ఖనిజాలు, గనులు కలిగిన భూమిపై పన్నులు విధించే అధికారం రాష్ట్రాలకు ఉందని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. ఫలితంగా మైనింగ్ కంపెనీలపై రూ.1.8 లక్షల కోట్ల నుంచి రూ.2 లక్షల కోట్ల వరకు భారం పడవచ్చని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. సుప్రీం కోర్టు తీర్పు వల్ల మైనింగ్, ఉక్కు, విద్యుత్, బొగ్గు రంగాల్లోని సంస్థలు గణనీయంగా ప్రభావితం అవుతాయని అంచనా.
భారత అత్యున్నత న్యాయస్థానం ఇటీవల మైనింగ్ రాయల్టీ కేసును విచారించి తీర్పును వెలువరించింది. ఖనిజాలు, గనులు కలిగి ఉన్న భూమిపై పన్నులు విధించే అధికారం రాష్ట్రాలకు ఉందని కోర్టు తీర్పునిచ్చింది. దాంతో భారతీయ ఖనిజ పరిశ్రమల సమాఖ్య (ఫిమి) సుప్రీం తీర్పుపై ఆందోళన వ్యక్తం చేసింది. భారతీయ మైనింగ్ రంగం ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా అత్యధిక పన్ను రేట్లను ఎదుర్కొంటుందని ఫిమి పేర్కొంది.
ఈ సందర్భంగా ఫిమి అడిషనల్ సెక్రటరీ జనరల్ బీకే భాటియా మాట్లాడుతూ..‘మైనింగ్ కంపెనీలు ఏప్రిల్ 1, 2005 నుంచి పొందిన రాయల్టీలను తిరిగి చెల్లించాలని సుప్రీం కోర్టు తీర్పునిచ్చింది. దాంతోపాటు మైనింగ్ భూమిపై పన్ను విధించే హక్కు రాష్ట్రాలకు ఉందని చెప్పింది. దాంతో కంపెనీలకు నష్టం వాటిల్లుతుంది. ఒడిశా, జార్ఖండ్ వంటి రాష్ట్రాల్లోని గనులు తీవ్రంగా దెబ్బతింటాయి. ఇప్పటికే అంతర్జాతీయంగా మైనింగ్ కంపెనీలు భారీగా పన్నులు చెల్లిస్తున్నాయి. సుప్రీం తీర్పు వల్ల అంతిమ ఉత్పత్తులపై ప్రభావం పడుతుంది. దాంతో ద్రవ్యోల్బణం పెరుగుతుంది. పన్నుల విధానాన్ని స్థిరీకరించేందుకు, మైనింగ్ రంగం వృద్ధికి కేంద్ర ప్రభుత్వం శాసనపరమైన చర్యలు తీసుకోవాలి’ అని అన్నారు.
ఇదీ చదవండి: వాట్సప్ స్టేటస్‌లు కాదు..వీరి గురించి తెలుసా..
ఇదిలాఉండగా, ఖనిజాలు అధికంగా ఉన్న రాష్ట్రాల్లో కంపెనీలు గత 12 ఏళ్ల నుంచి రాయల్డీ బకాయిలు చెల్లించడం భారం అవుతుంది. ఇప్పటికే చాలా ఉత్పత్తుల ధరలు పెరిగి ద్రవ్యోల్బణం అధికమవుతుంది. దీనికితోడు సుప్రీంకోర్టు తీర్పుతో అంతిమ ఉత్పత్తుల ధరలు పెరుగుతాయని అంచనా. ఖనిజాలను ముడిసరుకుగా ఉపయోగించుకుని తయారయ్యే ప్రతి వస్తువుపై దీని ప్రభావం ఉంటుంది. కోర్టు తీర్పు పాటించాలంటే కంపెనీలు తన జేబులో నుంచి డబ్బులు వెచ్చించవు. తిరిగి వినియోగదారులపైనే ఆ భారాన్ని మోపుతాయి. దానివల్ల సామాన్యుడికే నష్టమని కొందరు విశ్లేషకులు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment