భూమి లాక్కుంటారన్న భయంతో.. రైతు మృతి
తమ పంట భూములను అధికారులు బలవంతంగా లాక్కుంటారన్న భయంతో ఒక రైతు ఆర్డీవో కార్యాలయంలోనే గుండెపోటుతో కుప్పకూలిపోయారు. ఆస్పత్రికి తరలిస్తుండగానే ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన పెనుకొండ ఆర్డీవో కార్యాలయంలో చోటుచేసుకుంది. పరిశ్రమల ఏర్పాటు కోసం ప్రభుత్వం తలపెట్టిన భూసేకరణలో భాగంగా ఆర్డీవో ఆఫీసులో గురువారం సమావేశం ఏర్పాటుచేశారు. ఇప్పటికే అక్కడ 600 ఎకరాలు తీసుకోగా, మరో 1400 ఎకరాలు సేకరించాలని ప్రభుత్వం ఆదేశించింది.
దీని కోసం ఏర్పాటుచేసిన సమావేశానికి పలువురు రైతులు, రైతు ప్రతినిధులు హాజరయ్యారు. ఇందులో పాల్గొన్న బాలు నాయక్ (50) ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. ఆయనకు గుండెపోటు వచ్చింది. తమ భూములను బలవంతంగా తీసుకుంటారని గత కొంతకాలంగా ఆయన భయపడుతున్నారని బంధవులు చెబుతున్నారు. ప్రభుత్వం అతి తక్కువ ధరకే తమ విలువైన భూములు తీసుకుంటుందని అనుమానపడుతున్నారని, అందుకే ఆయనకు గుండెపోటు వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. బాలునాయక్ మృతిపట్ల బంధువులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.