వరికి ఉరి | Tungabhadra dam to release water from the said HLC | Sakshi
Sakshi News home page

వరికి ఉరి

Published Sat, Aug 8 2015 2:49 AM | Last Updated on Sun, Sep 3 2017 6:59 AM

వరికి ఉరి

వరికి ఉరి

- సాగునీరివ్వలేం..  రైతులెవ్వరూ వరి సాగు చేయకూడదు
- టీబీ డ్యాం నుంచి వచ్చేది 11 టీఎంసీలు మాత్రమే
- అధిక ప్రాధాన్యతగా తాగునీటికి 8.5 టీఎంసీలు
- అక్రమ ఆయకట్టుదారులపై కఠినంగా వ్యవహరించాలి
- ఐఏబీ సమావేశంలో తీర్మానం
అనంతపురం అర్బన్/ ఇరిగేషన్ :
‘తుంగభద్ర డ్యాం నుంచి హెచ్‌ఎల్‌సీకి 22.689 టీఎంసీల నీటిని విడుదల చేస్తామని చెప్పారు. నెల రోజుల్లో పరిస్థితి మారిపోయింది. ఎగువ నుంచి నీరు రాకపోవడంతో 11 టీఎంసీలు మాత్రమే ఇస్తామని టీబీ డ్యాం అధికారులు వరికి ఉరి చెబుతున్నారు. ఇందులో అధిక ప్రాధాన్యతగా తాగునీటికి 8.5 టీంఎసీలు ఇవ్వాలి. మిగిలిన నీటిని ఏమి చేయాలనేది తరువాత నిర్ణయిద్దాం. ప్రస్తుత పరిస్థితుల్లో జిల్లాలో ఏ ఒక్క రైతూ వరి సాగు చేయకుండా చూడాలి.

అక్రమ ఆయకట్టుదారుల పట్ల కఠినంగా వ్యవహరించాల’ని నీటి పారుదల సలహా మండలి(ఐఏబీ) సమావేశంలో తీర్మానించారు. శుక్రవారం కమిటీ చైర్మన్, అనంతపురం జిల్లా కలెక్టర్ కోన శశిధర్ అధ్యక్షతన కలెక్టరేట్‌లోని రెవెన్యూ భవన్‌లో సమావేశం నిర్వహించారు. జిల్లా మంత్రులు పరిటాల సునీత, పల్లె రఘునాథ్‌రెడ్డి, శాసనమండలి డిప్యూటీ చైర్మన్ సతీష్ కుమార్‌రెడ్డి, చీఫ్ విప్ కాలవ శ్రీనివాసులు, విప్ యామినిబాల, జెడ్పీ చైర్మన్ చమన్, అనంతపురం ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి, కడప ఎంపీ వైఎస్ ఆవినాశ్‌రెడ్డి, ఎమ్మెల్యేలు విశ్వేశ్వరరెడ్డి, అత్తార్ చాంద్‌బాషా, జేసీ ప్రభాకర్‌రెడ్డి, వరదాపురం సూరి, హనుమంతరాయచౌదరి, ప్రభాకర్ చౌదరి, ఈరన్న, జితేంద్రగౌడ్, జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి, ఆలూరు ఎమ్మెల్యే జయరామప్ప, ఎమ్మెల్సీలు నారాయణరెడ్డి, పయ్యావుల కే శవ్, శమంతకమణి హాజరయ్యారు.

నీటి విడుదలకు సంబంధించి వాస్తవ పరిస్థితిని సభ్యులకు కలెక్టర్ వివరించారు. వర్షాలు ఆశించిన స్థాయిలో లేకపోవడంతో సమస్య తీవ్రంగా మారిందన్నారు. గత ఏడాది ఇదే సమయంలో టీబీ డ్యాంలో ఇన్‌ఫ్లో 1.22 లక్షల క్యూసెక్కులు ఉండగా,  ఇప్పుడు ఏడు వేల క్యూసెక్కులు మాత్రమే ఉందన్నారు. గత ఏడాది ఈ సమయానికి డ్యాంలోకి 113 టీఎంసీల నీరొస్తే, ఇప్పుడు 12 టీఎంసీలు మాత్రమే వచ్చిందన్నారు. అటు శ్రీశైలం డ్యాంలోనూ నీటిమట్టం డెడ్ స్టోరేజీకి పడిపోయిందన్నారు. హెచ్చెల్సీ ద్వారా అనంతపురం జిల్లాలో 1.47 లక్షల ఎకరాలు, కర్నూలు, వైఎస్సార్  జిల్లాలు కలిపి 69 వేల ఎకరాలకు నీరందించాల్సి ఉందన్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆయకట్టుకు నీరివ్వడం సాధ్యం కాదన్నారు. హామీ కూడా ఇవ్వలేని పరిస్థితి ఉందన్నారు.

ఈ నేపథ్యంలో సలహా మండలి సమావేశం వద్దనుకున్నామని, అయితే వాస్తవాలను సభ్యుల దృష్టికి తీసుకురావాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేశామని వివరించారు. దీంతో సభ్యులు తొలి ప్రాధాన్యత తాగునీటికి ఇవ్వాలని ఏకగ్రీవంగా తీర్మానించారు. భవిష్యత్‌లో డ్యాంలలో నీటిమట్టం పెరిగితే సాగునీటి అవసరాల కోసం చర్చించడానికి ఆగస్టు చివరి వారంలో మరోసారి సమావేశం నిర్వహించాలని తీర్మానించారు. మైలవరం, చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లను మొదటి నుంచి నిర్లక్ష్యం చేస్తున్నారని వైఎస్సార్ జిల్లా ప్రజాప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేశారు.

వృథా అరికట్టాలి : సతీష్‌రెడ్డి, ఎమ్మెల్సీ,  శాసనమండలి డిప్యూటీ స్పీకర్ చిత్రావ తి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌కు కేటాయించిన నీళ్లు ఎప్పుడూ చేరలేదు. చాలా వరకు వృథా అవుతున్నాయి. దీనిని అరికట్టకపోతే తాగునీటికి కూడా చాలా ఇబ్బంది పడాల్సివస్తుంది. కేటాయించిన నీరు సీబీఆర్‌కు చేరాలంటే ఎక్కువ నీటిని విడుదల చేస్తేనే సాధ్యం.
 
మూడేళ్లుగా మైలవరానికి నీళ్లు లేవు : ఆదినారాయణరెడ్డి, జమ్మలమడుగు ఎమ్మెల్యే
మూడేళ్లుగా మైలవరం ప్రాజెక్టుకు నీటి కేటాయింపులు జరుగుతున్నా, ఏ ఏడాదీ ఒక చుక్క రావడం లేదు. మా ప్రాంతంలో 1500 నుంచి 2000 అడుగుల లోతుకు బోర్లు వేసినా నీళ్లు పడటం లేదు. పరిస్థితి భయానకంగా ఉంది. ఈ ఏడాది  కేటాయించిన నీటిని విడుదల చేస్తేకానీ మా ప్రాంత ప్రజల పరిస్థితి మెరుగుపడదు.
 
మా గురించి ఆలోచించే తీరిక లేదా? : వైఎస్ అవినాష్‌రెడ్డి, కడప ఎంపీ
గత ఐఏబీ సమావేశంలో కూడా మా ప్రాంతానికి నీళ్లు రావడం లేదని వివరించా. అయినప్పటికీ గత ఏడాది మాకు తీవ్ర అన్యాయం జరిగింది. సీబీఆర్‌కు రెండు టీఎంసీలు కేటాయించినా, రిజర్వాయర్‌లోకి ఒక్క టీఎంసీ నీరు కూడా రావడం లేదు. తుంపెర వద్ద నీటి ప్రవాహం సూచించే గేజ్ ఏటవాలుగా ఉంది. దానితో రిజర్వాయర్‌లోకి ఎక్కువ నీరు వచ్చినట్లు అధికారులు ఊహించుకుంటున్నారు. తక్షణమే హెచ్చెల్సీ ఆధునికీకరణ పూర్తి చేసి సీబీఆర్‌కు నాలుగు టీఎంసీలివ్వాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement