గుండెపోటుతో రైతు మృతి
Published Mon, Jul 18 2016 12:03 AM | Last Updated on Mon, Oct 1 2018 4:01 PM
పాలకుర్తి టౌన్ : భూ వివాదంలో జరిగిన ఘర్షణలో ఓ రైతు గుండె ఆగి మృతి చెందిన ఘటన పాలకుర్తిలో ఆదివారం చోటు చేసుకుంది. మృతుడి కుటుంబసభ్యులు కథనం ప్రకారం.. పాలకుర్తి గ్రామ పరిధిలో సర్వేనంబర్ 629/81లో 1 ఎకరం అసైన్డ్ భూమి బొమ్మిశెట్టి ఇద్దయ్య(55) పేరున ఉంది. ఈ భూమిని పక్కనున్న మరో రైతు సాగు చేస్తుండటంతో ఇద్దయ్య సర్వేయర్ ద్వారా కొలతలు వేయించి అధికారికంగా తన స్వాధీనం చేసుకుని మూడేళ్లుగా సాగు చేస్తున్నాడు. ఖరీఫ్‌లో పంట వేసి, గుంటుక తోలుతుండగా చిట్యాల సోమయ్య అనే వ్యక్తి అడ్డుకోవడంతో ఇరువురి మధ్య ఘర్షణ జరిగింది. దీంతో ఇద్దయ్య గుండె ఆగి మృతి చెందాడు. అయితే సోమయ్య కొట్టడం వల్లనే తన భర్త మరణించాడని మృతుడి భార్య సుగుణమ్మ, కుమారుడు రవి, కుమార్తెలు ఆరోపిస్తున్నారు. ఈ భూమి ఆక్రమణ విషయమై ఇద్దయ్య నాలుగు రోజుల క్రితం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఇదిలా ఉండగా రైతు మృతిపై ఇంకా ఫిర్యాదు రాలేదని, మృతుడి కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని ఎస్‌ఐ వెంకటేశ్వర్లు తెలిపారు.
Advertisement