చేయూత కరువు | Farmers Suicide In Chandrababu Naidu Government | Sakshi
Sakshi News home page

చేయూత కరువు

Published Mon, May 6 2019 9:19 AM | Last Updated on Tue, Jun 4 2019 5:02 PM

Farmers Suicide In Chandrababu Naidu Government - Sakshi

ఒంగోలు సబర్బన్‌: గతంలో తుపాన్ల వల్ల రైతులు పంటలు ఎక్కువగా నష్టపోయేవారు. అలాంటిది గత ఐదు సంవత్సరాల నుంచి జిల్లా ప్రజలు తుపాన్లు రావాలని ఎదురు చూడటం పరిపాటిగా మారింది. ప్రకృతి ప్రకోపానికి రైతన్న తీవ్ర నష్టాల పాలయ్యాడు...తద్వారా వచ్చిన కరువు రైతన్నను వెంటాడి కాటేస్తున్నా పాలకుల నిర్లక్ష్యం ఫలితంగా కనీసం సాయం కూడా అందని దుస్థితి. నష్టంపై సరైన నివేదికలు పంపించకపోవటం, ఒకవేళ పంపించినా తరువాత పట్టించుకోకపోవటంతో ఈ సమస్యలు తలెత్తుతున్నాయి. ఇదిలా ఉంటే నష్టం అంచనాలు పంపించినా ఆమోదించిన ప్రభుత్వం నిధులు విడుదల చేయకుండా కాలయాపన చేసింది. ఐదేళ్ల నుంచి కరువు కాటేసినా వరుసగా ఈ రెండేళ్లు పరిస్థితి మరీ దారుణంగా మారింది.
 
కరువు వచ్చినా... ప్రకృతి వైపరీత్యాలు బుసకొట్టినా రైతులకు మాత్రం నష్టపరిహారం దక్కడం లేదు. కరువు చేసిన కరాళ నృత్యం కళ్లారా చూసిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు కనీసం కనికరం కూడా కలగలేదు. దీంతో ఇప్పటికే అప్పులు ఊబిలో కూరుకుపోయిన రైతన్నలు బలవన్మరణాలకు పాల్పడాల్సిన పరిస్థితి దాపురించింది. కరువు, ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టపోయిన రైతాంగానికి  రెండేళ్ల నుంచి కరువు నష్టం కింది ఇవ్వాల్సిన ఇన్‌పుట్‌ సబ్సిడీ అందనే లేదు.  2017–18, 2018–19 వ్యవసాయ సీజన్‌లకు గాను రావాల్సిన దాదాపు రూ.450.80 కోట్ల కోసం రైతన్నలు ఎదురు చూస్తూనే ఉన్నారు.  వ్యవసాయ అధికారులు జిల్లాలోని పంట నష్టాల లెక్కలను తేల్చి పంపటం మినహా రైతాంగానికి ఈ రెండేళ్లలో ఒక్క పైసా కూడా  చేరలేదు.

కరువు చూసి కేంద్ర కరువు బృందమే కరిగింది: 
ఈ రెండేళ్లలో మూడు, నాలుగు సార్లు జిల్లాకు వచ్చిన కేంద్ర కరువు బృందమే కరిగిపోయింది. జిల్లా కేంద్రం ఒంగోలులో జిల్లా అధికారులు చూపిన ఫొటో ఎగ్జిబిషన్‌ చూసిన కేంద్ర బృందంలోని అధికారులు ఇంతటి పరిస్థితుల ఉన్నాయా అంటూ నివ్వెరబోయారు. తీరా క్షేత్ర స్థాయిలోకి వెళ్లిన అధికారుల బృందం ఒకటి, రెండు ప్రాంతాలు చూసి చలించిపోయి ఇక జిల్లా మొత్తం చూడాల్సిన అవసరం లేదని అంతటా ఇలానే ఉంటుందని అర్థమైందని తెలుసుకున్న బృందం సభ్యులు కేంద్రానికి నివేదిక ఇస్తామని జిల్లా అధికారులకు చెప్పిమరీ వెనుతిరిగి వెళ్లిపోయారు. కానీ చంద్రబాబు ప్రభుత్వం కేంద్రం నుంచి కరువు నిధులు రాబట్టుకోవటంలో పూర్తిగా విఫలమైంది. దీంతో కరువు వల్ల నష్టపోయిన రైతాంగానికి ఇన్‌పుట్‌ సబ్సిడీ రాక అల్లాడిపోతున్నారు.
 

  • 2015 సంవత్సరంలో జిల్లాలోని 56 మండలాలను కరువు మండలాలుగా ప్రకటించారు. ఆ సంవత్సరం పంట నష్టం దాదాపు రూ.100 కోట్లకు పైగా జరిగింది. కానీ రైతాంగానికి ఇచ్చింది మాత్రం రూ.33.97 కోట్లు.
  • 2016లో కూడా 56 మండలాలను కరువు మండలాలుగా ప్రకటించారు. అప్పట్లో దాదాపు రూ.150 కోట్లకు పైగా జిల్లా రైతాంగం నష్టపోయారు. కానీ ప్రభుత్వం నష్ట పరిహారం ఇచ్చింది మాత్రం రూ.72.58 కోట్లు.
  • 2017లో ఖరీఫ్‌లో 88,425 హెక్టార్లలో రైతులు పంట నష్టపోయారు. అధికారులు అరకొరగా నష్టాన్ని అంచనా వేసి ప్రతిపాదనలు పంపారు. కానీ పరిహారం కింద రూ.74.24 కోట్లు మాత్రమే ప్రభుత్వం ప్రకటించింది.
  • ఇకపోతే 2017 రబీలో కూడా చీరాల మినహా జిల్లాలోని 55 మండలాలను కరువు మండలాలుగా ప్రకటించారు. నష్టం కింద దాదాపు రూ.130 కోట్లతో అంచనాలు రూపొందించి ప్రభుత్వానికి పంపారు. 
  • 2018లో జిల్లాలో అధికారులు 56 మండలాలను కరువు మండలాలుగా ప్రకటించారు. తద్వారా ఖరీఫ్‌ పంట నష్టం రూ.140 కోట్లు జరిగిందని అధికారులు నివేదికలు రూపొందించి  ప్రభుత్వానికి పంపారు. ఖరీఫ్‌లో 1.25 లక్షల హెక్టార్లలో పంటను నష్టపోయినట్లు కూడా అధికారులు లెక్కలు తేల్చారు. అందుకుగాను దాదాపు 1.54 లక్షల మంది రైతులు ఒక్క ఖరీఫ్‌ సీజన్‌లో నష్ట పోయారంటే జిల్లాలో కరువు పరిస్థితి ఏవిధంగా ఉందో అట్టే అర్థమవుతోంది. జిల్లాలో మినుము, కంది, పత్తి, ఆముదం, సజ్జ, జొన్న, అలసంద, పెసర, నువ్వు పంటలు నష్టపోయినట్లు తేల్చారు. ఈ ఏడాది ఖరీఫ్‌ సీజన్‌లో మొత్తం 2.27 లక్షల హెక్టార్లలో పంటలు సాగు చేయాల్సి ఉండగా 2 లక్షల హెక్టార్లలోనే రైతాంగం పంటలను సాగు చేశారు. అందులో 1.25 లక్షల హెక్టార్లలో పంట నష్టపోయినట్లు లెక్కలు తేల్చారు. అంటే 75 వేల హెక్టార్లలో పంటలు పండినట్లు అధికారులే నిర్ధారించారు.
     
  • 2018 (2018–19 వ్యవసాయ సీజన్‌) రబీలో 40 మండలాలను అధికారులు కరువు మండలాలుగా ప్రకటించారు. పంటల నష్టం దాదాపు రూ.106.56 కోట్లు నష్టం వాటిల్లిందని ప్రభుత్వానికి నివేదికలు పంపారు. రబీలో 1,30,446 మంది రైతులు 1,12,803 హెక్టార్లలో పంటలు నష్టపోయారు. అయితే జిల్లా రైతాంగం మాత్రం జిల్లాలోని మిగతా 16 మండలాలను కూడా కరువు మండలాలుగా ప్రకటించాలని అధికారులను వేడుకున్నారు. దాంతో అధికారులు ఆ మేరకు ప్రభుత్వానికి నివేదిక పంపారు. కానీ ఇప్పటి వరకూ మిగతా మండలాలను కరువు కింద ప్రకటిస్తున్నట్లు ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రతిపాదనలు జిల్లా అధికారులకు రాలేదు.    

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement