రెండున్నర నెలలుగా స్థంభించిన ఖనిజ తవ్వకాలు
వాటా తేలే వరకు క్వారీలు తెరవకూడదని అధికార పార్టీ నేతల హుకుం
మూతపడిన క్వార్జ్, సిలికా శాండ్, బెరైటీసీ, ఇతర క్వారీలు
సర్కారుకు ఈ రెండున్నర నెలల్లోనే రూ.500 కోట్లకుపైగా నష్టం
రోడ్డున పడ్డ వేలాది కార్మికుల కుటుంబాలు
మైనింగ్ వసూళ్లకు జిల్లాలవారీగా నేతలకు బాధ్యతలు
గనులు, క్వారీల యజమానులతో బేరాలు
వారు కోరినంత ఇవ్వలేక గనులు, క్వారీలు మూసివేస్తున్న యజమానులు
బెరైటీస్ లభ్యం కాక ఇబ్బందుల్లో ఓఎన్జీసీ
వెంటనే సరఫరా చేయాలని ఓఎన్జీసీ కోరినా స్పందించని సర్కారు
సాక్షి, అమరావతి: ముడుపుల కోసం అధికార కూటమి నేతల ఒత్తిడితో గత రెండున్నర నెలలుగా రాష్ట్రవ్యాప్తంగా మైనింగ్ స్థంభించింది. పలు ఖనిజ వనరుల తవ్వకాలు, వాటి అనుబంధ పరిశ్రమలు మూతపడ్డాయి. ముఖ్యంగా బెరైటీస్, క్వార్జ్, సిలికా, గ్రానైట్ క్వారీల మూసివేతలో ప్రభుత్వంలోని పెద్దల ఒత్తిళ్లు ఉన్నట్లు సమాచారం. మైనింగ్ స్తంభించిన కారణంగా ఈ రెండున్నర నెలల్లో గనుల ద్వారా రావాల్సిన రూ.500 కోట్ల ఆదాయాన్ని ప్రభుత్వం కోల్పోయింది. మరోపక్క గనులు, క్వారీలు, వాటి అనుబంధ పరిశ్రమలు, రవాణా రంగానికి సంబంధించి వేలాది కార్మికుల కుటుంబాలు పనుల్లేక రోడ్డున పడ్డాయి.
జూన్ 4న ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజే టీడీపీ నేతలు రాష్ట్రవ్యాప్తంగా క్వారీలపై విరుచుకుపడి మూసివేయించారు. తమ వాటాల సంగతి తేల్చి, అడ్వాన్సు ఇచ్చాకే క్వారీలు తెరవాలని స్పష్టం చేయడంతో మైనింగ్ పరిశ్రమ మొత్తం కుదేలైంది. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అధికారపార్టీ పెద్దల ఆశీస్సులతో జిల్లాలవారీగా కూటమి నేతలు మైనింగ్ పరిశ్రమలను పంచుకున్నారు. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో మైనింగ్ మొత్తాన్ని మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యేకి అప్పగించారు. అనంతపురం జిల్లాలో మాజీ ఎమ్మెల్యేకి బాధ్యతలు ఇచ్చారు. ఇలా అన్ని జిల్లాల్లో పెద్ద తలకాయలకు బాధ్యతలు అప్పగించారు. వారు గనులు, క్వారీల యజమానులతో బేరాలు సాగిస్తున్నారు. వారు కోరినంత కప్పం కట్టలేక గనుల యజమానులు మైనింగ్ నిలిపివేశారు.
క్వారీల యజమానులు, అసోసియేషన్లు మైనింగ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, ముఖ్య కార్యదర్శిని కలిసినా వారు తమ చేతుల్లో ఏమీ లేదని చేతులెత్తేసినట్లు సమాచారం. కొందరు ప్రభుత్వంలోని ముఖ్యులను సంప్రదించినా కప్పం కట్టక తప్పదని తేల్చడంతో క్వారీలు తెరిచేందుకు యజమానులు జంకుతున్నారు. కోరినంత ముట్టజెప్పకపోవడంతో ఉమ్మడి నెల్లూరు, చిత్తూరు జిల్లాలతో పాటు రాష్ట్రవ్యాప్తంగా సిలికా శాండ్, క్వార్జ్ క్వారీలను సైతం మూసివేయించారు. శ్రీకాకుళం జిల్లాలో పలు గ్రానైట్ క్వారీలపైనా అధికార పార్టీ నేతలు ఉక్కుపాదం మోపారు.
మరోపక్క ప్రభుత్వ పెద్దల ఆదేశాలకు అనుగుణంగా గనుల శాఖ కొత్త లీజులు మంజూరు చేయకపోగా, కొనసాగుతున్న లీజులను కూడా స్థంభింపజేసింది. దీంతో బెరైటీస్, క్వార్జ్, సిలికా శాండ్ క్వారీలు పూర్తిగా మూతపడ్డాయి. ఉమ్మడి చిత్తూరు, అనంతపురం, శ్రీకాకుళం, వైఎస్సార్ కడప తదితర జిల్లాల్లో సీనరేజీ వసూళ్లను గత ప్రభుత్వం ప్రైవేటు కంపెనీలకు అప్పగించింది. టీడీపీ ప్రభుత్వం రాగానే ఈ వసూళ్లలో తేడాలున్నాయంటూ ఆ కంపెనీలను వేధించడంతో అవి కూడా కార్యకలాపాలను నిలిపివేశాయి.
స్థంభించిన బెరైటీస్.. ఓఎన్జీసీకి కష్టాలు
వైఎస్సార్ కడప జిల్లా మంగంపేటలో అత్యంత కీలకమైన బెరైటీస్ లీజులను స్థంభింపచేశారు. చివరికి ప్రభుత్వ రంగ సంస్థ ఏపీఎండీసీ ఆధ్వర్యంలో జరిగే తవ్వకాలను కూడా నిలిపివేయడంతో బెరైటీస్ ఎగుమతులు ఆగిపోయాయి. దేశీయంగా, అంతర్జాతీయంగా డిమాండ్ ఉన్న ఈ ఖనిజం దొరక్క దానిపై ఆధారపడ్డ పరిశ్రమలు ఇబ్బందుల్లో పడుతున్నాయి. బెరైటీస్ లేక ఓఎన్జీసీ ఆయిల్, నేచురల్ గ్యాస్ ఉత్పత్తికి కూడా విఘాతం ఏర్పడింది. వెంటనే బెరైటీస్ సరఫరా చేయాలని, లేకపోతే అనేక ఇబ్బందులు వస్తాయని ఓఎన్జీసీ ఉన్నతాధికారులు ఏపీఎండీసీకి నెల క్రితమే లేఖ రాశారు. అయినా ప్రభుత్వ పెద్దలు స్పందించలేదు.
తవ్వేసి.. తరలించేస్తున్నారు
ఇటు ఇసుక..
ఇద్దరు ప్రజాప్రతినిధులు, ఓ మాజీ మంత్రి కనుసన్నల్లో ఇసుక మాఫియా ఎనీ్టఆర్ జిల్లా నందిగామ ప్రాంతంలోని కృష్ణా నది, మునేరు ఇసుకను ఇష్టారీతిన దోపిడీ చేస్తోంది. ఈ ఇసుకకు తెలంగాణలో అత్యధిక డిమాండ్ ఉంది. దీంతో ఇక్కడి నుంచి ఇసుకను అక్రమంగా తవ్వేసి తరలించేస్తున్నారు. ఖమ్మంలో లారీ ఇసుక రూ.75 వేలకు, హైదరాబాద్‌లో రూ. లక్షకు అమ్ముకొంటున్నారు. ఇక్కడ తవ్వేస్తున్న ఇసుక, క్యూ కట్టిన లారీలు ఇలా అక్రమంగా తరలించడానికే. ఇటీవల పోలీసులు ఇటువంటి లారీలను పట్టుకొన్నా, ప్రభుత్వంలోని ముఖ్య నేతల అండతో మళ్లీ దందా మొదలెట్టారు. – సాక్షి ప్రతినిధి, విజయవాడ
అటు గ్రావెల్..
టీడీపీ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు కుమార్తె దివ్య ప్రాతినిధ్యం వహిస్తున్న తుని నియోజకవర్గంలో గ్రావెల్ మాఫియా బరితెగించింది. డి.పోలవరం శివారు అశోక్‌నగర్ గండి సమీపంలో ఎ.నాయుడికి చెందిన 1.15 ఎకరాల డి పట్టా భూమిలో అనుమతుల్లేకుండా భారీ మొత్తంలో గ్రావెల్ తవ్వేసి తరలించేస్తున్నారు. అధికార పార్టీ నేతల అండతో స్థానిక టీడీపీ నేత పీఎస్ రావు రూ. కోటికి పైగా విలువ చేసే గ్రావెల్‌ను ఇక్కడి నుంచి తరలించేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. కోల్‌కతా–చెన్నై జాతీయ రహదారికి సమీపంలో తుని రూరల్ మండలం రాజులకొత్తూరులోనూ జిరాయితీ భూమి చదును పేరుతో టీడీపీకి చెందిన మాజీ సర్పంచ్, మండల స్థాయి నాయకుడు గ్రావెల్‌ను అక్రమంగా తరలించేస్తున్నారు. – సాక్షి ప్రతినిధి, కాకినాడ
Comments
Please login to add a commentAdd a comment