మల్లు రవీందర్‌రెడ్డి, శ్రీశైలం (ఫైల్)
హత్నూర (సంగారెడ్డి): ట్రాన్స్‌ఫార్మర్ పాడైపోయి వారం రోజులు గడిచినా మరమ్మతులు చేయకపోవడంతో రైతులే ఆ పని చేసేందుకు వెళ్లగా విద్యుత్ షాక్‌తో ఇద్దరు మృతి చెందిన ఘటన సంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. అలాగే మోదక్ జిల్లాలో బోరు మోటార్ ఆన్ చేస్తుండగా షాక్‌తో మరో రైతు మరణించాడు. సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం చీక్‌మద్దూర్ గ్రామ రైతులు మల్లు రవీందర్‌రెడ్డి (35), మల్లు మరవెల్లి శ్రీశైలం (37) పొలాల వద్ద ఉన్న ట్రాన్స్‌ఫార్మర్ పాడైపోయి వారం రోజులైంది. వ్యవసాయ బోర్లు నడవకపోవడంతో అధికారులకు చెప్పినా పట్టించుకోలేదు. గురువారం వీరద్దరూ ట్రాన్స్‌ఫార్మర్ వద్దకు వెళ్లి లైన్‌మన్ గంగ రాములుకు ఫోన్‌చేసి లైన్ క్లియర్ చేసి విద్యుత్ బంద్ చేయాలని కోరారు.
అనంతరం ట్రాన్స్‌ఫార్మర్‌పైకి ఎక్కి ఎక్స్ ఫీజ్ వైరును బిగిస్తున్న క్రమంలో ఒక్కసారిగా విద్యుత్ ప్రసారం కావడంతో వైర్లపై ఉన్న ఇద్దరు రైతులు విద్యుత్ షాక్‌కు గురై పిట్టల్లా నేలరాలిపోయారు. ఈ విషయం తెలుసుకున్న కుటుంబీకులు సంఘటనా స్థలానికి చేరుకుని భోరున విలపించారు. లైన్‌మన్ గంగరాములు, విద్యుత్ ఏఈ రాములు నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం చోటుచేసుకుందని స్థానికులు ఆందోళనకు దిగారు. విద్యుత్ అధికారులు వచ్చే వరకు మృతదేహాలను తరలించేది లేదని భీష్మించారు. విషయం తెలుసుకున్న ఎస్సై రాజేష్‌నాయక్ తన సిబ్బందితో అక్కడికి చేరుకున్నారు. వారికి నచ్చజెప్పినా వినిపించుకోకపోవడంతో గ్రామ పెద్దలను పోలీస్‌స్టేషన్‌కు పిలిపించి విద్యుత్ అధికారులతో ఫోన్‌లో చర్చలు జరిపారు.
బాధితులకు ఒక్కో కుటుంబానికి రూ. 4 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లిస్తామని అధికారులు హామీ ఇవ్వడంతో గ్రామస్తులు ఆందోళన విరమించారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం సంగారెడ్డి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతుల భార్యల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రాజేష్‌నాయక్ తెలిపారు. మృతుడు మరవెల్లి శ్రీశైలానికి భార్య అనసూయ, పిల్లలు వినయ్, కుమార్, లక్ష్మి, ఉన్నారు. మరో మృతుడు మల్లు రవీందర్‌రెడ్డికి భార్య మాధురి, కొడుకు అరుణ్‌రెడ్డి, కూతురు అనూష ఉన్నారు. ఒకే రోజు ఇద్దరు రైతులు మృత్యువాత పడడంతో చీక్‌మద్దూర్‌లో విషాదఛాయలు అలుముకున్నాయి.
పొలంలో విద్యుదాఘాతంతో..
శివ్వంపేట: మెదక్ జిల్లా శివ్వంపేట మండలం గోమారం గ్రామంలో గురువారం రైతు నిరుడి లక్ష్మయ్య (36) విద్యుదాఘాతంతో మరణించాడు. లక్ష్మయ్య తన పొలం వద్ద ఉన్న బోరుబావి మోటారు అన్ చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. పైకి తేలి ఉన్న సర్వీసు వైరుకు కరెంటు సరఫరా కావడం..అది గమనించకుండా లక్ష్మయ్య దాన్ని తాకడంతో విద్యుదాఘాతం సంభవించింది.
Comments
Please login to add a commentAdd a comment