ప్రాణాలు పోతున్నయ్‌.. | want to under pass on 44th national highway | Sakshi
Sakshi News home page

ప్రాణాలు పోతున్నయ్‌..

Published Tue, Feb 27 2018 11:51 AM | Last Updated on Mon, Oct 1 2018 4:01 PM

want to under pass on 44th national highway - Sakshi

ప్రమాదంలో మృతిచెందిన చిన్నలింగన్న ఫొటోతో కుటుంబసభ్యులు (ఫైల్‌)

నిర్మల్‌: సోన్‌ మండలకేంద్రానికి చెందిన దార్లె చిన్నలింగన్న.. తనకున్న అర ఎకరంలో వ్యవసాయం చేసుకుంటూ.. కూలీ పనులు చేస్తూ.. భార్య శకుంతల, కూతుళ్లు గంగామణి, గోదావరి, కుమారులు రవి, గంగాధర్‌లను పోషించేవాడు. తన రెక్కల కష్టంతో పెద్ద పిల్లల పెళ్లిళ్లూ చేశాడు. ఉన్నదాంట్లో హాయిగా బతుకుతున్న ఆ కుటుంబం ఒక్కసారిగా దుఃఖసాగరంలో మునిగింది. ఇందుకు కారణం.. 2012 ఫిబ్రవరి 3న సోన్‌ బస్టాండ్‌ సమీపంలో 44వ జాతీయ రహదారిపై జరిగిన ప్రమా దం. ఆరోజు గుర్తు తెలియని లారీ ఢీకొట్టడంతో చిన్నలింగన్న అక్కడికక్కడే మృతి చెందాడు. అంతే.. అప్పటివరకు ప్రశాంతంగా ఉన్న వారి కుటుంబం కష్టాల్లో పడింది. భార్య శకుంతల కాయకష్టంతో మిగిలిన పిల్లల పెళ్లిళ్లు చేయాల్సి వచ్చింది.

అందుకు చేసిన అప్పులు తీర్చేం దుకు చేతకాకున్నా కూలీ పనులు చేసింది. ‘ఆరోజు ఆ ప్రమాదం జరగకపోతే తమ కుటుంబానికి ఈ కష్టాలే ఉండేవి కావు..’ అని శకుంతల ఇప్పటికీ కన్నీళ్లు పెట్టుకుం టోంది. ఇదే గ్రామానికి చెందిన సోండి సత్తయ్య కుటుంబానిదీ ఇదే కన్నీటిగాథ.        2014 సెప్టెంబర్‌ 24న పగటిపూట చేన్లకు సైకిల్‌పై వెళ్తుండగా.. మార్గమధ్యలో జాతీయ రహదారి దాటుతుండగా.. గుర్తు తెలియని వాహనం వేగంగా ఢీ కొట్టింది. సత్తయ్య అక్కడికక్కడే కన్నుమూశాడు. ఆ ప్రమాదం ఆయన కుటుంబానికి తీరని దుఃఖాన్ని మిగిల్చింది. ఇలా.. అభంశుభం ఎరుగని అన్నదాతల ప్రాణాలు అర్ధంతరంగా.. అన్యాయంగా.. గాలిలో కలిసిపోవడానికి కారణం ఆ గ్రామానికి అండర్‌ బ్రిడ్జి లేకపోవడమే. తమ ఊరి మీదుగా జాతీయ రహదారి వెళ్తున్నందుకు సంతోష పడాలో.. తమ ఊరోళ్ల ప్రాణాలు పోతున్నందుకు ఏడ్వాలో.. తెలియని పరిస్థితి. ఇది ఈ ఒక్క గ్రామానిదే కాదు. జిల్లాలో చాలాచోట్ల హైవేరోడ్డు ప్రాణాంతకంగా మారింది.

రోడ్డెక్కాలంటే భయం..
జిల్లాకు ప్రవేశద్వారంగా ఉన్న సోన్‌ గ్రామం నుంచే గోదావరిని దాటుతూ దేశంలోనే అతిపెద్ద జాతీయ రహదారి 44 నిర్మల్‌ జిల్లాలోకి ప్రవేశిస్తోంది. సోన్‌ నుంచి మామడ మండలం తాండ్ర గ్రామం వరకు దాదాపు 35కిలో మీటర్ల పొడవు దీని ప్రయాణం సాగుతోంది. ఉత్తర–దక్షిణ భారతాన్ని కలిపే ప్రధాన మార్గమైన ఈ రోడ్డుపై నిత్యం వేల సంఖ్యలో వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి. ఇలాంటి రోడ్డుపైకి వెళ్లాలంటేనే పలు గ్రామాల ప్రజలు భయపడుతున్నారు. ఎక్కడ.. ఏ ప్రమాదం ముంచుకొస్తుందోనని.. ప్రతీ క్షణం బిక్కుబిక్కుమంటున్నారు. 

ఓవైపు ఊరు.. మరోవైపు చేను
ప్రధానంగా సోన్‌ మండలకేంద్రవాసులు ఈ రోడ్డుతో చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇక్కడ అండర్‌ గ్రౌండ్‌ నిర్మించాల్సి ఉన్నా.. అప్పట్లో పట్టించుకోలేదు. పాలకులు, అధికారులూ దృష్టిపెట్టలేదు. అదే.. ఇప్పుడు ఈ గ్రామస్తులకు శాపంగా మారింది. ఈ రోడ్డుకు ఓవైపు గ్రామం ఉండగా, మరోవైపు పంటపొలాలున్నాయి. గ్రామస్తులు పంటపొలాలకు వెళ్లాలంటే కచ్చితంగా హైవేను దాటాల్సిందే. గోదావరి నదిపై బ్రిడ్జి దాటాగానే వచ్చే సోన్‌ ఎక్స్‌రోడ్డు వద్ద వాహనాల వేగమూ ఎక్కువగానే ఉంటుంది. ఈక్రమంలో అరచేతిలో ప్రాణాలు పెట్టుకుని అన్నదాతలు రోడ్డు దాటుతున్నారు. ఈ క్రమంలోనే ఒక్కోసారి ప్రాణాలు పోతున్నాయి.

ఆందోళనలు చేసినా..
జాతీయ రహదారి వెడల్పు పనులు జరుగుతున్న సమయంలోనే గ్రామస్తులు ఆందోళనలు నిర్వహిం చారు. తమకు అండర్‌ పాసింగ్‌కు అవకాశం కల్పిం చాలని కోరారు. అయినా అధికారులు పట్టించుకోలే దు. చివరకు గ్రామస్తులు అప్పటి అధికారి కాళ్లు పట్టుకున్నా ఫలితం లేకపోయింది. తమ పంటపొలాలకు రాత్రిపూట రోడ్డు దాటి వెళ్లాలంటేనే భయంగా ఉందని అప్పట్లోనే గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. దాదాపు 200నుంచి 300 ఎకరాల సాగు భూ ములు రోడ్డు ఆవల ఉన్నాయి. అండర్‌పాసింగ్‌ లేకపోవడంతో వీరి పరిస్థితి ఇబ్బందిగా మారింది. సోన్‌లో దాదాపు 500కు పైగా కుటుంబాలున్నాయి. ఇంత పెద్ద గ్రామమైనా ఇక్కడ అండర్‌ బ్రిడ్జి నిర్మించకపోవడంపై గ్రామస్తులు ఆందోళనలూ వ్యక్తంచేశారు.

ప్రాణాలుపోయినా..
జాతీయరహదారి నిర్మాణం పూర్తయినప్పటి నుంచి ఒక్క సోన్‌ గ్రామం నుంచే పదిమంది వరకు చనిపోయారు. పదుల సంఖ్యలో గాయాలపాలయ్యారు. ఇటీవలే ఓ స్కూల్‌బస్సు నిజామాబాద్‌ జిల్లా నుంచి సోన్‌ గ్రామం వైపు వస్తుండగా ఇక్కడి మూలమలుపు వద్ద వేరే వాహనాన్ని ఢీకొట్టింది. అదృష్టవశాత్తు ఎవరికీ పెద్దగా గాయాలు కాలేదు. ఇలా ఎన్నో ప్రమాదాలు ఇక్కడ సాధారణంగా జరిగిపోతున్నాయి. చనిపోయిన వాళ్లలో అన్నదాతలే ఎక్కువగా ఉంటున్నారు. గతంలో అధికారుల తీరుకు నిరసనగా గ్రామస్తులు ధర్నా చేశారు. అప్పుడు ఎన్‌హెచ్‌ఏఐ పీడీ అహ్మద్‌ అలీ వచ్చి, అండర్‌పాసింగ్‌ నిర్మాణంపై ఉన్నతాధికారులకు నివేదిస్తానని హామీ ఇచ్చారు. ఈమేరకు రూ.11.60కోట్లు మంజూరైనా ఇప్పటివరకు అండర్‌ బ్రిడ్జి నిర్మాణం మాత్రం చేపట్టడం లేదు. సోన్‌తో పాటు మాదాపూర్‌ ఐబీ, కడ్తాల్‌ క్రాస్‌రోడ్డు తదితర చోట్ల హైవే ప్రమాదకరంగా మారింది.

త్వరగా నిర్మించాలి
జిల్లా మీదుగా వెళ్తున్న జాతీయ రహదారి ప్రమాదకరంగా మారింది. మా సోన్‌ గ్రామం వద్ద తప్పనిసరిగా అండర్‌ పాసింగ్‌ కోసం బ్రిడ్జి నిర్మించాల్సి ఉంది. ఇది లేకపోవడంతోనే మాఊరి రైతులు ప్రాణాలు కోల్పోయారు. బ్రిడ్జి నిర్మాణం కోసం నిధులు మంజూరైనట్లు తెలిసింది. త్వరితగతిన పనులు ప్రారంభించాలని సదరు అధికారులను కోరుతున్నాం.– కృష్ణప్రసాద్‌రెడ్డి, సర్పంచ్, సోన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement