ఘటనా స్థలంలో గోపాల్ మృతదేహం కొల్లు గోపాల్ (ఫైల్)
బలికొడవలూరు: విద్యుదాఘాతానికి గురై రైతు మృతిచెందిన ఘటన మండలంలోని ఆలూరుపాడు మజరారెడ్డిపాళెంలో బుధవారం చోటుచేసుకొంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. గ్రామానికి చెందిన కొల్లు గోపాల్ (58) తన సొంత పొలంలో గడ్డి కోసేందుకు బుధవారం ఉదయం 10.30 గంటల ప్రాంతంలో వెళ్లాడు. గడ్డి కోస్తుండగా పొలంలోని విద్యుత్ మోటార్‌కు నేలపై నుంచి వెళ్లిన విద్యుత్ తీగ దట్టంగా పెరిగిన పచ్చికలో కనిపించలేదు. ఈ క్రమంలో తీగను పట్టుకోవడంతో షాక్‌కు గురై అక్కడికక్కడే మృతిచెందాడు.
ఆయనతోపాటే వచ్చిన గ్రామానికి చెందిన మరో రైతు గడ్డి కోసుకుని తిరిగి వస్తుండగా గోపాల్ విగతజీవిగా పడి ఉండటాన్ని గుర్తించి కుటుంబసభ్యులకు సమాచారం అందించాడు. వారు ఘటనా స్థలానికి చేరుకుని భోరున విలపించారు. మృతుడికి భార్య, ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. గంట ముందే ఇంటి నుంచి గడ్డి కోసం వెళ్లిన భర్త కళ్ల ముందే విగతజీవిగా మారడాన్ని జీర్ణించుకోలేకపోయిన మృతుడి భార్య రాజమ్మ లబోదిబోమని ఏడుస్తుండటం అందర్నీ కలచివేసింది. మృతుడి కుమారుడు వెంకటేశ్వర్లు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్సై శ్రీనాథ్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment