పోలీస్ స్టేషన్‌కు చేరిన పంచాయితీ
టీడీపీ కీలకనేత తవ్వుకోమన్నారన్న ఓ వర్గం.. జిల్లా నేత తమకే చెప్పారన్న మరో వర్గం
ప్రత్తిపాడు: గుంటూరు టీడీపీలో మైనింగ్ రగడ రచ్చకెక్కింది. నియోజకవర్గ టీడీపీ నేత తమను మట్టి తవ్వకాలు చేసుకోమన్నారని గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలానికి చెందిన ఓ వర్గం... టీడీపీ జిల్లా నేత తమనే తవ్వుకోమన్నారంటూ మరో వర్గం తన్నులాడుకుంటున్నాయి. చివరకు ఈ పంచాయితీ ప్రత్తిపాడు పోలీస్ స్టేషన్‌కు చేరింది. ఇరువర్గాల మధ్య సయోధ్య కుదిర్చేందుకు పోలీసులు చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో రెండు వర్గాలు బలప్రదర్శనకు సిద్ధమయ్యాయి. వివరాల్లోకి వెళితే.. ప్రత్తిపాడు మండలం నడింపాలెం జాతీయ రహదారి సమీపంలోని సర్వే నంబర్ 149లో ఉన్న సుమారు 4 ఎకరాలను ఎన్.రత్తయ్య అనే వ్యక్తి ప్రత్తిపాడుకు చెందిన ఓ వ్యాపారి బంధువులకు విక్రయించాడు.
అతడు నియోజకవర్గ కీలక నేతకు చెందిన ప్రత్తిపాడు మండల నాయకులకు మైనింగ్‌కు లీజుకిచ్చాడు. అదే భూమిని ఆయన కుమారుడు సునీల్ గుంటూరు జిల్లాకు చెందిన మరో కీలక నేత వర్గీయులు అయిన గుంటూరు రూరల్ మండలం నాయకులకు లీజుకిచ్చాడు. దీంతో ఇరువర్గాలు ఆ భూమిలో మైనింగ్ పనులు మొదలుపెట్టి పగలు, రాత్రి తేడా లేకుండా మట్టి తవ్వకాలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇరువర్గాలకు మధ్య వార్ నడుస్తోంది. ఒక వర్గంపై మరో వర్గం ఆధిపత్యం కోసం పరస్పరం ప్రయత్నాలు చేస్తున్నాయి. మా మండలం వచ్చి మట్టి తోలడానికి మీరెవరంటూ ఒక వర్గం... మీ మండలం అయితే రాకూడదా.. తవ్వకూడదా.. అంటూ మరో వర్గం భీషి్మంచాయి. దీంతో భూముల యజమానులు అధికారులకు ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఫిర్యాదులు చేస్తున్నారు.
పోలీస్ స్టేషన్‌లోనూ తెగని పంచాయితీ
గుంటూరు రూరల్ మండలానికి చెందిన వర్గం పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఎస్సైతో మాట్లాడింది. తమ స్థలంలో అక్రమంగా మైనింగ్ చేస్తున్నారని, కేసు నమోదు చేయాలని కోరింది. ఎస్సై స్పందించకపోవడంతో ఆ వర్గం సీఐ వద్దకు వెళ్లగా.. ఫిర్యాదు ఇవ్వాలని సూచించారు. ఆ వర్గం తిరిగి ఎస్సై వద్దకు వచ్చింది. ‘ఫిర్యాదు ఇస్తారా.. మీరేం ఇస్తారో ఇవ్వండి. నేనూ చూస్తా’ అని ఎస్సై అనడంతో ఏం చేయాలో అర్థంకాక ఫిర్యాదు చేసేందుకు వచి్చన వాళ్లు వెనుకడుగువేశారు. అనంతరం శనివారం రాత్రి ఇరువర్గాలకు చెందిన సుమారు యాభై మంది స్టేషన్‌కు వెళ్లగా.. ఆ వర్గాల మధ్య సయోధ్య కుదిర్చేందుకు పోలీసులు నానాపాట్లు పడ్డారు. ఇరువర్గాలు తగ్గకపోవడంతో పోలీసులు ‘ఏం చేయాలో మీరే తేల్చుకోండి. అప్పటివరకూ మైనింగ్ ఆపేయండి’ అని సలహా ఇవ్వడంతో ఇరువర్గాల మధ్య మాటల యుద్ధం జరిగింది. చివరకు ఇది శాంతిభద్రతల సమస్యగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment