బాధ్యతలు విస్మరిస్తే ఉపేక్షించేదిలేదు
-
ఉపాధి సిబ్బంది పనితీరుపై డ్వామా పీడీ ఆగ్రహం
సైదాపురం: బాధ్యతలు విస్మరిస్తే సస్పెండ్ చేయకుండా ఇంటికే పంపుతానని డ్వామా పీడీ హరిత ఉపాధి సిబ్బందిని హెచ్చరించారు. సైదాపురం ఎంపీడీఓ కార్యాలయంలో బుధవారం ఉపాధి పనులపై క్షేత్రస్థాయిలో ఆమె సిబ్బందితో సమీక్షించారు. ఉపాధి సిబ్బంది పనితీరుపై పీడీ తీవ్ర స్థాయిలో అసహనం వ్యక్తం చేశారు. కనీసం జాబ్‌కార్డులు ఎన్ని ఉన్నాయి.. గ్రామంలో ఎంత మంది ఫారంఫాండ్స్ తవ్వకాలు సాగిస్తున్నారు.. ఎంత మందికి ఇంకుడు గుంతకు సంబంధించిన నిధులు మంజూరు చేశారు.. అనే విషయాలు కూడా తెలియకుండా పనులు ఎలా చేస్తున్నారంటూ సిబ్బందిని మందలించారు. మరుగుదొడ్ల నిర్మాణ పనుల విషయంలో ఐకేపీ, ఉపాధి సిబ్బంది మధ్య సమన్వయం కొరవడిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మండల స్థాయిలో పనిచేసే సిబ్బంది మధ్య సమన్వయం లేకపోవడం ఏమిటని ప్రశ్నించారు. మండల స్థాయిలో ఏ అధికారి పనిచేస్తున్నారనే విషయాలు తనకు తెలుసునని తెలిపారు. పర్యవేక్షించే అధికారులు కూడా తమ బాధ్యతలను పూర్తిగా విస్మరిస్తున్నారని పేర్కొన్నారు. సిబ్బంది కొరత ఉన్న చోట్ల అధికారులే పనులు జరిగేలా చర్యలు తీసుకోవాల్సింది పోయి ఒకరిపై ఒకరు పొంతన లేని సమాధానాలు చెప్పడం ఏమిటని ప్రశ్నించారు. ఎఫ్‌ఏలు తమ పద్ధతిని మార్చుకోకపోతే క్రిమినల్ కేసులు పెడతామని స్పష్టం చేశారు. మొక్కల పెంపకంపై ఎఫ్‌ఏలు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఆదేశించారు. జిల్లాలో సిబ్బంది లేని చోట్ల పనులు చక్కగా సాగుతున్నాయని, పూర్తి స్థాయిలో ఉన్న చోట్ల మాత్రం జరగడం లేదన్నారు. కొందరు ఏపీఓలు పనులపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, ఇకనైనా తమ పద్ధతిని మార్చుకోకపోతే ఏపీఓలే అవసరమే లేదని ప్రభుత్వానికి నివేదిక పంపుతామని హెచ్చరించారు. ఏపీడీ శ్రీహరి, ఎంపీడీఓ విజయ్‌కుమార్, తదితరులు పాల్గొన్నారు.