లింగపాలెం/రెంటచింతల (మాచర్ల)/బెళుగప్ప/శ్రీరంగరాజపురం: అప్పుల భారంతో వేర్వేరు ప్రాంతాల్లో ఇద్దరు రైతులు, మరో ఇద్దరు కౌలు రైతులు ఆత్మహత్యకు పాల్పడగా, సాగుభూమిని ఆన్‌లైన్‌లో నమోదు చేయకపోవడాన్ని నిరసిస్తూ ఇంకో రైతు ఆత్మహత్యాయత్నానికి ఒడిగట్టారు. వివరాలివి. అనంతపురం జిల్లా బెళుగుప్ప మండలంలోని శ్రీరంగాపురం గ్రామానికి చెందిన రైతు బోయ పాండురంగ (32)కు 10 ఎకరాల పొలం ఉంది. అదే గ్రామంలో మరో 3 ఎకరాల పొలాన్ని కౌలుకు తీసుకుని ఎనిమిదేళ్లుగా వ్యవసాయం చేస్తున్నారు. 13 ఎకరాల్లో వేరుశనగ సాగు చేస్తుండగా, తీవ్ర వర్షాభావం కారణంగా నాలుగేళ్ల నుంచి నష్టాల పాలయ్యారు. దీనికి తోడు తన పొలంలో బోరు వేయించడానికి రూ.లక్ష వరకు ఆ గ్రామానికి చెందిన వారినుంచి అప్పు చేశారు. బోర్లలో చుక్కనీరు కూడా రాకపోవడంతో తీవ్ర నిరాశ చెందారు. పంట పెట్టుబడి కోసం బయట వ్యక్తులతో చేసిన అప్పుల మొత్తం రూ 3.70 లక్షలకు చేరింది. అప్పులు తీర్చే దారిలేక పాండురంగ శనివారం తన పొలంలోనే వేప చెట్టుకు ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. తండ్రి హనుమంతప్ప ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. మృతునికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. భార్య ప్రస్తుతం నిండు గర్భిణి. పాండురంగ మృతి స్థానికులను కలచివేసింది.
ఇద్దరు కౌలు రైతుల బలవన్మరణం
అప్పుల భారంతో ఇద్దరు కౌలు రైతులు శనివారం ఆత్మహత్యకు ఒడిగట్టారు. వివరాల్లోకి వెళితే.. పశ్చిమ గోదావరి జిల్లా నరసన్నపాలెంకు చెందిన కౌలు రైతు కొమ్ము నాగరాజు (38) ఆరేళ్లుగా గ్రామంలోని కూరపాటి లక్ష్మికి చెందిన 6 ఎకరాల భూమిని కౌలుకు తీసుకుని నాటు పొగాకు సాగు చేస్తున్నారు. పెట్టుబడులు పెరగడం, ఆశించిన దిగుబడులు రాకపోవడంతో నాగరాజు అప్పుల పాలయ్యారు. పంట రుణం కోసం బంగారాన్ని కూడా బ్యాంకులో తాకట్టు పెట్టడంతో భార్యాభర్తల మధ్య తరచూ ఘర్షణలు జరుగుతుండేవి. అప్పులు తీర్చే మార్గం లేకపోవడంతో మనోవేదనకు గురైన నాగరాజు శనివారం పురుగు మందు తాగేశాడు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే చింతలపూడిలోని ప్రభుత్వాస్పత్రికి తరలించగా.. అప్పటికే నాగరాజు మృతిచెందారు. ఇతనికి భార్య, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. ధర్మాజీగూడెం ఎస్సై రాజేష్ కేసు నమోదు చేశారు. ఇదిలావుంటే.. గుంటూరు జిల్లా మంచికల్లు గ్రామానికి చెందిన మల్లెం సాంబయ్య (62) తనకున్న 30 సెంట్ల పొలంతో పాటు మరో 20 ఎకరాలను కౌలుకు తీసుకుని తన కుమారులు నరసింహరావు, రమేష్‌తో కలిసి ఏటా వరి సాగు చేస్తున్నారు. సాగు కలిసి రాకపోవడంతో రూ.12 లక్షల వరకు అప్పులు పేరుకుపోయాయి. గత రబీలో పైరు ఆశాజనకంగా ఉన్న సమయంలో కాలువలకు సాగునీటి విడుదల నిలిచిపోయింది. కళ్లముందే పంట నిలువునా ఎండిపోయింది. పంట దెబ్బతినడం, అప్పులు కొండలా పేరుకుపోవడంతో మనోవ్యథకు గురైన సాంబయ్య శనివారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగు మందును తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు.
బావులు ఎండిపోవడంతో..
అప్పులు పేరుకుపోవడం, గొట్టపు బావులు ఎండిపోవడంతో చిత్తూరు జిల్లా శ్రీరంగరాజపురం మండలం మూలూరు గ్రామానికి చెందిన వెంకటేశులరెడ్డి (56) శనివారం ఆత్మహత్యకు పాల్పడ్డారు. వెంకటేశులరెడ్డికి నాలుగు ఎకరాల పొలం ఉండటంతో వరి, వేరుశనగ పంటలు సాగు చేస్తున్నాడు. పొలంలో గొట్టపు బావులు వేసేందుకు 7 సంవత్సరాల క్రితం సుమారు రూ.4 లక్షలు అప్పు చేశాడు. రెండేళ్ల క్రితం బ్యాంకులో రూ.2.70 లక్షల పంట రుణం తీసుకున్నాడు. వర్షాభావంతో 6 నెలల క్రితం బోర్లు ఎండిపోవడంతో పంటలు దెబ్బతిన్నాయి. ఈ పరిస్థితుల్లో అప్పు ఎలా తీర్చాలో అర్థంకాని వెంకటేశులురెడ్డి మనస్తాపానికి గురై శనివారం గ్రామం సమీపంలోని పొలంలో చెట్టుకు ఉరేసుకున్నాడు.
భూమి వివరాలను ఆన్‌లైన్ చేయకపోవడంతో..
వంగర: సాగులో ఉన్న భూమి వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయమని పదే పదే వేడుకున్నా ఫలితం లేకపోవడంతో ఓ రైతు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. శ్రీకాకుళం జిల్లా వంగర మండలం వెలుగు కార్యాలయంలో శనివారం ఈ ఘటన జరిగింది. సంగాం గ్రామానికి చెందిన బోను లక్ష్మీనారాయణమ్మ పేరుతో ఉన్న సాగు భూమిని ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని ఆమె కుమారుడు మధు 40 రోజులుగా వీఆర్వో చుట్టూ తిరుగుతున్నారు. ఫలితం లేకపోవడంతో వెలుగు కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న డెప్యూటీ తహసీల్దార్ బి.గోవిందరావు వద్దకు కుటుంబ సభ్యులంతా వెళ్లి బైఠాయించారు. తమ సమస్యను పట్టించుకోలేదంటూ అసహనానికి గురైన మధు టిన్నుతో తెచ్చిన పెట్రోల్‌ను ఒంటిపై పోసుకొని ఆత్మహత్యకు యత్నించాడు. డీటీ గోవిందరావుతోపాటు అక్కడ ఉన్న వారు అడ్డుకుని సమస్య పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో సమస్య సద్దుమణిగింది. భూములను పరిశీలించి ఆన్‌లైన్‌లో నమోదు చేసేందుకు చర్యలు తీసుకుంటామని తహసీల్దార్ బండారు రామారావు హామీ ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment