white stone illegal mining
-
క్వార్డ్జ్ గనుల్లో.. ఘనుల లూటీ!
సాక్షి టాస్క్‌ఫోర్స్: కనీవినీ ఎరుగని రీతిలో ఏకంగా ‘ముఖ్య’ నేత పర్యవేక్షణలో జరుగుతున్న ‘తెల్ల’బోయే లూటీ కథ ఇదీ! పరిశ్రమ ఏర్పాటు ముసుగులో ప్రకృతి సంపదను పిండి చేసే ఘనాపాటీల వ్యూహం దీని వెనుక దాగి ఉంది. ‘ముఖ్య’నేత ఆదేశాలతో స్వయంగా ఆయన కార్యాలయమే రంగంలోకి దిగి ఈ వ్యవహారాలను చక్కబెడుతోంది. ఇక ఈ మైనింగ్ దోపిడీలో అధికారికం.. అనధికారికం అనే తేడాలే లేవు. అనుమతుల పట్టింపే లేదు. గనులు ఎవరివైనా సరే.. ఖనిజాన్ని మాత్రం వారు చెప్పిన ధరకు అప్పగించాల్సిందే. ఇస్తావా..? లేదంటే చస్తావా?.. అంతే!! ఐదేళ్లలో రూ.వేల కోట్లను ఆర్జించే ఎత్తుగడ ఇదీ. రాష్ట్రంలోని క్వార్ట్జ్ (తెల్లరాయి) గనుల్లో నిక్షిప్తమైన అపార ఖనిజ సంపద దోపిడీ కుట్రలు టీడీపీ పెద్దల కనుసన్నల్లో సాగుతుండగా.. నెల్లూరుకు చెందిన ఓ సీనియర్ ప్రజాప్రతినిధిని ముందుపెట్టి ‘ముఖ్య’నేత కార్యాలయం అనునిత్యం దీన్ని పర్యవేక్షిస్తున్నట్లు తెలుస్తోంది. సైదాపురం పరిసరాల్లో క్వార్ట్జ్ ఆధారిత పరిశ్రమ ఏర్పాటు ముసుగులో ఈ దందాకు తెర తీశారు. ఇందుకు సీనియర్ ప్రజాప్రతినిధి 50 శాతం పెట్టుబడి పెడితే ఆయనకు వాటాలు దక్కేలా డీల్ కుదిరినట్లు సమాచారం. దీంతో సైదాపురం పరిసర ప్రాంతాల నుంచి నిత్యం రాత్రి పూట వందల లారీల్లో ఖనిజాన్ని అక్రమంగా తరలిస్తున్నారు. తమకు ముడిసరుకు మొత్తం అప్పగించకుంటే గనుల నుంచి మీ లారీలు వెళ్లలేవని, కేసులు బనాయించి లీజులు రద్దు చేయిస్తామని బెదిరించినట్లు అన్ని అనుమతులున్న గనుల యజమానులు వాపోతున్నారు. తమ మైన్లకు అన్ని అనుమతులు ఉన్నాయని, గత 50 ఏళ్లుగా ‘డెడ్ రెంట్’ సైతం చెల్లిస్తున్నామని, గత ఆర్నెళ్లుగా మైనింగ్‌ను అడ్డుకుని బెదిరింపులకు దిగుతున్నారని పేర్కొంటున్నారు.వేస్ట్ మెటల్‌తో కోట్లు..స్థానిక సీనియర్ ప్రజాప్రతినిధి కీలక అనుచరుడి చేతిలో నాలుగు మైన్లు ఉన్నాయి. సైదాపురం సమీపంలోని శ్రీనివాస పద్మావతి, చాగణం సమీపంలో ఉన్న సిద్ధి వినాయక, తుమ్మలతలుపూరులో ఉన్న జయలక్ష్మి కనకదుర్గా, కలిచేడు సమీపంలో ఉన్న రాఘవేంద్ర గనులు ఆయన ఆధీనంలో ఉన్నాయి. ఈ గనుల్లో గతంలో ఎందుకు పనికి రాదని గుట్టలు గుట్టలుగా వదిలేసిన వేస్ట్ ఖనిజమే మైకా క్వార్డ్జ్. ఈ ఖనిజానికి ప్రస్తుతం విపరీతమైన డిమాండ్ ఉండడంతో ఆ వేస్ట్ మెటల్‌తోనే కోట్లు ఆర్జించే దందాలో భాగస్వాములయ్యారు.తాజాగా మరో 4 గనులకు..! స్థానిక ప్రజాప్రతినిధి బంధువులు, అనుచరులకు రెండు రోజుల క్రితం మరో నాలుగు గనులకు అనుమతి ఇచ్చారు. ఆయన బంధువుకు రెండు, జోగుపల్లికి చెందిన దళారీకి పొక్కందల సమీపంలో ఒక గని, చాకలికొండ వద్ద ఉన్న మరో గనికి అనుమతి ఇచ్చారు. సైదాపురం మండలంలోని రామసాగరం, చిల్లకూరు మండలంలోని రెట్టపల్లిలో ఉన్న గనికి కూడా అనుమతులు మంజూరు చేశారు. స్థానిక ప్రజాప్రతినిధికి వ్యతిరేకంగా జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ఇద్దరు మంత్రులు పావులు కదపడంతో తాత్కాలికంగా నిలుపుదల చేశారు.క్వార్ట్జ్ ఆధారిత పరిశ్రమ పేరుతో..సైదాపురం పరిసరాల్లో క్వార్ట్జ్ ఆధారిత పరిశ్రమ ఏర్పాటు ప్రతిపాదన తెరపైకి తెచ్చి మొత్తం మైనింగ్‌పై పెత్తనాన్ని ప్రభుత్వ పెద్దలు స్థానిక సీనియర్ ప్రజాప్రతినిధికి అప్పగించారనే ప్రచారం జరుగుతోంది. ఇటీవల సైదాపురం వ్యవహారంపై ప్రభుత్వ పెద్దలతో చర్చించేందుకు వెళ్లిన ఆయన... ప్రస్తుతం చైనాలో ఉన్న క్వార్ట్జ్ ఆధారిత పరిశ్రమను మన రాష్ట్రంలో కూడా ఏర్పాటు చేస్తామని ఒప్పందం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ప్రజల నుంచి వ్యతిరేకత రాకుండా 50 శాతం పెట్టుబడి పెడితే వాటాలు ఇచ్చే ఒప్పందంతో సైదాపురం గనులను ఆయనకు అప్పగించారనే ప్రచారం సాగుతోంది. దీంతో క్వార్ట్జ్ మెటల్‌ను వ్యాపారులు ఇకపై ఆయన అనుచరులు నిర్ణయించిన ధరకే ఇచ్చేలా చూడాలని అధికారులకు ఆదేశాలు అందినట్లు చెబుతున్నారు. ‘ముఖ్య’నేత కార్యాలయం నుంచి అధికారులకు ఈమేరకు ఆదేశాలు రావడంతో జిల్లాకు చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు, మరో కీలకనేత దీనిపై మైనింగ్ మంత్రితో చర్చించినట్లు తెలుస్తోంది. అయితే ఈ వ్యవహారం అంతా ‘ముఖ్య’నేత కార్యాలయం పర్యవేక్షిస్తోందని, ఇకపై ఎవరూ కూడా ఈ దందా విషయంలో కలగజేసుకోవద్దని మంత్రి కార్యాలయం చేతులెత్తేసినట్లు సమాచారం.మైకా క్వార్ట్జ్ ఖనిజం టన్ను రూ.2 లక్షలు!సైదాపురం మండలంలో దొరికే మైకా క్వార్ట్జ్ ఖనిజం టన్ను రూ.20 వేల నుంచి మొదలై రూ.2 లక్షల వరకు పలుకుతోంది. దీంతో కాలం చెల్లిన గనుల్లో ఉన్న ఈ ఖనిజాన్ని దోచుకునేందుకు, మిగిలిన గనులను సొంతం చేసుకునేందుకు కూటమి నేతలు రాజకీయ పైరవీలు సాగిస్తున్నారు. ఇప్పటికే అనధికారికంగా మైనింగ్ చేస్తున్న కూటమి నేతలు చీకటి పడితే చాలు దండులా వాహనాలతో తెల్లరాయి అక్రమ రవాణా సాగిస్తున్నారు. టన్నుల లెక్కన అనధికారికంగా వసూలు చేస్తున్నారు. ఇందులో ప్రధానంగా ముగ్గురు అధికారుల పాత్ర కూడా ఉండడంతో అక్రమ రవాణాకు ఎక్కడా అడ్డు చెప్పడం లేదని తెలుస్తోంది. దీనిపై ముగ్గురు ఎమ్మెల్యేలు, మరో కీలక నేత రగిలిపోతున్నారు. తమ జేబులోకి వచ్చి పడే సొమ్మును లాక్కెళ్లిపోతున్నారని గుర్రుమంటున్నారు.80 గనులు ఓపెన్?– ఖనిజం విలువ రూ.10 వేల కోట్లు..గత ఆర్నెళ్లుగా నిలిచిపోయిన 80 గనులకు రాష్ట్ర గనుల శాఖ నుంచి అనుమతులు మంజూరు చేయించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇటీవల గనులను క్షేత్రస్థాయిలో పరిశీలించి రాష్ట్ర అధికారులకు నివేదిక పంపారు. అన్ని గనుల్లో ఉన్న ఖనిజం విలువ రూ.10 వేల కోట్లు ఉంటుందని అంచనా వేశారు. ఈ మేరకు ప్రభుత్వ పెద్దలకు రహస్య నివేదిక ఇవ్వడంతో కప్పం వసూలుకు సిద్ధమయ్యారు. లీగల్ మైన్లు తాము నిర్దేశించిన వారి చేతికి అప్పగిస్తేనే వాటికి పర్మిషన్లు ఇస్తామంటున్నారు. దీంతో గత 40 – 50 ఏళ్లుగా ‘డెడ్ రెంట్’ కడుతున్న గనుల యజమానులు లబోదిబో అంటున్నారు. ఇంత దుర్మార్గం ఎక్కడైనా ఉంటుందా? అని వాపోతున్నారు.నెలకు 30 – 50 వేల టన్నులు..ఈ ప్రాంతంలో దొరికే మైకా క్వార్ట్జ్ ఖనిజాన్ని ప్రతి నెలా 30 వేల నుంచి 50 వేల టన్నులను తవ్వి ఎగుమతులు చేసే అవకాశాలున్నాయి. ప్రభుత్వానికి టన్నుకు కేవలం రూ.230 చొప్పున రాయల్టీ చెల్లించాల్సి ఉంది. నిత్యం సైదాపురం మండలంలో 1,000 టన్నులు, ఇతర ప్రాంతాల్లో మరో 500 టన్నులు దొరికే అవకాశం ఉంది.అధికారిక మైనింగ్‌దారులకు బెదిరింపులుజిల్లాలో మైనింగ్ దందాను చేజిక్కించుకున్న స్థానిక సీనియర్ ప్రజాప్రతినిధి అనుచరులు అధికారికంగా అనుమతులున్న గనులు యజమానులపై బెదిరింపులకు దిగుతున్నారు. అధికారిక గనుల్లో ఉన్న ముడిసరుకును సైతం తమకే ఇవ్వాలని, తాము చెప్పిన ధరకే అప్పగించాలని నెల్లూరులో ఓ చోటా నేత బెదిరింపులకు దిగారు. ఈ క్రమంలో హైదరాబాద్‌లో ఉన్న కార్యాలయానికి గనుల యజమానులను పిలిపించుకుని తీవ్ర స్థాయిలో హెచ్చరికలకు దిగినట్లు సమాచారం. ముడిసరుకు ఇవ్వకుంటే గనుల నుంచి మీ లారీలు వెళ్లలేవని, పలు రకాల కేసులు నమోదు చేయించి లీజులు రద్దు చేయిస్తామంటూ బెదిరించినట్లు ఓ గని యజమాని వాపోయాడు.రాత్రి వేళ అక్రమ రవాణా..స్థానిక ప్రజాప్రతినిధి అనుచర వర్గం గత రెండు నెలలుగా రాత్రి వేళల్లో సైదాపురం నుంచి అనుమతులు లేకుండా తెల్ల క్వార్ట్జ్ను నిత్యం భారీ స్థాయిలో అక్రమంగా తరలించి సొమ్ము చేసుకుంటోంది. మండలంలో 40 గనుల్లో నిల్వలున్న క్వార్ట్జ్ను స్థానిక వ్యాపారులతో మాట్లాడుకుని అక్రమ రవాణా చేస్తున్నారు. తెలంగాణ ప్రాంతానికి చెందిన మైన్ల పర్మిట్లతో సైదాపురం క్వార్ట్జ్ను చెన్నైకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. స్థానిక వ్యాపారుల నుంచి టన్ను రూ.2 వేల నుంచి రూ.5 వేలు వంతున కొనుగోలు చేసి చెన్నై మార్కెట్లో రూ.50 వేలు వంతున విక్రయిస్తున్నారు. ఇందులో స్థానిక ప్రజాప్రతినిధి కీలకంగా వ్యవహరిస్తుండడంతో రెవెన్యూ, పోలీస్, మైనింగ్ అధికారులు అటువైపు కన్నెత్తి చూసేందుకు సాహసించడం లేదు. నెలవారీ మామూళ్లతో కళ్లకు గంతలు కట్టుకున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.విస్తార గనులు.. అపార సంపద సైదాపురం, పొదలకూరు, చేజర్ల, ఉదయగిరితోపాటు తిరుపతి జిల్లాలోని గూడూరు ప్రాంతాల్లో దొరికే మైకా, మైకా క్వార్ట్జ్, క్వార్ట్జ్, పల్స్పర్, వర్ముఖ్లైట్ ఖనిజాలకు విదేశాల్లో మంచి గిరాకీ ఉంది. ఇక్కడ ఏడు భూగర్భ గనులు, 130 ఓపెన్ మైనింగ్ క్వారీలు, 26 కాలం చెల్లిన గనులున్నాయి. ఒక్క సైదాపురంలోనే 70 ఓపెన్ క్వారీలు ఉండగా మిగతావి ఇతర ప్రాంతాల్లో ఉన్నాయి. వీటిలో మరో వందేళ్ల పాటు మైనింగ్ చేసినా తరగని అపార మైకా క్వార్ట్జ్ నిల్వలు ఉన్నాయి. ప్రధానంగా సైదాపురం మండలంలో దొరికే మైకా క్వార్ట్జ్ ఖనిజానికి ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన డిమాండ్ ఉంది. ఇక్కడ ఖనిజ సంపద అపారంగా ఉండడంతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆ గనులపై కన్నేసింది. ఆర్నెళ్లుగా అన్ని రకాల మైనింగ్ అనుమతులను నిలిపివేసింది. -
తరలుతున్న తెల్ల బంగారం
సాక్షి, ప్రకాశం : తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం ఉంటే కొండను సైతం పిండిచేయగలరు కొందరు. పీసీపల్లి మండలంలోని లక్ష్మక్కపల్లి, లింగన్నపాలెం, అడవిలోపల్లి, వెంగళాయపల్లిలోని అడవుల్లో, కొండలను జేసీబీతో చదును చేసి తెల్లరాయిని వేరుచేసి అక్రమంగా తరలిస్తున్నారు. ఒక కొండను కాని, ఒక క్వారీని తవ్వాలంటే మైనింగ్ శాఖ నుంచి అనుమతి తప్పనిసరి. కానీ పీసీపల్లి మండలంలో అధికారుల అండ ఉంటే చాలు ఇవేవీ అవసరం లేదు. మండల పరిధిలోని లక్ష్మక్కపల్లి, వెంగళాయపల్లి, గుంటుపల్లిలో తదితర గ్రామాల్లో నిల్వ ఉన్న తెల్లరాయిని అక్రమంగా తవ్వి చెన్నై, బెంగళూరు వంటి నగరాలకు తరలిస్తున్నారు. తెల్లరాయికి అంతర్జాతీయ మార్కెట్లో అధిక డిమాండ్ ఉండడంతో దీని లారీ రేటు రూ.2 లక్షలు పలుకుతోంది. మైనింగ్ అనుమతి తీసుకోకుండానే వారు కొండలను తవ్వుతున్నారు. ఇంత జరుగుతున్నా మైనింగ్ అధికారులు పట్టీపట్టనట్లుగా ఉన్నారు. రెవెన్యూ అధికారులు అయితే మైనింగ్ అధికారులే పట్టించుకోలేదు మాకెందుకుంటూ మామూళ్లతో మిన్నకుండిపోతున్నారు. దీంతో తవ్వకాలు సాగించిన చోట లోయలుగా ఏర్పడి జనవాసాలకు ఇబ్బందికరంగా మారుతున్నాయి. 300 ఎకరాల్లో యథేచ్ఛగా అక్రమ క్వారీయింగ్: మండలంలో దాదాపు 300 ఎకరాల్లో తెల్లరాయి క్వారీయింగ్ జరుగుతుందంటే అక్రమార్కుల హవా ఏమేర ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఒక ప్రాంతాన్ని క్వారీయింగ్ చేయాలంటే ఆ రెవెన్యూ, ఫారెస్ట్, మైనింగ్ శాఖల అనుమతి తప్పనిసరి. అయితే మండల పరిధిలో ప్రభుత్వ భూమి, బంజరు భూముల్లో క్వారీయింగ్ అనుమతి లేకుండా యథేచ్ఛగా నిర్వహిస్తున్నారు. చుండి, మాలకొండ, లక్ష్మక్కపల్లి అడవుల్లో యథేచ్ఛగా చెట్లను నరికి వేసి ప్రాంతాన్ని జేసీబీతో చదును చేసి క్వారీయింగ్ సాగిస్తున్నారు. ఇంత జరుగుతున్నా అటవీ శాఖ కానీ, రెవెన్యూ, మైనింగ్ శాఖ కానీ తమకు పట్టదన్నట్లు వ్యవహరిస్తున్నారు. మండలంలోని మెట్లవారిపాలెం, గుంటుపల్లి, వెంగళాయపల్లి గ్రామాల్లో వ్యవసాయం చేసినంత సులువుగా తెల్లరాయి క్వారీయింగ్ చేస్తున్నారు. దీనిపై సదరు శాఖల అధికారులను వివరణ అడుగగా వారు వివరాలు వెల్లడించడానికి ఇష్టపడడం లేదు. -
ఏంజేసీనా చెల్లుతుందని!
ఆయనో బాధ్యతగల ఎంపీ.. పైగా పేద్ద మనిషి... మైకు దొరికితే చాలు నీతులు ఎడా పెడా చెప్పే ఆయన... కాసులకోసం కక్కుర్తి పడ్డారు. అనుమతుల్లేకుండానే ముగ్గురాయి కోసం భారీగా తవ్వకాలు జరుపుతున్నారు. స్వయంగా ఆయనే వెళ్లి పనులు పర్యవేక్షిస్తున్నారు. అనుమతులు లేవనీ, అక్రమమని తెలిసినా అధికారులు మాత్రం అటువైపుగా వెళ్లేందుకు కూడా సాహసింహచడం లేదు. అనంతపురం సెంట్రల్: ముగ్గురాయి కోసం ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి అడ్డదారులు తొక్కారు. శింగనమల నియోజకవర్గంలోని యల్లనూరు మండలం కూచివారిపల్లి గ్రామ సమీపంలో ఉన్నఅటవీ ప్రాంతంలో భారీ యంత్రాలు ఉపయోగించి తవ్వకాలు జరుపుతున్నారు. అనుమతులు రాకుండానే గుట్టుచప్పుడు కాకుండా పనులు చేపడుతున్నారు. ఈ అక్రమ తవ్వకాలపై పత్రికల్లో వార్తాకథనాలు రావడంతో నెల రోజుల క్రితం పనులు నిలిపేశారు. 20 రోజుల క్రితం మళ్లీ ప్రారంభం ముగ్గురాయి మైనింగ్ పనులకు పూర్తిస్థాయి అనుమతులు రాకపోయినా 20 రోజుల క్రితం గుట్టుచప్పుడు కాకుండా మళ్లీ పనులు ప్రారంభించారు. ఇతర ప్రాంతాల నుంచి కూలీలను రప్పించి పనులు చేయిస్తున్నారు. అక్కడ భారీ యంత్రాలతో కూడిన క్రేన్‌ను కుడా ఏర్పాటు చేసుకుని భూగర్భంలో బ్లాస్టింగ్లు చేస్తూ ముగ్గురాయి ఖనిజాన్ని బయటకు తీస్తున్నారు. పలుమార్లు పర్యవేక్షణకు వచ్చిన ఎంపీ కూచివారిపల్లి అటవీ ప్రాంతంలో అక్రమంగా చేయిస్తున్న మైనింగ్ పనులను స్వయంగా జేసీ దివాకర్ రెడ్డి వచ్చి పలుమార్లు పర్యవేక్షించి వెళ్లినట్లు కూచివారిపల్లి గ్రామస్తులు తెలుపుతున్నారు. సాధారణంగా ఎంపీ స్థాయి వ్యక్తి ఎక్కడైనా పర్యటనలకు వెళ్లి నప్పుడు ప్రోటోకాల్ అంటూ హంగామా చేసే జేసీ దివాకర్‌రెడ్డి కూచివారిపల్లి అటవీ ప్రాంతానికి వచ్చే సమయంలో ఎవరికీ సమాచారం ఇవ్వకుండా... వచ్చి వెళ్లిపోతుండటంతో అటవీ ప్రాంతంలో ఏం జరుగుతోందో అని ప్రజలు చర్చించుకుంటున్నారు. ఆయనతో పాటు వైఎస్సార్ కడప జిల్లాకు చెందిన మరొక అధికార పార్టీ నేత కూడా వచ్చి పనులు పర్యవేక్షించినట్లు సమాచారం. పట్టించుకోని అటవీ శాఖ అధికారులు గతంలో అక్రమ మైనింగ్ గురించి పత్రికల్లో వార్తలు వచ్చిన తరువాత పనులను నిలిపివేయించిన అటవీశాఖ అధికారులు... తిరిగి పనులను నిర్వహిస్తున్నా ఏమీ ఎరుగనట్లు వ్యవహరిస్తున్నారు. మైనింగ్ పనులు చేపడుతున్నది అధికార పార్టీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి కావడంతోనే అటవీ శాఖ అధికారులకు పట్టించుకోవడం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి. దీనిపై జిల్లా అటవీ శాఖ అధికారులను ‘సాక్షి’ వివరణ కోరగా ఎల్లుట్ల అటవీ ప్రాంతంలో చేస్తున్న మైనింగ్ పనులకు అనుమతులు ఉన్నాయని, అనుమతుల కోసం వారు ప్రభుత్వానికి డబ్బులు కూడా చెల్లించినట్లు చెబుతున్నారు. చర్యలు తీసుకోకుంటే ధర్నా చేస్తాం ఎల్లుట్ల అటవీ ప్రాంతంలో జేసీ విజయ పేరు మీద నిర్వహిస్తున్న మైనింగ్‌కు అనుమతులు రాలేదు. కానీ అటవీ శాఖ అధికారులు ఏ మాత్రం పట్టించుకోకుండా అనుమతుల విషయం అడిగినవారిని తప్పుదోవ పట్టిస్తున్నారు. ఇప్పటికైనా అక్రమ మైనింగ్‌పై చర్యలు తీసుకోకుంటే నాలుగైదు రోజుల్లో అటవీ శాఖ కార్యాలయం ఎదుట పెద్ద ఎత్తున ధర్నా చేపడుతాం. – కేతిరెడ్డి పెద్దారెడ్డి, వైఎస్సార్సీపీ తాడిపత్రి సమన్వయకర్త అనుమతి ఇవ్వలేదు యల్లనూరు, పుట్లూరు మండలాల పరిధిలోని అటవీ ప్రాంతంలో మైనింగ్‌కు ఎవరికీ అనుమతులు ఇవ్వలేదు. ప్రస్తుతం ముచ్చుకోట అటవీ ప్రాంతంలో చేసే మైనింగ్‌కు పనులకు మాత్రమే అనుమతులిచ్చాం. ఎల్లుట్ల అటవీ ప్రాంతంలో మైనింగ్ జరగుతున్నట్లు మాకు ఇంతవరకూ అటవీ శాఖ నుంచి సమాచారం అందలేదు.– వెంకటేశ్వరరెడ్డి, మైనింగ్ ఏడీ, తాడిపత్రి -
సర్కారుకు సున్నం..ఖజానాకు కన్నం
పల్నాట తెలుగుదేశం నేతల దందా వందల ఎకరాల్లో తెల్లరాయి అక్రమ తవ్వకాలు టీడీపీ నేతల కొమ్ము కాస్తున్న అధికారగణం సాక్షి ప్రతినిధి, గుంటూరు : పల్నాడులో పేరొందిన ప్రాంతమది. అక్కడి తెలుగుదేశం పార్టీ నేతలు సాగిస్తున్న అక్రమ దందాలకు అధికారులు సైతం కొమ్ముకాస్తున్నారు. అక్రమ క్వారీ యింగ్ నడుపుతూ ప్రభుత్వ ఖజానాకు గండికొడుతున్నా కిమ్మనడం లేదు. తమ ఉనికి కాపాడుకునే యత్నం కూడా చేయడం లేదు. పోలీస్, రెవెన్యూ, మైనింగ్ శాఖల కళ్లెదుట అనుమతులు లేకుండా 20 నుంచి 30 అడుగుల లోతు వరకు సున్నపురాయిని తవ్వేస్తున్నా, పర్మిట్లు లేకుండా వందల లారీలు తిప్పేస్తున్నా చోద్యం చూస్తున్నారు. కనీసం అక్కడి పరిస్థితులపై ఉన్నతాధికారులకు నివేదిక పంపే యత్నమే చేయడం లేదు. ఈ నేపథ్యంలో వైఎస్సార్ సీపీ నేతలు అక్కడి దందాపై జిల్లా కలెక్టర్, ఎస్పీలకు నెల రోజుల క్రితం ఇచ్చిన వినతిపత్రాలు బుట్టదాఖలు కావడంతో అధికార యంత్రాంగం పనితీరును ప్రతీ ఒక్కరూ ప్రశ్నిస్తున్నారు. నవ్విపోదురుగాక మాకేటీ అనే రీతిలో అధికారులు ఉండటంతో విసుగెత్తిన వైఎస్సార్ సీపీ నేతలు ఆ క్వారీ లోని అక్రమ దందాను వెలుగులోకి తీసుసుకువచ్చే యత్నం చేస్తే, అక్కడా దౌర్జన్యం. అక్రమ క్వారీయింగ్ తామే చేసుకుంటున్నామని, ఎవరి ప్రమేయం లేదంటూ చేస్తున్న తప్పును సమర్థించుకునే యత్నం. ఉపాధికోసం ఈ వ్యవహారం జరుగుతోందని నమ్మబలికే ప్రయత్నం. అధికారంలోకి వచ్చిన తరువాత గురజాల నియోజకవర్గంలో కొనసాగుతున్న టీడీపీ దుర్నీతిపై ఆ పార్టీ నేతల నుంచే వెల్లువెత్తుతున్న విమర్శలు, విపక్షాల ఆందోళనలు అధికారుల చెవులను తాకకపోవడం వెనుక ఆంతర్యం తెలియందేమీ కాదు. నియోజకవర్గంలో తెల్లరాయి వ్యాపారం చేసుకుంటున్న కొందరిని టీడీపీ నేతలు బెదిరించి ఆ క్వారీలను స్వాధీనం చేసుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. గతంలో ప్రభుత్వం నుంచి తెల్లరాయి తవ్వకాలకు అనుమతులు పొందిన సిమెంట్ కంపెనీల భూములు, ప్రభుత్వ భూములు, కొందరి వ్యాపారుల భూములను కబ్జా చేసి అక్రమ మైనింగ్ జరుపుతున్నట్టు తెలుస్తోంది. అన్ని అనుమతులు కలిగిన క్వారీలకు ఉండే పొక్లయిన్లు, లారీలు, ట్రక్కులు ఈ నిర్వాహకులకు ఉండటమే కాకుండా వందలాది కార్మికులు అక్కడ పనిచేస్తున్నారు. ముఖ్యంగా పిడుగురాళ్ల, దాచేపల్లి మండలాల పరిధిలోని వందల ఎకరాల విస్తీర్ణంలో ఈ అక్రమ దందా జరుగు తోంది. ఇంత జరుగుతున్నా ఒక్క రూపాయి కూడా ప్రభుత్వ ఖజానాకు జమ కావడం లేదు. ఆంధ్ర సిమెంట్ ఫ్యాక్టరీకి చెందిన భూముల్లో అక్రమ మైనింగ్ జరుగుతున్నా, ఫ్యాక్టరీ యాజమాన్యం కూడా ప్రశ్నించే సాహసం చేయలేక పోతోంది. దాదాపు అన్ని ప్రభుత్వ శాఖల అధికారులకు, సిబ్బందికి నెలవారీ మామూళ్లు అందుతున్నాయనే ఆరోపణలు బలంగా వినపడుతున్నాయి. తెలుగు తమ్ముళ్లు చేస్తున్న అక్రమ క్వారీయింగ్‌తో గురజాల నియోజకవర్గంలో తెల్లరాయి గనులన్నీ కరిగిపోతు న్నాయి. లోటు బడ్జెట్లో ఉన్నాం. ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇచ్చే పరిస్థితి లేదంటూ ప్రజలపై పన్నుల భారం మోపుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు తెలుగుతమ్ముళ్ల అక్రమ క్వారీయింగ్‌ను నిలువరిస్తే కొంత ఆర్థిక వెసులుబాటు కలుగుతుందని, ఆ దిశగా చర్యలు తీసుకోవాలని విపక్షాలు కోరుతున్నాయి.