విలేకరులతో మాట్లాడుతున్న సీఎం చంద్రబాబు. చిత్రంలో మంత్రి సోమిరెడ్డి
సాక్షి, అమరావతి: బలహీనతతోనే అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఏపీ కంటే తెలంగాణలో ఆత్మహత్యలు ఎక్కువని, అక్కడ 4,500 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే, మన రాష్ట్రంలో 400 మందే ఆత్మహత్యలు చేసుకున్నారని చెప్పారు. మహారాష్ట్రలో 5,000 మంది, కర్ణాటకలో 3,500 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని తెలిపారు. చంద్రబాబు బుధవారం వ్యవసాయం, అనుబంధ రంగాలపై నాలుగో శ్వేతపత్రాన్ని ఉండవల్లిలోని గ్రీవెన్స్ హాలులో విడుదల చేశారు.
రైతుల ఆత్మహత్యలను తగ్గించగలిగాం..
దేశంలో రైతుల ఆత్మహత్యలు ఎక్కువుగా నమోదవుతున్నా, మన రాష్ట్రంలో అనూహ్యంగా రైతుల ఆత్మహత్యలు తగ్గించగలిగామని చంద్రబాబు పేర్కొన్నారు. రాష్ట్రంలో వలసలు లేవని, ఎక్కువ డబ్బుల కోసమే ఇతర ప్రాంతాలకు పనికి వెళుతున్నారని తెలిపారు. రాయలసీమ వాళ్లకి బెంగుళూరు వెళ్లడం అలవాటని, ఎక్కువ డబ్బుల కోసం వెళుతున్నారని, ఇక్కడ ఏమీ లేకకాదని స్పష్టం చేశారు. శ్రీకాకుళంలో నీళ్లున్నా ఇతర ప్రాంతాలకు వెళతారని చెప్పారు.
మూడో కూటమికి అవకాశం లేదు
‘‘కేసీఆర్, జగన్ కలిసి రాష్ట్రాన్ని అస్థిర పరచాలని కుట్ర చేస్తున్నారు. దేశంలో రెండే కూటములున్నాయి. మూడో కూటమికి ఎట్టిపరిస్థితుల్లోనూ అవకాశం లేదు. కాంగ్రెస్, బీజేపీల్లో ఏదో ఒక పార్టీ లేకుండా స్వతంత్ర భారతంలో ఇప్పటివరకు ఒక్క ప్రభుత్వం కూడా అధికారంలోకి రాలేదు. ఇప్పుడేదో విశ్వామిత్ర సృష్టి చేస్తామంటే ఎలా చేస్తారు? మూడో కూటమిని అధికారంలోకి తీసుకురావాలనుకోవడం జరగని పని. తెలంగాణ సీఎం కేసీఆర్ నిన్నటిదాకా మూడో కూటమి అంటూ అందరి దగ్గరకు వెళ్లి, ఇవాళ ప్రధానమంత్రిని కలుస్తున్నారంటే అర్థం ఏమిటి’’ అని సీఎం ప్రశ్నించారు.
వచ్చే నెలాఖరుకు రుణమాఫీ పూర్తిచేస్తాం..
‘‘రాబోయే బీజేపీయేతర ప్రభుత్వంలో రైతులకు రుణమాఫీ దేశవ్యాప్తంగా అమలు చేయడంపై ఆలోచిస్తాం. రుణ మాఫీకి సహకరించాలని కేంద్రాన్ని కోరినా ఒప్పుకోలేదు. దేశంలో ఎక్కడా లేనివిధంగా ఏపీలో ఒకేసారి రూ.1.50 లక్షలు ఒకే విడతలో రుణమాఫీ చేశాం’ అని సీఎం పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment