ఎన్డీఏ అంటే ‘నో డాటా అవైలబుల్‌’ | Shashi Tharoor Slams NDA For Lack of Data | Sakshi
Sakshi News home page

కేంద్రంపై విరుచుకుపడిన శశి థరూర్‌

Published Tue, Sep 22 2020 2:11 PM | Last Updated on Tue, Sep 22 2020 2:16 PM

Shashi Tharoor Slams NDA For Lack of Data - Sakshi

న్యూఢిల్లీ: లాక్‌డౌన్‌ సమయంలో ఎంత మంది వలస కార్మికులు మరణించారు, ఎంత మంది ఉపాధి కోల్పోయారు అనే విషయాన్ని పార్లమెంట్‌ వేదికగా కాంగ్రెస్‌ ప్రశ్నించింది. అయితే దీనికి సంబంధించి ప్రభుత్వం ఎలాంటి రికార్డులు మెంటయిన్‌ చేయలేదని, ఆ లెక్కలు తమ వద్ద లేవని లేబర్‌ అండ్‌ ఎంప్లాయిమెంట్‌ మంత్రి సంతోష్‌ కుమార్‌ గాంగ‍్వర్‌ వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు శశి థరూర్‌ ఎన్డీఏ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్విట్టర్‌ వేదికగా విమర్శలు కురిపించారు. ఎన్డీఏ అంటే ‘నో డాటా అవైలవుబుల్‌’ అంటూ ఎద్దేవా చేశారు. వలస కార్మికులు, రైతు ఆత్మహత్యలు, కోవిడ్ -19, ఆర్థిక వ్యవస్థపై డాటా లేదు అంటూ శశిథరూర్‌ కేంద్రంపై విరుచుకుపడ్డారు. (చదవండి: అవి రైతుల పాలిట మరణ శాసనాలే!)

ఈ మేరకు ‘ది నేమ్ ఛేంజర్స్’ అనే కార్టూన్‌ను ట్విట్టర్‌లో షేర్‌ చేశారు థరూర్‌. దీనిలో మోదీ, నిర్మలా సీతారామన్‌, అమిత్‌ షాలు ‘నో డాటా అవైలబుల్’‌ అనే ప్లకార్డులు పట్టుకున్నట్లు ఉన్న కార్టూన్‌ని ట్వీట్‌ చేశారు‌. దాంతో పాటు ‘వలస కార్మికులకు సంబంధించి నో డాటా.. రైతు ఆత్మహత్యల గురించి నో డాటా..ఆర్థిక ఉద్దీపనపై తప్పుడు డాటా, కోవిడ్ -19 మరణాలపై సందేహాస్పద డాటా, జీడీపీ వృద్ధిపై మేఘావృత డాటా. ఈ ప్రభుత్వం ఎన్డీఏ అనే పదానికి సరికొత్త అర్థాన్ని ఇస్తుంది’ అంటూ శశి థరూర్ ట్వీట్ చేశారు. (రాజ్యసభ రగడ : విపక్ష ఎంపీల సస్పెన్షన్)

వ్యవసాయ రంగంలో సంభవించే ఆత్మహత్యలు, అందుకు గల కారణాలకు సంబంధించి కేంద్రం దగ్గర ఎలాంటి డాటా లేదంటూ ప్రభుత్వం ప్రకటన చేసిన నేపథ్యంలో శశి థరూర్‌ ఈ ట్వీట్‌ చేశారు. అంతేకాక  కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి సోమవారం మాట్లాడుతూ.. ‘నేషనల్‌ క్రైం రికార్డ్స్‌ బ్యూరో ప్రకారం పలు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు రైతు ఆత్మహత్యలకు సంబంధించి ఎలాంటి డాటా లేదని నివేదించాయని తెలిపారు. ఈ పరిమితి కారణంగా, వ్యవసాయ రంగంలో ఆత్మహత్యకు గల కారణాలపై జాతీయ సమాచారం ఆమోదించడం కానీ విడిగా ప్రచురించడం కానీ జరగలేదు’ అని ఆయన లిఖితపూర్వక సమాధానంలో తెలిపారు. కరోనావైరస్ వ్యాప్తిని అరికట్టడానికి విధించిన దేశవ్యాప్త లాక్‌డౌన్‌ సమయంలో మరణించిన వలసదారుల సంఖ్యపై తమ దగ్గర ఎలాటి డాటా లేదని గతంలో పార్లమెంటులో ప్రభుత్వం అంగీకరించిన సంగతి తెలిసిందే.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement