సైదాపురం, న్యూస్‌లైన్: అక్రమార్కులకు క్వార్ట్‌జ్, పల్స్‌ఫర్, వర్‌ముఖ్‌లైట్ ఖనిజం ‘తెల్లరాయి’ బంగారంగా మారింది. ఈ ఖనిజానికి దేశంతో పాటు విదేశాల్లో కూడా మంచి గిరాకీ ఉంది. దీంతో అక్రమార్కులు అడ్డూఅదుపు లేకుండా నిరాటంకంగా అక్రమ తవ్వకాలు చేపట్టి ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు. అనుమతులు ఒకచోట తీసుకుని మరొక చోట తవ్వకాలు చేపట్టి నిబంధనలను తుంగలో తొక్కుతున్నారు. అక్రమ మార్గంలో సేకరించిన క్వార్ట్‌జ్, పల్స్‌ఫర్, వర్‌ముఖ్‌లైట్ ఖనిజాన్ని ఇతర రాష్ట్రాలకు తరలిస్తూ లక్షల రూపాయలు గడిస్తున్నారు. ఇటీవల కాలంలో ఖనిజాన్ని లారీల్లో రూటు మార్చి తరలిస్తున్నారు. దీంతో ప్రభుత్వానికి చెల్లించాల్సిన రాయల్టీకి గండిపడుతోంది.
మైనింగ్ అధికారులు తమకేమీ పట్టనట్టు నిద్రమత్తులో ఉన్నారు. సైదాపురం పరిసర ప్రాంతాల్లో క్వార్ట్‌జ్ తవ్వకాలు జరుగుతున్నా సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడంతో ప్రభుత్వ భూముల్లో క్వార్ట్‌జ్ అక్రమ తవ్వకాలు నిరాటంకంగా సాగుతున్నాయి. నిత్యం వందలాది టన్నుల క్వార్ట్‌జ్, పల్స్‌ఫర్, వర్‌ముఖ్‌లైట్ ఖనిజాన్ని ఇతర ప్రాంతాలకు తరలిస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు. సంబంధిత అధికారులకు ముడుపులు అందుతుండడంతో వారు మౌనం వహిస్తున్నారన్న ఆరోపణలున్నాయి.
పెరుమాళ్లపాడు, ఊటుకూరు, తిప్పిరెడ్డిపల్లి, చాగ ణం, తలుపూరు గ్రామాల్లో క్వార్ట్‌జ్, పల్స్‌ఫర్, వర్‌ముఖ్‌లైట్ ఖనిజం కోసం యథేచ్ఛగా అక్రమ తవ్వకాలు సాగుతున్నాయి. ఎక్కడా ప్రభుత్వ అనుమతి ఉన్న దాఖలాలు లేవు. క్వార్ట్‌జ్ ఖనిజం తవ్వకాలకు వెళ్లే పేదల బతుకులు దుర్భరంగా మారుతున్నాయి. పనులకు వెళ్లే పేదలకు ప్రమాదం జరిగితే పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. ఇకనైనా ఉన్నతాధికారులు స్పందించి గ్రామంలో జరుగుతున్న అక్రమ క్వార్ట్‌జ్, పల్స్‌ఫర్, వర్‌ముఖ్‌లైట్ అక్రమ తవ్వకాలను నిరోధించాలని, రూటు మార్చి తరలిస్తున్న రవాణాదారులపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
చర్యలు తీసుకుంటాం
అక్రమ క్వార్ట్‌జ్, పల్స్‌ఫర్, వర్‌ముఖ్‌లైట్ ఖనిజాన్ని ఇతర ప్రాంతాలకు తరలించే వారిపై చర్యలు తీసుకుంటాం. ప్రభుత్వానికి ఆదాయం సమకూరేలా ప్రత్యేక చర్యలు చేపడుతున్నాం. అక్రమ తవ్వకాలు రవాణాపై పూర్తిస్థాయిలో నిఘా ఏర్పాటు చేస్తున్నాం. తద్వారా క్వార్ట్‌జ్ ఖనిజం అక్రమ రవాణా జరగకుండా ఉండేందుకు చర్యలు తీసుకుంటాం. పెంచలయ్య, తహశీల్దార్
అక్రమార్కులకు ‘తెల్ల’బంగారం
Published Fri, Jan 17 2014 3:39 AM | Last Updated on Sat, Sep 2 2017 2:40 AM
Advertisement
Advertisement