మైకా క్వార్ట్‌జ్ గని ఇదే..
లేదంటే మైకా క్వార్ట్‌జ్ లీజుకి అనుమతులు ‘నై’
సాక్షి ట్కాస్‌ఫోర్స్: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని సైదాపురం మైనింగ్ గనుల లీజు వ్యవహారం వివాదాస్పదమవుతోంది. ముఖ్య నేత ఆదేశాలు తమ పొట్టకొడుతున్నాయని గనుల యజమానులు లబోదిబోమంటున్నారు. వారిని దారికి తెచ్చుకునేందుకు ఆరు నెలలుగా అనుమతులు నిలిపి వేసిందే కాక ఎంపీ వేమిరెడ్డి చెప్పినట్లు వినాలనడంపై మండిపడుతున్నారు.
గనుల్లో దొరికే మైకా క్వార్ట్‌జ్, క్వార్ట్‌జ్ ఖనిజం తమకే విక్రయించేలా ఒప్పందం చేసుకున్న గనులకు మాత్రమే అనుమతులిస్తూ.. మిగతా వాటికి అనుమతులు నిలిపివేస్తుండడమే ఈ పరిస్థితికి కారణం. పైగా.. వెంకటగిరి రాజా కుటుంబానికి చెందిన గనులకు సైతం అనుమతులివ్వకపోవడంతో ఎప్పుడు గడపదాటని ఆ కుటుంబం సైతం మైనింగ్ కార్యాలయం వద్ద పడిగాపులు కాసేలా చేయడంతోపాటు సదరు అధికారి వద్ద ఘోర అవమానం పొందేలా ప్రభుత్వ పెద్దలు పరిస్థితి కల్పించారు.
దీంతో.. ఆ కుటుంబంపై గౌరవం ఉన్న ప్రతిఒక్కరూ వారికి జరిగిన అవమానంపై మండిపడుతున్నారు. ప్రభుత్వ పెద్దల కమీషన్ల కక్కుర్తే దీనంతటికీ కారణమని వారు ముక్తకంఠంతో ఆరోపిస్తున్నారు. పైగా.. పోలీసుల సాయంతో స్థానిక ప్రజాప్రతినిధి సైదాపురంలో అనధికార వ్యాపారం చేసుకుని రూ.కోట్లు దండుకున్నారు.
ఎంపీ వేమిరెడ్డి వైపే ప్రభుత్వ పెద్దల మొగ్గు..
ఈ పరిస్థితుల్లో.. మైనింగ్ వ్యాపారంలో ఆరితేరిన ఎంపీ వేమిరెడ్డికి సైదాపురం గనులపై కన్నుపడింది. అంతే.. ప్రభుత్వ పెద్దలతో నెలవారీగా రూ.30 కోట్లు ఇచ్చేలా ఒప్పందం చేసుకుని జిల్లాలో ఉన్న మైకా క్వార్ట్‌జ్‌ను కొనుగోలు చేసి విదేశాలకు తరలించేందుకు అన్ని ఏర్పాట్లుచేసుకున్నారు. ఈ వ్యవహారం జిల్లాలోని అందరు ఎమ్మెల్యేలూ వ్యతిరేకించారు.
మరోవైపు.. తిరుపతి జిల్లాలో టీడీపీలో కీలకంగా ఉంటూ ఆ పార్టీ అధినేత సామాజికవర్గానికి చెందిన ఓ నేత ఆ గనులను దక్కించుకునేందుకు ఎమ్మెల్యేలందరినీ కూటమి కట్టినా ఫలితం దక్కలేదు. ప్రభుత్వ పెద్దలను ఒప్పించేందుకు చేయని ప్రయత్నంలేదు. కానీ, వేమిరెడ్డి వైపే ప్రభుత్వ పెద్దలు మొగ్గుచూపడంతో ఎమ్మెల్యేలు వర్సస్ ఎంపీగా సీన్ మారిపోయింది.
వారు చెప్పిన వాటికే అనుమతులు..
ఉమ్మడి నెల్లూరు జిల్లాలో వెంకటగిరి, సర్వేపల్లి, గూడూరు నియోజకవర్గాల్లో ఏడు భూగర్భ గనులు, 140 ఓపెన్ క్వార్ట్›జ్ గనులున్నాయి. వీటికి విడతల వారీగా అనుమతులిస్తున్నారు. ఇప్పటివరకు 24 గనులకు లైన్‌క్లియర్ చేశారు. ఈ నేపథ్యంలో.. ఉన్నతాధికారుల బృందం ఇటీవల సైదాపురం గనులను ప్రత్యేకంగా పరిశీలించి 80 గనులకు అనుమతులు మంజూరుచెయ్యొచ్చని డీఎంజీకి సిఫార్సుచేసింది.
కానీ, వేమిరెడ్డి డిమాండ్లను ఒప్పుకున్న యజమానులకు సంబంధించిన గనులకు మాత్రమే అనుమతులు మంజూరుచేస్తున్నారు. మొదటి విడతగా నాలుగు గనులను పునరుద్ధరించగా జోగిపల్లి గ్రామానికి చెందిన పీబీజే కంపెనీకి రెండింటి అనుమతులు మంజూరుచేశారు. రెండో విడతలో.. సైదాపురం మండల టీడీపీ అధ్యక్షుడు జి కృష్ణమరాజుకు చెందిన మూడు గనులు.. అలాగే, సాధన మినరల్స్ అధినేత సురేష్‌రెడ్డికి చెందిన మరో ఆరు గనులకు అనుమతులు మంజూరు చేశారు.
రెండ్రోజుల క్రితమే కేపీఆర్ మినరల్స్ కంపెనీకి చెందిన రెండు గనులు.. మరోసారి పీబీజే కంపెనీకి చెందిన మరో మూడు గనులు.. అమృతేష్ మైనింగ్ కంపెనీ, పి. సుశీలమ్మ, ఒగ్గు కృష్ణయ్య, రాహుల్ సేన్, జాన్‌వా ఇన్‌ఫ్రా, నాగేంద్ర మైన్స్‌కు చెందిన 11 గనులకు అనుమతులిచ్చారు. కానీ, కోట్లాది రూపాయల డెడ్ రెంట్ చెల్లిస్తూ లీజులు పొందిన యజమానులకు మాత్రం అనుమతులివ్వడంలో జాప్యంచేస్తున్నారు.
పెనాల్టీలు, కేసులు అంటూ బెదిరింపులు..
మరోవైపు.. వెంకటగిరి రాజాలకు సైదాపురం మండలంలో మైనింగ్ పరిశ్రమ ఉంది. ఈ పరిశ్రమపై వందలాది మంది జీవనం పొందుతున్నారు. అలాగే, రాధాకృష్ణ మైనింగ్ కంపెనీలో కూడా వందలాది మంది ఉపాధి పొందుతున్నారు. ఈ రెండు గనులకు మాత్రం అనుమతులివ్వలేదు. ఎందుకంటే వారు వేమిరెడ్డికి విక్రయించే విధానాన్ని వ్యతిరేకించారు.
అన్ని అనుమతులు ఉండి తామే విదేశాలకు ఎగుమతులు చేసుకుంటామని నిక్కచ్చిగా చెప్పడంతో వారి గనులకు అనుమతులివ్వలేదు. వాటిపై పెనాల్టీలు వేస్తామని, కేసులు నమోదుచేయిస్తామని భయపెట్టినా వారు లొంగకపోవడంతో వారిని వేధిస్తున్నారు. దీంతో.. ఇటీవల గూడూరులో పలువురు గనుల యజమానులు సమావేశమై ఎంపీ వేమిరెడ్డికి వ్యతిరేకంగా ప్రభుత్వ పెద్దలతోనే వ్యవహారం తేల్చుకునేందుకు సిద్ధపడ్డారు.
వెంకటగిరి రాజాకు అవమానం
ఇదిలా ఉంటే.. అనుమతుల విషయంలో ఇబ్బందిపెడుతున్న నెల్లూరు మైనింగ్ డీడీని కలిసేందుకు వెళ్లిన వెంకటగిరి రాజా సర్వజ్ఞ కుమార యాచేంద్రకు ఘోర అవమానం జరిగింది. తనతోపాటు అనుమతులు రాని యజమానులతో కలిసి వెళ్లిన రాజాను బయటకెళ్లాలని సదరు అధికారి చెప్పడంపై ఆయన అవమానంగా భావించారు.
అన్ని సక్రమంగా ఉన్న తమకెందుకు అనుమతులివ్వలేదని నిలదీశారు. రెండ్రోజుల్లో అనుమతులివ్వకుంటే ప్రభుత్వం వద్దే తేల్చుకుంటామని హెచ్చరించారు. దీనిపై ప్రభుత్వ పెద్దలు ఎలా స్పందిస్తారో చూడాలి.
Comments
Please login to add a commentAdd a comment