ప్రారంభించని గనుల లీజులు రద్దు
► తిరిగి స్వాధీనానికి వారం రోజుల్లో నోటీసులు
► గనుల శాఖపై సమీక్షలో మంత్రి కేటీఆర్ ఆదేశం
సాక్షి, హైదరాబాద్: కార్యకలాపాలు ప్రారంభించని గనుల లీజులను రద్దు చేస్తామని మంత్రి కె.తారకరామారావు చెప్పారు. బేగంపేటలోని పాత క్యాంపు కార్యాలయంలో గురువారం గనుల శాఖ వెబ్ పోర్టల్‌ను ఆవిష్కరించిన అనంతరం శాఖ పనితీరుపై ఆయన సమీక్ష నిర్వహిం చారు. లీజులు పొంది గడువులోగా కార్యకలాపాలు చేపట్టని గనులపై చర్యలు తీసుకోవాలని గనుల శాఖాధికారులను ఆదేశించారు.
లీజుల పత్రంలోని నిబంధనల మేరకు మైనింగ్ ప్రారంభించి ఉంటే ప్రభుత్వానికి ఆదాయంతో పాటు ఉపాధి పెరిగేదన్నారు. నిబంధనల మేరకు మైనింగ్ ప్రారంభించని గనుల యజమా నులకు నోటిసులు జారీ చేయాలన్నారు. ఈ గనులను తిరిగి స్వాధీనం చేసుకొనేం దుకు వారం రోజుల్లోగా నోటీసులు జారీ చేయాలని, ఈ విషయంలో ఎలాంటి ఒత్తిడులకు తలొగ్గకుండా కఠినంగా వ్యవహరించాలని సూచించారు. ప్రమా ణాలు పాటించకుండా మైనింగ్ చేస్తున్న వారీపైనా, క్వారీలపైనా కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.
గనుల శాఖకు అభినందనలు...
రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి గనుల శాఖ ద్వారా ప్రభుత్వానికి మంచి పేరు వస్తోందంటూ అధికారులను మంత్రి అభినందించారు. మరింత బాగా పనిచే యాలని సూచించారు. శాఖలో ఉన్నత ప్రమాణాలు నెలకొల్పేందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించాలని కోరారు. తనిఖీలను డిజిటలైజేషన్ చేసేందుకు ఐటీ సంబంధిత సాంకేతిక సహకారాన్ని తీసుకోవాలని సూచించారు. తనిఖీలను రియల్ టైమ్‌లో పర్యవేక్షించేందుకు, వాటి నివేదికలను క్షేత్ర స్థాయి నుంచే పంపించేందుకు ఏర్పాట్లు చేసుకోవాల న్నారు.
అవసరమైతే క్షేత్ర స్థాయి తనిఖీలకు వెళ్లే అధికారులకు ట్యాబ్‌లను అందజేయాలన్నారు. ప్రతి గనిని జీయో ట్యాగ్ చేయాలని, లీజుల హద్దులు దాటి మైనింగ్ చేయకుండా జీయో ఫెన్సింగ్ వేయాలన్నారు. కొత్తగా ప్రారంభించిన వెబ్ పోర్టల్‌లో తెలంగాణ గనుల శాఖకు సంబంధించిన పూర్తి సమాచారం ఉంటుందన్నారు. ఈ పోర్టల్ ద్వారా గనుల శాఖకు కట్టాల్సిన సొమ్మును ఆన్లైన్ ద్వారా చెల్లించవచ్చు అన్నారు. సమీక్షలో గనుల శాఖ డైరెక్టర్ బీఆర్వీ సుశీల్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.