వాల్వ్ ఆన్ చేసే సమయంలో తూలి బావిలో పడిపోయి ఉండొచ్చని ఆమె కన్నీరుమున్నీరైంది. ‘మ్హీ’ సోంపార్న్ మంచి స్నేహితులని ఆమె సోదరి తెలిపింది. యజమాని మరణంతో దీనంగా కూర్చున్న ‘మ్హీ’ పరిస్థితిపై నెటిజన్లు సానుభూతి వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment