= సీఎం కిరణ్ కాంగ్రెస్‌లోనే ఉంటారనే నమ్మకముంది
= సమైక్యాంధ్ర కోసం అఫిడవిట్లు సమర్పిస్తాం
= అనంతపురం జిల్లా నుంచే అసెంబ్లీకి పోటీ చేస్తా
= ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి రఘువీరారెడ్డి
సాక్షి, బళ్లారి : కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు తాగు, సాగు నీరందించే ప్రధాన జలాశయమైన తుంగభద్ర డ్యామ్‌లో పేరుకుపోయిన పూడిక తొలగింపు, హెచ్‌ఎల్‌సీకి సమాంతర కాలువ నిర్మాణం, హెచ్‌ఎల్‌సీని వెడల్పు చేసే విషయం రెండు ప్రభుత్వాల దృష్టిలో ఉన్నాయని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి ఎన్.ర ఘువీరారెడ్డి అన్నారు. ఆయన ఆదివారం నగరంలోని అల్లం భవన్‌లో సింధూరి ఆగ్రోస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన సందర్భంగా విలేకరులతో మాట్లాడారు.
సమాంతర కాలువ ఏర్పాటు చేయాలని గత 25 సంవత్సరాలుగా చర్చ జరుగుతూనే ఉందన్నారు. ఇటీవల రెండు నెలల క్రితం బెంగళూరులో సమాంతర కాలువ, పూడికతీత తదితర అంశాలపై రెండు రాష్ట్రాలకు చెందిన పలువురు మంత్రులు ప్రత్యేకంగా చర్చించిన విషయాన్ని గుర్తు చేశారు. బెంగళూరు సమావేశం ముగిసినందున ఆంధ్రప్రదేశ్‌లోని హైదరాబాద్‌లో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని, కర్ణాటకకు చెందిన మంత్రులు ఎప్పుడు వచ్చినా తాము సమావేశం ఏర్పాటు చేస్తామన్నారు.
తుంగభద్ర పూడిక తొలగింపు, సమాంతర కాలువ నిర్మాణంపై తాము అన్ని రకాలుగా సహకరిస్తామన్నారు. బళ్లారి, అనంతపురం జిల్లాలు అత్యంత కరువు జిల్లాలని, ఈ రెండు జిల్లాలకు మరింత సాగు నీరు పెంచాలంటే తుంగభద్ర డ్యాంలో పూడిక తొలగింపు లేదా వృథాగా పోతున్న నీటిని సమాంతర కాలువ ద్వారా వినియోగించుకోవాలన్నారు. దీనికి కూడా తాము ప్లాన్ చేస్తున్నామన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడి వెళ్లరనే నమ్మకం ఉందన్నారు. ఆయన కాంగ్రెస్ పార్టీ వీడి ప్రత్యేక పార్టీ ఏర్పాటు చేస్తున్నారనే వదంతులపై విలేకరులు అడిగిన ప్రశ్నకు పైవిధంగా సమాధానం ఇచ్చారు. కిరణ్, ఆయన తండ్రి కాంగ్రెస్ పార్టీకి ఎంతో సేవలు చేశారని, అలాంటి వ్యక్తి పార్టీని వీడతారనే నమ్మకం లేదన్నారు.
వచ్చే అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆంధ్రప్రదేశ్‌లోని కాంగ్రెస్ పార్టీ నుంచి భారీగా వలసలు ఉంటాయనే విషయాన్ని మంత్రి అంగీకరించారు. సమైక్య రాష్ట్రం కోసం తాము అఫిడవిట్లు ఇస్తూ సంతకాలు చేసి పోరాటం చేస్తున్నామన్నారు. చివరి వరకు సమైక్య రాష్ట్రం కోసం పోరాటం చేస్తామన్నారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో తాను కర్ణాటక నుంచి పోటీ చేస్తానని ప్రచారం జరుగుతోందని, అయితే ఇందులో ఎలాంటి నిజం లేదన్నారు. తనకు ఇతర రాష్ట్రాల్లోకి వచ్చి పోటీ చేసి గెలిచే సత్తా లేదన్నారు. హైకమాండ్ ఆదేశిస్తే పోటీ చేస్తారా? అన్న ప్రశ్నకు ఆయన ఆంధ్రప్రదేశ్‌లోని అన ంతపురం జిల్లా నుంచి మాత్రమే అసెంబ్లీకి పోటీ చేస్తానని స్పష్టం చేశారు. అయితే అనంతపురం జిల్లాలోని ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారన్నది మాత్రం చెప్పలేదు.
‘తుంగభద్ర’పై అన్ని రకాలుగా సహకరిస్తాం
Published Mon, Dec 30 2013 2:59 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM
Advertisement
Advertisement