విద్యుత్ షార్ట్‌సర్క్యూట్‌తో రైతు మృతి
-
సెల్‌ఫోన్ చార్జింగ్ పెడుతుండగా ఘటన
సంగం : సెల్‌ఫోన్ చార్జింగ్ పెడుతూ విద్యుత్ షార్ట్‌సర్క్యూట్‌కు గురై ఓ రైతు మృతి చెందిన సంఘటన సంగం మండలంలోని సిద్దీపురం పంచాయతీ మజారా అనసూయనగర్‌లో సోమవారం అర్ధరాత్రి జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు అనసూయనగర్‌కు చెందిన అప్పగుంట ఆంజనేయులు (30) రైతు స్థానికంగా తన పొలంలో వేరుశనగ పంట సాగుచేస్తున్నాడు. ఈ క్రమంలో సోమవారం పొలంలోకి వెళ్లి రాత్రి ఇంటికి వచ్చారు. పొలంలో పనిచేసి అలసిపోయిన ఆంజనేయులు ఇంట్లో సెల్‌ఫోన్ చార్జింగ్ పెట్టాలని భార్య ఆమనికి చెప్పాడు. తాను పనిచేస్తున్నానని, మీరే వెళ్లే చార్జింగ్ పెట్టాలని ఆమె భర్తకు చెప్పింది. దీంతో ఆంజనేయులు సెల్‌ఫోన్ చార్జింగ్‌లో పెట్టగా ఒక్కసారిగా విద్యుత్ షార్ట్‌సర్కూ్యట్ అయి చార్జర్ పేలిపోయింది. ఆంజనేయులు అపస్మారక స్థితికి చేరుకున్నాడు. పెద్దగా శబ్ధం రావడంతో వెంటనే వచ్చిన భార్య ఆమని కిందపడి ఉన్న భర్తను చూసి కేకలు వేసింది. కుటుంబసభ్యులు, స్థానికులు వచ్చి చూసేసరికి ఆంజనేయులు మృతి చెంది ఉన్నాడు. కుటుంబ పెద్ద మృతి చెందడంతో భార్య, బిడ్డల రోదనలు మిన్నంటాయి. ఆంజనేయులుకు గతంలో వివాహమై భార్య మృతి చెందగా ఇద్దరు పిల్లలు ఉన్నారు. రెండో భార్య ఆమనికి సైతం ఇద్దరు పిల్లలు ఉన్నారు. భర్త మృతితో నలుగురు చిన్నారులు అనాథలయ్యారు. మంగళవారం సమాచారం అందుకున్న సంగం ఎస్సై వేణు ఆంజనేయులు మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అందచేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.