విశ్వాసానికి మరోపేరు కుక్క. మూడురోజుల క్రితం థాయ్‌లాండ్‌లో జరిగిన ఓ ఘటన దాన్ని మరోసారి రుజువుచేసింది. యజమాని ప్రమాదానికి గురై మరణించినా.. ఇకనైనా వస్తాడని ఆశగా ఎదురుచూస్తున్న ఓ శునకం వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. థాయ్‌లాండ్‌లోని చాంతాబురిలో సోంపార్న్ సితోంగ్‌కుమ్ (56) అనే రైతు శుక్రవారం ఉదయం పొలానికి నీళ్లు పెట్టేందుకు వెళ్లాడు. బావి గట్టున ఉన్న స్పింక్లర్ వాల్వ్ ఆన్ చేస్తుండగా ప్రమాదవశాత్తూ బావిలో పడిపోయాడు. అతనికి ఈదడం తెలియకపోవడంతో నీట మునిగి మరణించాడు. అయితే, అప్పటి వరకు వ్యవసాయ క్షేత్రంలోనే ఉన్న తన యజమాని కనిపించకపోవడంతో తన పెంపుడు కుక్క ‘మ్హీ’ అతన్ని వెతుక్కుంటూ బావి వద్దకు వచ్చింది.