వైఎస్సార్ సీపీలోకి వేమిరెడ్డి
సాక్షి, చెన్నై : ప్రముఖ పారిశ్రామిక వేత్త వేమిరెడ్డి ప్రభాకర రెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీ అధినేత వైస్ జగన్మోహన్రెడ్డి చేతుల మీదుగా వేమిరెడ్డికి కండువా కప్పి స్వాగతించారు. సమైక్యాంధ్ర లక్ష్యంగా అన్ని పార్టీల నేతల మద్దతును కూడగడుతున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం చె న్నైకు వచ్చారు. ఈ సందర్భంగా జననేత సమక్షంలో వైఎస్సార్ సీపీలో చేరారు. మహానేత వైఎస్ ఆశయ సాధనే లక్ష్యంగా తన రాజకీయ ప్రస్థానానికి వైఎస్ఆర్ సీపీ ద్వారా శ్రీకారం చుట్టారు. జన నేతకు ఆహ్వానం పలుకుతూ చెన్నైలో భారీ ఏర్పాట్లు చేశారు. నగరాన్ని ఫ్లెక్సీలతో ముంచెత్తారు. నగరంలోని నందనం సిగ్నల్, ఆళ్వార్‌పేట మార్గంలో భారీ ఏర్పాట్లు చేశారు. పెద్ద ఎత్తున మద్దతుదారులతో వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి కదలి వచ్చారు.
వైఎస్ అనిల్‌రెడ్డి నివాసంలో పార్టీ అధినేత జగన్ మోహన్‌రెడ్డిని కలిసి వైఎస్ఆర్ సీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి, ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్‌రెడ్డి, పార్టీ కార్యనిర్వాహక మండలి సభ్యులు కాకాణి గోవర్దన్‌రెడ్డి, ఎల్లశిరి గోపాల్‌రెడ్డి, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసులురెడ్డి నెల్లూరు జిల్లా కన్వీనర్ మేరిగ మురళి, ఆత్మకూరు, వెంకటగిరి, కావలి, నెల్లూరు సిటీ, రూరల్ సూళ్లూరుపేట, గూడూరు నియోజకవర్గాల సమన్వయకర్తలు మేకపాటి గౌతంరెడ్డి, కొమ్మి లక్ష్మయ్య నాయుడు, రామిరెడ్డి ప్రతాప్‌కుమార్ రెడ్డి, పి. అనిల్‌కుమార్‌యాదవ్, కే.శ్రీధర్‌రెడ్డి, సంజీవయ్య, డాక్టర్ బాలచెన్నయ్య, ఎమ్మెల్సీ బి. రాఘవేంద్రరెడ్డి పాశం సునీల్‌కుమార్, వైఎస్ అనిల్‌రెడ్డి వేమిరెడ్డిని అభినందించారు.