గీరప్పగాళ్ల యల్లప్ప మృతదేహం
గట్టు(గద్వాల) : వ్యవసాయ పొలం వద్ద నిద్రించేందుకు రాత్రి వెళ్లిన రైతు, తెల్లారేసరికి శవమై కనిపించాడు. మంగళవారం జరిగిన ఈ సంఘటనతో బల్గెర గ్రామం ఉలిక్కిపడింది. గ్రామస్తులు, పోలీసుల కథనం ప్రకారం... మాజీ ఎమ్మెల్యే గట్టు భీముడు సమీప బంధువు బల్గెర గ్రామానికి చెందిన గీరప్పగాళ్ల యల్లప్ప(52)కు గ్రామ సమీపంలో 5ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. రెండు ఆవులు, రెండు ఎద్దులు ఉన్నాయి. పొలంలోనే గుడిసె వేసుకుని చాలాకాలంగా ఒక్కరే రాత్రి అక్కడే నిద్రిస్తున్నాడు.
సోమవారం కూడా రాత్రి ఇంట్లో భోజనం ముగించుకుని వ్యవసాయ పొలానికి వెళ్లినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మంగళవారం ఉదయం మృతుని సోదరుడు తిమ్మప్ప తన పత్తి పొలంలొ మొగ్గలను తుంచేందుకు వెళ్తున్న క్రమంలో దారి మధ్యలోనే యల్లప్ప పడి ఉండడాన్ని గమనించాడు. వెంటనే కుటుంబ సభ్యులకు తెలిపాడు. పోలీసులకు సమాచారం అందడంతో ఎస్‌ఐ విజయ్‌కుమార్ సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలను సేకరించారు. మృతుని కాళ్లను కర్రలతో కొట్టి చంపినట్లుగా పోలీసులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. కాళ్లు విరిగినట్లు గుర్తించారు. మోచేతికి రక్తగాయం కూడా ఉంది.
ఘటనా స్థలంలో రక్తపు మరకలు ఉన్నాయి. పోలీస్ జాగిలాలతో పరిశీలించిన అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గద్వాల ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతునికి భార్య శంకరమ్మ, ఇద్దరు కుమారులు ఉన్నారు. పెద్ద కుమారుడు తిమ్మప్ప హైదరాబాద్‌లోని ఓయూలో పీజీ చేస్తున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. పొలం కౌలు విషయంలో మూడు నెలల క్రితం పక్కపొలం రైతులు ముగ్గురితో వివాదం జరిగిందని, దీన్ని మనసులో పెట్టుకుని నర్సిములు, స్వాములు, సవారి హత్యకు పాల్పడ్డారని యల్లప్ప కొడుకు బసప్ప అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
పోలీసు జాగిలాలతో అన్వేషణ
గద్వాల నుంచి రప్పించిన పోలీసు జాగిలాలు ఘటనా స్థలంతో పాటుగా చుట్టుపక్కల ఉన్న పత్తి పొలాల్లో తిరిగాయి. క్లూస్ టీం ఘటనా స్థలంలో లభించిన ఆధారాలను సేకరించారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసినట్లు గద్వాల సీఐ వెంకటేశ్వర్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment