‘పరిటాల సునీతానే.. ఆయన చావుకు కారణం’ | Farmer Died Reason Of Minister Paritala Sunitha | Sakshi
Sakshi News home page

రైతు కేశవ్‌ చావుకు సునీతే కారణం

Published Wed, Apr 18 2018 8:44 AM | Last Updated on Mon, Oct 1 2018 4:01 PM

Farmer Died Reason Of Minister Paritala Sunitha - Sakshi

వైఎస్సార్‌సీపీ రాప్తాడు సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి

ఆత్మకూరు : ‘మంత్రి పరిటాల సునీత అధికార దాహానికి అంతు లేకుండా పోతోంది. భూ దాహంతో రైతుల ప్రాణాలను సైతం బలిగొంటున్నారు. రైతు కేశవ్‌నాయక్‌ చావుకు మంత్రి సునీతే కారణం’ అంటూ వైఎస్సార్‌సీపీ రాప్తాడు సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి విమర్శించారు. కేశవనాయక్‌ కుటుంబానికి న్యాయం చేయాలంటూ ఆత్మకూరు తహసీల్దార్‌ కార్యాలయాన్ని ప్రకాష్‌రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్సార్‌ సీపీ నాయకులు, కార్యకర్తలు మంగళవారం ముట్టడించారు. కార్యక్రమానికి సీపీఎం ఉత్తర ప్రాంత జిల్లా కార్యదర్శి వి.రాంభూపాల్, సీపీఐ నాయకులు మద్ధతు పలికారు. 

మండలాలు పంచుకుని.. 
రాప్తాడు నియోజకవర్గంలోని ఒక్కొ మండలానికి ఇన్‌చార్జ్‌గా తన బంధువులను నియమించి మంత్రి సునీత పెత్తందారి పాలన సాగిస్తున్నారని ప్రకాష్‌రెడ్డి విమర్శించారు. నియోజకవర్గంలో ఏ పని చేయాలన్నా అధికారులు ముందుగా మంత్రి గడప తొక్కాల్సి వస్తోందన్నారు. ఇన్‌పుట్‌ సబ్సిడీని మంత్రి సోదరుడు బాలాజీ చెప్పిన వారికే స్థానిక వ్యవసాయాధికారి పంపిణీ చేశారని గుర్తు చేశారు. ఎంపీడీవో ఆదినారాయణ పచ్చ చొక్కా వేసుకున్న అధికార పార్టీ కార్యకర్తలా పనిచేస్తున్నారని ఎద్దేవా చేశారు. సర్పంచ్‌లను కీలుబొమ్మలను చేసి ఆడిస్తున్నారన్నారు. టీడీపీలో చేరకపోతే చెక్‌ పవర్‌ రద్దు చేస్తామంటూ సాక్షాత్తూ ఓ అధికారి చెప్పడం సిగ్టుచేటన్నారు. అన్యాయాలపై పోలీసులు సైతం కళ్లు మూసుకున్నారన్నారు. అన్యాయాలపై ప్రజలు తిరగబడితే మంత్రి సునీతనే కాదు ఎవరూ కాపాడలేరంటూ బాలాజీకి హితవు పలికారు. 
నాలుగేళ్ల పాలనలో అక్రమాల పుట్ట
నాలుగేళ్ల పాలనలో నియోజకవర్గంలో మంత్రి సునీత అక్రమాలకు అంతులేకుండా పోయిందన్నారు. వైఎస్సార్‌ సీపీ సర్పంచ్‌లుగా ఉన్న గ్రామాల్లో అభివృద్ధి పనులు అడ్డుకున్నారన్నారు. వై.కొత్తపల్లిలో రూ.20 లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణ పనులను డి.నారాయణస్వామి చేస్తున్నాడని గుర్తు చేశారు. ఓ ప్రభుత్వ ఇంజినీర్‌ ఈ పనులు ఎలా చేస్తారని ప్రశ్నించారు. కుర్లపల్లి వద్ద దళితులకు ఇచ్చిన భూమిని మంత్రి బంధువు లాగేసుకుని కంకర మిషన్‌ వేసి, సిద్ధరాంపురం వద్ద అనధికారికంగా గుట్టలను ఆన్‌లైన్‌లో వారి పేరుపై చేసుకున్నారన్నారు. పుట్టపర్తి వద్ద బైపాస్‌ నిర్మాణానికి ఎకరాకు రూ.23 లక్షలు ఇస్తుండగా ఆత్మకూరు వద్ద మాత్రం ఎకరాకు రూ.5 లక్షల ఇచ్చి అన్నదాతల పొట్టగొట్టే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ఇప్పటికైనా తాము చేస్తున్నది అక్రమమని అధికారులు గుర్తించి, ప్రజలకు న్యాయం చేకూర్చకపోతే మండలంలో ఏ ఒక్క ప్రభుత్వాధికారిని తిరగబోనివ్వమని హెచ్చరించారు. 
రూ. 20 లక్షలు పరిహారం ఇవ్వండి
ఆత్మహత్య చేసుకున్న రైతు కేశవనాయక్‌ కుటుంబానికి రూ. 20 లక్షల పరిహారంతో పాటు ఐదు ఎకరాల పొలాన్ని ఇవ్వాలని ప్రకాష్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. కాగా, ఆందోళన విషయం ముందుగానే తెలుసుకున్న తహసీల్దార్‌ మంగళవారం విధులకు రాలేదు. దీంతో ఆర్డీవో మలోలాతో ప్రకాష్‌రెడ్డి, సీపీఎం నేతలు నేరుగా ఫోన్‌లో మాట్లాడారు. అక్రమంగా భూమిని మరొకరి పేరుపై చేసిన తహసీల్దార్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. డిమాండ్‌పై విచారణ జరిపి తహసీల్దార్‌పై చర్యలు తీసుకుంటామని ఆర్డీవో హామీనివ్వడంతో ఆందోళనను విరమించారు. వైఎస్సార్‌సీపీ ఎస్సీ సెల్‌ జిల్లా అధ్యక్షుడు పెన్నోబులేసు, వైఎస్సార్‌సీపీ రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు రాజారాం, పెద్ద  సంఖ్యలో రైతులు పాల్గొన్నారు. 

ముమ్మాటికీ ఇది హత్యే  
అధికారుల చేతిలో రూ. వెయ్యి పెడితే రాత్రికి రాత్రి ఒకరి పేరుమీద ఉన్న పొలాన్ని మరొకరి పేరు మీద మార్చేస్తున్నారు. ఇలా చేసే కేశవ్‌నాయక్‌ ప్రాణాన్ని బలిగొన్నారు. ఆయన భార్యబిడ్డల్ని రోడ్డన పడేశారు. ఇది ముమ్మాటికీ అధికారులు, రాజకీయ నాయకులు కలిసి చేసిన హత్యే. ఆత్మహత్యతో ఈ అన్యాయం వెలుగు చూసింది. ఇలాంటి అన్యాయాలు ప్రతి గ్రామంలోనూ జరుగుతున్నాయి. బాధిత రైతులందరూ ఆత్మహత్య చేసుకుంటూ పోతే శవాల గుట్టలు తేలుతాయి. ప్రభుత్వ కార్యాలయాలు టీడీపీ నాయకుల జాగీరు కాదు.

నియంతృత్వ పాలన 
రాప్తాడు నియోజకవర్గంలో నియంతృత్వ పాలన సాగుతోంది, ఇంకా ఈ ప్రాంత ప్రజలకు స్వాతంత్య్రం రాలేదు. రామగిరి మండలంలో ఏవైనా కార్యక్రమాలకు వెళ్తే మంత్రి పరిటాల సునీత.. టీడీపీ గుండాలతో దాడులను ప్రోత్సహిస్తారు. అంటే మంత్రి సొంత మండలానికి వెళ్లాలంటే వీసాలు, పాస్‌పోర్టులు లాంటివి తీసుకెళ్లాలా? వీరి అక్రమాలు ఎంత ఘోరంగా ఉన్నాయంటే ఇటీవల కనగానపల్లిలో ఓ రెవెన్యూ అధికారిని చెప్పుతో కొట్టారంటే ఇంత కన్నా అన్యాయం ఏముంటుంది?  వైఎస్సార్‌ సీపీలో చేరిన ఎంపీపీని బెదిరించి, బలవంతంగా టీడీపీని వీడకుండా చేశారు. ప్రజలు ఐక్యమత్యంతో ఈ రాక్షస పాలనకు చరమగీతం పాడాలి.

No comments yet. Be the first to comment!
Add a comment
1
1/2

రాంభూపాల్, సీపీఎం ఉత్తర ప్రాంత జిల్లా కార్యదర్శి

2
2/2

బిల్లే ఈశ్వరయ్య, జెడ్పీ ఫ్లోర్‌ లీడర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement