బోస్టన్: ఉత్తరప్రదేశ్‌లో నలుగురు రైతుల ప్రాణాలను బలి తీసుకున్న లఖీంపూర్ ఖేరి ఘటనను తీవ్రంగా ఖండించాల్సిందేనని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ అన్నారు. అదే సమయంలో ఆ తరహా ఘటనలు దేశంలో ఎక్కడ జరిగినా గళమెత్తాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పారు. అమెరికా పర్యటనలో ఉన్న సీతారామన్ మంగళవారం హార్వర్డ్ కెన్నెడీ స్కూలులో జరిగిన చర్చలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అక్కడ కొందరు సీతారామన్‌ను రైతులు బలిగొన్న ఘటనపై ప్రశ్నల వర్షం కురిపించారు. లఖీంపూర్ ఖేరి ఘటనపై ప్రధానమంత్రి, ఇతర సీనియర్ మంత్రులు ఎందుకు పెదవి విప్పడం లేదని, బీజేపీ దేనికి ఆత్మరక్షణలో పడిపోయిందని సూటిగా ప్రశ్నించారు.
దీనికి సీతారామన్ బదులిస్తూ లఖీంపూర్ ఖేరి ఘటనని ప్రతీ ఒక్కరూ ఖండిస్తున్నారని ఆ తరహా ఘటనలు దేశంలో ఇతర ప్రాంతాల్లో కూడా జరుగుతున్నాయని వాటి గురించి కూడా మాట్లాడాలని అన్నారు. ‘‘దేశంలో ఏ ప్రాంతంలో ఈ తరహా ఘటనలు జరిగినా అందరూ గళమెత్తాలి. భారత్ గురించి బాగా తెలిసిన డాక్టర్ అమర్త్యసేన్ వంటి వారు ఎక్కడ ఇలాంటి ఘటనలు జరిగినా లేవనెత్తాలి. యూపీలో బీజేపీ అధికారంలో ఉండడం, కేంద్ర మంత్రి కుమారుడు ప్రమేయంపై ఆరోపణలున్నాయి కాబట్టే అందరూ మమ్మల్ని వేలెత్తి చూపిస్తున్నారు. ఈ పని ఎవరు చేసినా న్యాయస్థానంలో తేలిపోతుంది. ఇదంతా నేను మా ప్రధానిని కానీ, మా పార్టీని కానీ వెనకేసుకొని రావడం కాదు. నేను భారత్ గురించి మాట్లాడతాను. నిరుపేదలకు జరగాల్సిన న్యాయం గురించి మాట్లాడతాను’’అని సీతారామన్ సమాధానమిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment