నిందితుడితో ఘటనా స్థలానికి వెళుతున్న పోలీసులు , చంద్రశేఖర్‌రెడ్డి (ఫైల్)
విడవలూరు (బుచ్చిరెడ్డిపాళెం): పొలాన్ని కౌలుకు ఇచ్చిన రైతు మోడెం చంద్రశేఖర్‌రెడ్డి (56)ని దారుణంగా హత్య చేసిన ఘటన ఆలస్యంగా శనివారం వెలుగుచూసింది. సీఐ కోటేశ్వరరావు కథనం మేరకు.. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాళెం మండలం దామరమడుగు గ్రామానికి చెందిన చంద్రశేఖర్‌రెడ్డికి చెందిన 13 ఎకరాల పొలాన్ని కోవూరు మండలం పాటూరు గ్రామానికి చెందిన సురేష్ అనే వ్యక్తి కౌలుకు తీసుకున్నాడు. ప్రస్తుతం పంట చేతికి రావడంతో పంటను కోయాలని సురేష్ అనుకున్నాడు.
ముందుగా కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం ఎకరానికి 13 వేల రూపాయలను కౌలుగా చెల్లించాల్సి ఉంది. కానీ చంద్రశేఖర్‌రెడ్డి తనకు ఎకరాకు రూ.15 వేలు ఇవ్వాలని గత పది రోజుల కిత్రం డిమాండ్ చేశాడు. దీనికి కౌలు రైతు సురేష్ ఒప్పుకోలేదు. అయితే, పంట తాను కోసుకుని ధాన్యాన్ని విక్రయించి మిగిలిన డబ్బులు ఇస్తానని చంద్రశేఖర్‌రెడ్డి తెలిపాడు. దీనికి సురేష్ ఒప్పుకోలేదు. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈనెల 14న ఇంట్లో నుంచి బయటకు వెళ్లిన చంద్రశేఖర్‌రెడ్డి కనిపించకపోవడంతో అతని భార్య వసుధ పోలీసులకు ఫిర్యాదు చేసింది. వారు చంద్రశేఖర్‌రెడ్డి మొబైల్ ఆధారంగా సురేష్‌తో ఫోన్‌లో మాట్లాడారు. దీంతో తాము దొరికిపోయామని గ్రహించి సురేష్ పోలీసులకు లొంగిపోయి జరిగిన విషయాన్ని తెలిపాడు.
నిందితుడు ఈనెల 14న చంద్రశేఖర్‌ను రేబాలలోని నిర్మానుష్యమైన ప్రాంతానికి రమ్మని చెప్పి అక్కడ అతని చేత పూటుగా మద్యం తాగించాడు. తర్వాత చంద్రశేఖర్‌రెడ్డిని కొట్టి తాడుతో మెడకు ఉరివేసి చంపేశాడు. అనంతరం ఎవరికీ అనుమానం రాకుండా వెంకటేశ్వరపురం వద్ద ఉన్న పెన్నానదిలో పూడ్చి వేశాడు. ఈ మేరకు నిందితుడిని తీసుకెళ్లి పూడ్చిన స్థలానికి చేరుకుని చంద్రశేఖర్‌రెడ్డి మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టంకు తరలించారు. ఈ హత్యలో మొత్తం 6 మంది పాల్గొన్నారని, మిగిలిన 5 మందిని త్వరలోనే అరెస్ట్ చేస్తామని పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment