
సాగు ‘నిల్లే’!
♦ నీళ్లు లేక వెలవెలబోతున్న రిజర్వాయర్లు
♦ నేడు సాగునీటి సలహా మండలి సమావేశం
♦ తాగునీటిపైనే ప్రధానంగా చర్చించే అవకాశం
♦ హాజరుకానున్న హెచ్చెల్సీ పరిధిలోని ప్రజాప్రతినిధులు
అనంతపురం ఇరిగేషన్ : జిల్లాకు ప్రధాన నీటి వనరు అయిన తుంగభద్ర జలాశయంతో పాటు శ్రీశైలం డ్యాంలోకి ఆశించిన మేర నీరు చేరడం లేదు. ఎక్కడా వర్షాల్లేకపోవడంతో డ్యాంలలో నీటి లభ్యతపై సందిగ్ధత కొనసాగుతోంది. సాగునీరు కాదు కదా..కనీసం తాగునీటి అవసరాలైనా పూర్తిగా తీరతాయో, లేదోనన్న ఆందోళన అధికారుల్లో కన్పిస్తోంది. ఈ పరిస్థితుల నేపథ్యంలోనే శుక్రవారం సాగునీటి సలహామండలి (ఐఏబీ) సమావేశం నిర్వహించనున్నారు. అనంతపురం కలెక్టరేట్‌లోని రెవెన్యూ భవనంలో మధ్యాహ్నం మూడు గంటలకు సమావేశం ప్రారంభం కానుంది. తుంగభద్ర ఎగువ కాలువ (హెచ్చెల్సీ) పరిధిలోని ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు హాజరుకానున్నారు. గత ఏడాది మాదిరిగానే ఈ సమావేశం కూడా వాడీవేడిగా జరిగే అవకాశం కనిపిస్తోంది.
తమ నియోజకవర్గాల పరిధిలోని ఆయకట్టుకు,చెరువులకు నీటిని విడుదల చేయాలని ప్రజాప్రతినిధులు డిమాండ్ చేసే అవకాశముంది. తమ జిల్లాకు కేటాయించిన నీటిని ఎప్పుడూ విడుదల చేయలేదని, ఈసారైనా న్యాయం చేయాలని వైఎస్సార్ జిల్లా ప్రజాప్రతినిధులు పట్టుబట్టే సూచనలూ కనిపిస్తున్నాయి. ఎవరి డిమాండ్‌లు ఎలా ఉన్నా.. ప్రాజెక్టులలో ఆశించినంత నీటిమట్టం లేనందున ఈ ఏడాది తాగునీటికే ప్రథమ ప్రాధాన్యతిస్తూ చర్చ జరిగే అవకాశముంది.
ఆయోమయంలో అధికారులు
జిల్లాకు ప్రధాన సాగు, తాగునీటి వనరు తుంగభద్ర డ్యాం ఒక్కటే. హంద్రీ-నీవా ఉన్నప్పటికీ శ్రీశైలం డ్యాంలో నీటిమట్టం డెడ్ స్టోరేజీకి పడిపోవడంతో కాలువకు నీటి విడుదల అనుమానమే. దీంతో ఎక్కువగా హెచ్చెల్సీ నీటిపైనే దృష్టి కేంద్రీకరించవలసి వస్తోంది. తుంగభద్ర డ్యాంలో కూడా ఆశించిన స్థాయిలో నీటిమట్టం లేకపోవడంతో కేటాయించిన నీటిని విడుదల చేయడంపై సందేహం నెలకొంది. ప్రస్తుతం డ్యాంలో 64.430 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఇన్‌ఫ్లో 7,254 క్యూసెక్కులు, ఔట్‌ఫ్లో 5,159 క్యూసెక్కులు. గత ఏడాది ఇదే సమయానికి 92 టీఎంసీల నీరు నిల్వ ఉండేది. 1,42,000 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో, 1,66,000 క్యూసెక్కుల ఔట్‌ఫ్లో ఉండేది.
ఈ ఏడాది తుంగభద్ర నుంచి 22.689 టీఎంసీల నీటిని మన వాటా కింద నిర్ణయించారు. అయితే ఆ స్థాయిలో విడుదల చేయడంలేదు. జిల్లా సరిహద్దు వద్ద హెచ్చెల్సీలో వెయ్యి క్యూసెక్కుల ప్రవాహంతో మాత్రమే నీరు వస్తోంది. ఈ ప్రవాహంతో 10 టీఎంసీల నీళ్లు మాత్రమే వచ్చే అవకాశముంది. గత నెల 24న నీటిని విడుదల చేశారు. ఇప్పటివరకు 0.92 టీఎంసీలు మాత్రమే జిల్లాకు వచ్చాయి. పీఏబీఆర్‌లో గత ఏడాది ఇదే సమయానికి 2.26 టీఎంసీల నీరు ఉండేది.
ఈ ఏడాది నీటి ప్రవాహం తక్కువగా ఉండడంతో 1.46 టీఎంసీలు మాత్రమే ఉంది. తుంగభద్ర నీరు చేరే సమయానికి పీఏబీఆర్‌లో ఒక టీఎంసీ నిల్వవుండగా.. అదనంగా 0.46 టీఎంసీ మాత్రమే వచ్చి చేరింది. మిడ్‌పెన్నార్ రిజర్వాయర్‌లో గత ఏడాది ఇదే సమయానికి 0.60 టీఎంసీ నీరు ఉండగా.. ప్రస్తుతం 0.32 టీఎంసీ మాత్రమే ఉంది. దీంతో ఈసారి ప్రధానంగా తాగునీటి అవసరాలకే వినియోగించుకొనే అవకాశం కనిపిస్తోంది. నీటి ఆవిరి, సరఫరా నష్టాలు పోతే ఏస్థాయిలో నీళ్లు మనకు లభిస్తాయన్నది అధికారులను కూడా ఆందోళనకు, ఆయోమయానికి గురిచేస్తోంది.
2015-16 సంవత్సరానికి వివిధ ఉపకాలువల కింద పట్టణాలు, గ్రామాలకు ప్రతిపాదించిన తాగునీటి నికర కేటాయింపులు ఇలా ఉన్నాయి. మొత్తం 5.716 టీఎంసీల నీటిని తాగునీటి అవసరాలకు కేటాయించారు. ఇందులో రాయదుర్గం మునిసిపాలిటీ, గొడిసెలపల్లి, ఇతర గ్రామాలకు 0.406 టీఎంసీలు, గుంతకల్లు బ్రాంచికెనాల్(జీబీసీ) ద్వారా గుంతకల్లు పట్టణం, గడేకల్లు, కొనకొండ్లతో పాటు 13 ఇతర గ్రామాలకు 0.857 టీఎంసీలు, మధ్య పెన్నార్ దక్షిణ కాలువ ద్వారా శ్రీ సత్యసాయి తాగునీటి పథకం కింద బుక్కరాయసముద్రంతో పాటు 19 గ్రామాలు, బి.పప్పూరుతో పాటు 26 గ్రామాలకు 0.504 టీఎంసీలు, శ్రీరామరెడ్డి, శ్రీ సత్యసాయి నీటి పథకాల కింద హిందూపురం పట్టణం,అనంతపురం నగరంతో పాటు 700 గ్రామాలకు 1.732 టీఎంసీలు, మైలవరం కాలువ ద్వారా పొద్దుటూరు పట్టణానికి 0.200 టీఎంసీలు, పులివెందుల బ్రాంచి కెనాల్ ద్వారా చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నుంచి కదిరి, ఇతర 79 గ్రామాలకు, పుట్టపర్తి,ఇతర 92 గ్రామాలకు, పులివెందుల పట్టణానికి 2.017 టీఎంసీల నీటిని తాగునీటి కోసం కేటాయించారు.
సాగు ఎలా?
తాగునీటికే కటకటలాడాల్సిన పరిస్థితుల్లో సాగునీటిని ఎలా విడుదల చేస్తామని అధికారులు చెబుతున్నారు. ఈ ఖరీఫ్ సీజన్‌కు నీళ్లు వదలడం కష్టమేనని, కొద్ది రోజుల తరువాత డ్యాంలలో నీటిమట్టం ఎంత ఉంటుందన్న దానిపై ఓ అంచనాకు వస్తామని అంటున్నారు. దీంతో ఆయకట్టు రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.
హంద్రీనీవాపై వాడీవేడి చర్చ?
సమావేశంలో ప్రధానంగా హంద్రీ-నీవాపై వాడీవేడి చర్చ జరిగే అవకాశం కనిపిస్తోంది. హంద్రీనీవా నీటిని తన సొంత నియోజకవర్గం కుప్పంకు తరలించడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని ఇప్పటికే వైఎస్సార్‌సీపీ ఉరవకొండ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి ధ్వజమెత్తారు. ఈ అంశంతో పాటు హంద్రీనీవా పనుల్లో జాప్యం, అవినీతిపై కూడా అధికార పార్టీ ప్రజాప్రతినిధులను గట్టిగా నిలదీసే అవకాశముంది.