పంటను అమ్మేందుకు వెళ్తూ రైతు మృతి
రాప్తాడు : ఆరుగాలం శ్రమించి పండిన పంటను అమ్ముకునేందుకు వెళుతున్న ఓ రైతు రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. మరో పది మంది రైతులకు తీవ్రగాయాలయ్యాయి. కర్ణాటకలోని బాగేపల్లి తాలుకా టీబీ క్రాస్ సమీపంలో బుధవారం రాత్రి జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి.
మండలంలోని ఎం.బండమీదపల్లి, మరూరు, హంపాపురం గ్రామాలకు చెందిన దాదాపుగా 20 మంది రైతులు తాము పండించిన బెండకాయల్ని బెంగళూరులో విక్రయించి వచ్చేవారు. ఈ నేపథ్యంలో బుధవారం కూడా ఎం.బండమీదపల్లికి చెందిన రైతులు ఐచర్ వాహనంలో బెండకాయలు లోడు చేసుకుని మరూరుకు వచ్చారు. అక్కడ మరూరు, హంపాపురం గ్రామాలకు చెందిన రైతులు బెండకాయలను లోడ్ చేశారు. అనంతరం 20మంది రైతులు అదే వాహనంలో బెంగళూరుకు బయలుదేరారు. కర్ణాటకలోని బాగేపల్లి తాలూకా టీబీ క్రాస్ సమీపంలోకి రాగానే ఐచర్ వెనుక భాగంలో చక్రం పగిలిపోవడంతో ఒక్కసారిగా వాహనం బోల్తా పడింది.
దీంతో వాహనంలో ప్రయాణిస్తున్న 20 మంది రైతులు వాహనం కింద పడ్డారు. వారిలో ఎం.బండమీదపల్లికి చెందిన నడిమిదొడ్డి నాగేంద్ర (35) అక్కడికక్కడే మృతి చెందగా ఎం.బండమీదపల్లికి చెందిన రైతు సుబ్బరాయుడు, యర్ర రమేష్, తపాల శంకరయ్య, నరసింహులు, ముత్యాలప్ప, హంపాపురానికి చెందిన నాగభూషణం, కొండప్ప, డైవర్ అశోక్‌తో పాటు మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రుల్లో ఇద్దరు అనంతపురం రాగా, తక్కిన వారిని స్థానికులు బెంగళూరు తరలించారు. ఇదిలా ఉండగా నాగేంద్ర మృతదేహాన్ని గురువారం సాయంత్రం గ్రామానికి తీసుకుని రావడంతో ఎం.బండమీదపల్లి గ్రామం శోక సంద్రంలో మునిగిపోయింది. తల్లిదండ్రులు హనుమన్న, నారాయణమ్మ, భార్య జయమ్మ రోదనలు మిన్నంటిపోయాయి. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు, ఒక కుమారై ఉన్నారు.