
ఇందుకూరుపేట: విద్యుదాఘాతానికి గురై మండలంలోని కొత్తూరు గ్రామానికి చెందిన ఓ రైతు మంగళవారం మృతిచెందాడు. స్థానికుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన దండు కోటేశ్వరరావు (45) తన పొలంలో కూరగాయలు సాగుచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. పొలానికి విద్యుత్ సరఫరా చేసే వైర్లు సక్రమంగా లేకపోవడంతో మంగళవారం అతను సమీప రైతుల సాయంతో మరమ్మతులకు పూనుకున్నాడు.
సరఫరాను నిలిపివేసి పనులు చేస్తుండగా గాలి వీస్తోందని కండెక్టర్ వైర్లు ఒకదానికి ఒకటి తగలకుంగా కర్రలు, వైర్లు సాయంతో వాటిని వేరుగా ఉంచే పనిలో నిమగ్నమయ్యాడు. ఈ విషయం తెలియని విద్యుత్ శాఖ సిబ్బంది సరఫరా ఇచ్చేశారు. దీంతో షాక్ గురైన కోటేశ్వరరావు అక్కడికక్కడే మృతిచెందాడు. దీంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. మృతుడికి భార్యాపిల్లలు ఉన్నారు. మరమ్మతులు సరైన సమయానికి చేసి ఉంటే ఈ పరిస్థితి వచ్చిది కాదని స్థానిక రైతులు విద్యుత్‌శాఖ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదుచేశారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం నెల్లూరుకు తరలించారు.