గుంతల్లోకి దిగేందుకు వేసుకున్న నిచ్చెన, వెలికి తీసిన ముగ్గురాయి ఖనిజం
ఆయనో బాధ్యతగల ఎంపీ.. పైగా పేద్ద మనిషి... మైకు దొరికితే చాలు నీతులు ఎడా పెడా చెప్పే ఆయన... కాసులకోసం కక్కుర్తి పడ్డారు. అనుమతుల్లేకుండానే ముగ్గురాయి కోసం భారీగా తవ్వకాలు జరుపుతున్నారు. స్వయంగా ఆయనే వెళ్లి పనులు పర్యవేక్షిస్తున్నారు. అనుమతులు లేవనీ, అక్రమమని తెలిసినా అధికారులు మాత్రం అటువైపుగా వెళ్లేందుకు కూడా సాహసింహచడం లేదు.
అనంతపురం సెంట్రల్: ముగ్గురాయి కోసం ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి అడ్డదారులు తొక్కారు. శింగనమల నియోజకవర్గంలోని యల్లనూరు మండలం కూచివారిపల్లి గ్రామ సమీపంలో ఉన్నఅటవీ ప్రాంతంలో భారీ యంత్రాలు ఉపయోగించి తవ్వకాలు జరుపుతున్నారు. అనుమతులు రాకుండానే గుట్టుచప్పుడు కాకుండా పనులు చేపడుతున్నారు. ఈ అక్రమ తవ్వకాలపై పత్రికల్లో వార్తాకథనాలు రావడంతో నెల రోజుల క్రితం పనులు నిలిపేశారు.
20 రోజుల క్రితం మళ్లీ ప్రారంభం
ముగ్గురాయి మైనింగ్ పనులకు పూర్తిస్థాయి అనుమతులు రాకపోయినా 20 రోజుల క్రితం గుట్టుచప్పుడు కాకుండా మళ్లీ పనులు ప్రారంభించారు. ఇతర ప్రాంతాల నుంచి కూలీలను రప్పించి పనులు చేయిస్తున్నారు. అక్కడ భారీ యంత్రాలతో కూడిన క్రేన్‌ను కుడా ఏర్పాటు చేసుకుని భూగర్భంలో బ్లాస్టింగ్‌లు చేస్తూ ముగ్గురాయి ఖనిజాన్ని బయటకు తీస్తున్నారు.
పలుమార్లు పర్యవేక్షణకు వచ్చిన ఎంపీ
కూచివారిపల్లి అటవీ ప్రాంతంలో అక్రమంగా చేయిస్తున్న మైనింగ్ పనులను స్వయంగా జేసీ దివాకర్ రెడ్డి వచ్చి పలుమార్లు పర్యవేక్షించి వెళ్లినట్లు కూచివారిపల్లి గ్రామస్తులు తెలుపుతున్నారు. సాధారణంగా ఎంపీ స్థాయి వ్యక్తి ఎక్కడైనా పర్యటనలకు వెళ్లి నప్పుడు ప్రోటోకాల్ అంటూ హంగామా చేసే జేసీ దివాకర్‌రెడ్డి కూచివారిపల్లి అటవీ ప్రాంతానికి వచ్చే సమయంలో ఎవరికీ సమాచారం ఇవ్వకుండా... వచ్చి వెళ్లిపోతుండటంతో అటవీ ప్రాంతంలో ఏం జరుగుతోందో అని ప్రజలు చర్చించుకుంటున్నారు. ఆయనతో పాటు వైఎస్సార్ కడప జిల్లాకు చెందిన మరొక అధికార పార్టీ నేత కూడా వచ్చి పనులు పర్యవేక్షించినట్లు సమాచారం.
పట్టించుకోని అటవీ శాఖ అధికారులు
గతంలో అక్రమ మైనింగ్ గురించి పత్రికల్లో వార్తలు వచ్చిన తరువాత పనులను నిలిపివేయించిన అటవీశాఖ అధికారులు... తిరిగి పనులను నిర్వహిస్తున్నా ఏమీ ఎరుగనట్లు వ్యవహరిస్తున్నారు. మైనింగ్ పనులు చేపడుతున్నది అధికార పార్టీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి కావడంతోనే అటవీ శాఖ అధికారులకు పట్టించుకోవడం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి. దీనిపై జిల్లా అటవీ శాఖ అధికారులను ‘సాక్షి’ వివరణ కోరగా ఎల్లుట్ల అటవీ ప్రాంతంలో చేస్తున్న మైనింగ్ పనులకు అనుమతులు ఉన్నాయని, అనుమతుల కోసం వారు ప్రభుత్వానికి డబ్బులు కూడా చెల్లించినట్లు చెబుతున్నారు.
చర్యలు తీసుకోకుంటే ధర్నా చేస్తాం
ఎల్లుట్ల అటవీ ప్రాంతంలో జేసీ విజయ పేరు మీద నిర్వహిస్తున్న మైనింగ్‌కు అనుమతులు రాలేదు. కానీ అటవీ శాఖ అధికారులు ఏ మాత్రం పట్టించుకోకుండా అనుమతుల విషయం అడిగినవారిని తప్పుదోవ పట్టిస్తున్నారు. ఇప్పటికైనా అక్రమ మైనింగ్‌పై చర్యలు తీసుకోకుంటే నాలుగైదు రోజుల్లో అటవీ శాఖ కార్యాలయం ఎదుట పెద్ద ఎత్తున ధర్నా చేపడుతాం.
– కేతిరెడ్డి పెద్దారెడ్డి, వైఎస్సార్‌సీపీ తాడిపత్రి సమన్వయకర్త
అనుమతి ఇవ్వలేదు
యల్లనూరు, పుట్లూరు మండలాల పరిధిలోని అటవీ ప్రాంతంలో మైనింగ్‌కు ఎవరికీ అనుమతులు ఇవ్వలేదు. ప్రస్తుతం ముచ్చుకోట అటవీ ప్రాంతంలో చేసే మైనింగ్‌కు పనులకు మాత్రమే అనుమతులిచ్చాం. ఎల్లుట్ల అటవీ ప్రాంతంలో మైనింగ్ జరగుతున్నట్లు మాకు ఇంతవరకూ అటవీ శాఖ నుంచి సమాచారం అందలేదు.– వెంకటేశ్వరరెడ్డి, మైనింగ్ ఏడీ, తాడిపత్రి
Comments
Please login to add a commentAdd a comment