సీబీఐ సీజ్ చేసిన మెటీరియల్ చీకట్లో తరలింపు
సమీప ఐరన్ ఓర్ ఫ్యాక్టరీల్లో విక్రయిస్తున్న టీడీపీ నేతలు
రోజూ 4 వేల టన్నులు మాయం
తొలుత ఎల్లో మీడియా తప్పుడు కథనాలు.. ఆపై పచ్చ ముఠాల లూటీ
రాయదుర్గం: ఓబుళాపురం మైనింగ్ కంపెనీలో సీబీఐ సీజ్ చేసిన విలువైన ఐరన్ ఓర్ (ఇనుప ఖనిజం)ను పచ్చముఠాలు చీకటి మాటున తరలించేస్తున్నాయి. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు అనంతపురం జిల్లా డి.హీరేహాళ్ మండలంలోని ఓబుళాపురం మైనింగ్ కంపెనీ (ఓఎంసీ)లో తవ్వకాలు నిలిపివేసి సుమారు 8లక్షల టన్నుల ఇనుప ఖనిజాన్ని 2011లో సీబీఐ సీజ్ చేసిన విషయం తెలిసిందే.
దీనిపై కన్నేసిన టీడీపీ నాయకులు నాలుగైదు రోజులుగా ఓఎంసీలోకి చొరబడి లారీల్లో ఇనుప ఖనిజాన్ని చీకటి పడగానే సమీప స్టీల్ ఫ్యాక్టరీల్లోకి తరలిస్తున్నారు. అర్ధరాత్రి వేళ కొండ ప్రాంతాల్లో లారీల సంచారం, లైట్లను గమనించిన స్థానికులు ఓఎంసీలో దొంగలు పడ్డారని చర్చించుకుంటున్నారు. రోజుకు సుమారు 4 వేల టన్నులు మాయం అవుతున్నట్లు సమాచారం.
నాణ్యతను బట్టి టన్ను రూ.4 వేల వరకు విక్రయిస్తుండడంతో భారీగా లూటీ చేసినట్లు అంచనా. ఓఎంసీలో లభ్యమయ్యే ఇనుప ఖనిజం నాణ్యతకు పేరు పొందింది. దీన్ని కాజేసేందుకు టీడీపీ నేతలు పథకం ప్రకారం వ్యవహరించారు. ఇందులో భాగంగా ఎల్లో మీడియాలో తప్పుడు కథనాలు రాయించారు. సీబీఐ సీజ్ చేసిన ఇనుప ఖనిజం గత ప్రభుత్వ హయాంలోనే తరలి పోయిందంటూ తప్పుడు కథనాలను వండి వార్చారు.
నిస్సహాయంగా పోలీసులు..
ఓఎంసీలో ఇనుప ఖనిజం తరలిపోతున్నా పోలీసులు కళ్లప్పగించి చూడటం మినహా చర్యలు తీసుకునేందుకు సాహసించడం లేదు. లాఠీ ఝుళిపిస్తే బదిలీ తప్పదనే భయం వారిని వెంటాడుతోంది. ఇనుప ఖనిజాన్ని టీడీపీ నాయకులు అక్రమంగా తరలిస్తున్న విషయాన్ని బీజేపీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి సైతం ఇటీవల బహిర్గతం చేశారు. గత ప్రభుత్వంలో దోచేసినట్టు వచ్చిన కథనాలను ఆయన ఖండించారు. దోపిడీ అంశాన్ని సీబీఐ డైరెక్టర్‌తో పాటు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి దృష్టికి తెస్తామన్నారు.
ఎవరి ప్రమేయం ఉన్నా వదిలి పెట్టం
ఓఎంసీలో సీజ్ చేసిన ఖనిజాన్ని అక్రమంగా తరలిస్తే క్రిమినల్ కేసులు నమోదు చేయిస్తాం. ఇందులో ఎవరి ప్రమేయం ఉన్నా వదిలి పెట్టేది లేదు. సత్వరం ఓ బృందాన్ని అక్కడికి పంపి దర్యాప్తు చేయిస్తాం. సీబీఐ పరిధిలో ఉన్న వ్యవహారంలో తల దూర్చితే తీవ్ర పరిణామాలు తప్పవు. లారీ యజమానులు ఆలోచించి బాడుగకు వెళ్లాలి. ఏమాత్రం పట్టుబడినా అక్కడే సీజ్ చేస్తాం. అంగుళం కూడా కదలనివ్వం. నిల్వ ఉంచిన ఖనిజం బాగున్నా, పాడైనా బయట వ్యక్తులు ఎవరూ తాకటానికి వీల్లేదు. పోలీస్, రెవెన్యూ, అటవీ శాఖలను అప్రమత్తం చేసి అడ్డుకట్ట వేస్తాం. – నాగయ్య, మైనింగ్ డీడీ, అనంతపురం
Comments
Please login to add a commentAdd a comment