సర్కారుకు సున్నం..ఖజానాకు కన్నం
పల్నాట తెలుగుదేశం నేతల దందా
వందల ఎకరాల్లో తెల్లరాయి అక్రమ తవ్వకాలు
టీడీపీ నేతల కొమ్ము కాస్తున్న అధికారగణం
సాక్షి ప్రతినిధి, గుంటూరు : పల్నాడులో పేరొందిన ప్రాంతమది. అక్కడి తెలుగుదేశం పార్టీ నేతలు సాగిస్తున్న అక్రమ దందాలకు అధికారులు సైతం కొమ్ముకాస్తున్నారు. అక్రమ క్వారీ యింగ్ నడుపుతూ ప్రభుత్వ ఖజానాకు గండికొడుతున్నా కిమ్మనడం లేదు. తమ ఉనికి కాపాడుకునే యత్నం కూడా చేయడం లేదు. పోలీస్, రెవెన్యూ, మైనింగ్ శాఖల కళ్లెదుట అనుమతులు లేకుండా 20 నుంచి 30 అడుగుల లోతు వరకు సున్నపురాయిని తవ్వేస్తున్నా, పర్మిట్లు లేకుండా వందల లారీలు తిప్పేస్తున్నా చోద్యం చూస్తున్నారు.
కనీసం అక్కడి పరిస్థితులపై ఉన్నతాధికారులకు నివేదిక పంపే యత్నమే చేయడం లేదు. ఈ నేపథ్యంలో వైఎస్సార్ సీపీ నేతలు అక్కడి దందాపై జిల్లా కలెక్టర్, ఎస్పీలకు నెల రోజుల క్రితం ఇచ్చిన వినతిపత్రాలు బుట్టదాఖలు కావడంతో అధికార యంత్రాంగం పనితీరును ప్రతీ ఒక్కరూ ప్రశ్నిస్తున్నారు. నవ్విపోదురుగాక మాకేటీ అనే రీతిలో అధికారులు ఉండటంతో విసుగెత్తిన వైఎస్సార్ సీపీ నేతలు ఆ క్వారీ లోని అక్రమ దందాను వెలుగులోకి తీసుసుకువచ్చే యత్నం చేస్తే, అక్కడా దౌర్జన్యం.
అక్రమ క్వారీయింగ్ తామే చేసుకుంటున్నామని, ఎవరి ప్రమేయం లేదంటూ చేస్తున్న తప్పును సమర్థించుకునే యత్నం. ఉపాధికోసం ఈ వ్యవహారం జరుగుతోందని నమ్మబలికే ప్రయత్నం. అధికారంలోకి వచ్చిన తరువాత గురజాల నియోజకవర్గంలో కొనసాగుతున్న టీడీపీ దుర్నీతిపై ఆ పార్టీ నేతల నుంచే వెల్లువెత్తుతున్న విమర్శలు, విపక్షాల ఆందోళనలు అధికారుల చెవులను తాకకపోవడం వెనుక ఆంతర్యం తెలియందేమీ కాదు.
నియోజకవర్గంలో తెల్లరాయి వ్యాపారం చేసుకుంటున్న కొందరిని టీడీపీ నేతలు బెదిరించి ఆ క్వారీలను స్వాధీనం చేసుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. గతంలో ప్రభుత్వం నుంచి తెల్లరాయి తవ్వకాలకు అనుమతులు పొందిన సిమెంట్ కంపెనీల భూములు, ప్రభుత్వ భూములు, కొందరి వ్యాపారుల భూములను కబ్జా చేసి అక్రమ మైనింగ్ జరుపుతున్నట్టు తెలుస్తోంది. అన్ని అనుమతులు కలిగిన క్వారీలకు ఉండే పొక్లయిన్లు, లారీలు, ట్రక్కులు ఈ నిర్వాహకులకు ఉండటమే కాకుండా వందలాది కార్మికులు అక్కడ పనిచేస్తున్నారు.
ముఖ్యంగా పిడుగురాళ్ల, దాచేపల్లి మండలాల పరిధిలోని వందల ఎకరాల విస్తీర్ణంలో ఈ అక్రమ దందా జరుగు తోంది. ఇంత జరుగుతున్నా ఒక్క రూపాయి కూడా ప్రభుత్వ ఖజానాకు జమ కావడం లేదు. ఆంధ్ర సిమెంట్ ఫ్యాక్టరీకి చెందిన భూముల్లో అక్రమ మైనింగ్ జరుగుతున్నా, ఫ్యాక్టరీ యాజమాన్యం కూడా ప్రశ్నించే సాహసం చేయలేక పోతోంది. దాదాపు అన్ని ప్రభుత్వ శాఖల అధికారులకు, సిబ్బందికి నెలవారీ మామూళ్లు అందుతున్నాయనే ఆరోపణలు బలంగా వినపడుతున్నాయి.
తెలుగు తమ్ముళ్లు చేస్తున్న అక్రమ క్వారీయింగ్‌తో గురజాల నియోజకవర్గంలో తెల్లరాయి గనులన్నీ కరిగిపోతు న్నాయి. లోటు బడ్జెట్‌లో ఉన్నాం. ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇచ్చే పరిస్థితి లేదంటూ ప్రజలపై పన్నుల భారం మోపుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు తెలుగుతమ్ముళ్ల అక్రమ క్వారీయింగ్‌ను నిలువరిస్తే కొంత ఆర్థిక వెసులుబాటు కలుగుతుందని, ఆ దిశగా చర్యలు తీసుకోవాలని విపక్షాలు కోరుతున్నాయి.