
బొమ్మవారిపల్లి వద్ద సంచరిస్తున్న ఏనుగు
గంగాధరనెల్లూరు (చిత్తూరు జిల్లా): ఏనుగు దాడిలో ఓ రైతు దుర్మరణం పాలయ్యాడు. ఇద్దరు మహిళలు తీవ్రంగా గాయపడ్డారు. చిత్తూరు జిల్లా గంగాధరనెల్లూరు మండలంలో జరిగిన ఈ ఘటన స్థానికులను ఆందోళనకు గురిచేసింది. ప్రత్యక్ష సాక్షుల కథనం మేరకు.. బొమ్మవారిపల్లిలో బుధవారం ఓ ఏనుగు విధ్వంసం సృష్టించింది. మామిడి చెట్లు, ఫెన్సింగ్‌ను ధ్వంసం చేసింది. నాశంపల్లి ఎస్టీ కాలనీకి చెందిన కళావతిని గాయపరిచింది. అక్కడ ఉన్న ప్రజలు పెద్దగా కేకలు వేయడంతో అక్కడి నుంచి ఏనుగు వెళ్లిపోయింది. కళావతిని 108 అంబులెన్స్‌లో చిత్తూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
ఆ తర్వాత ఏనుగు గంగాధరనెల్లూరు వైపు వచ్చింది. పొలం పనులు చేసుకుంటున్న లక్ష్మి ఆ ఏనుగును దగ్గర్నుంచి చూడటంతో భయంతో పరుగులుదీసింది. ఈ క్రమంలో ఓ రాయిపై పడింది. తలకు తీవ్ర గాయం కావడంతో ఆమెను వేలూరు సీఎంసీకి తీసుకెళ్లారు. అనంతరం నీవా నది పక్కన పొలం పనులు చేసుకుంటున్న వేల్కూరు ఇందిరానగర్ కాలనీకి చెందిన వజ్రవేల్(48)పై ఏనుగు దాడి చేసింది. దంతాలతో పొడవడంతో రైతు తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు అతనిని తిరుపతి రుయాకు తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు.
Comments
Please login to add a commentAdd a comment