
సాక్షి, అమరావతి: కృష్ణా ప్రధాన ఉపనది అయిన తుంగభద్ర గతంలో ఎన్నడూ లేనిరీతిలో ఈ ఏడాది వరద ప్రవాహంతో పరవళ్లు తొక్కుతోంది. తుంగభద్ర వరద ఉద్ధృతికి ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణల ఉమ్మడి ప్రాజెక్టు అయిన తుంగభద్ర డ్యామ్ జూలై 13 నాటికే నిండిపోవడంతో గేట్లు ఎత్తేసి వరదను దిగువకు విడుదల చేస్తున్నారు. అప్పటి నుంచి శుక్రవారం వరకు అంటే 66 రోజులుగా గేట్లను దించలేదు. జూన్ 1 నుంచి శుక్రవారం ఉదయం 6 గంటల వరకు డ్యామ్‌లోకి 487.76 టీఎంసీల ప్రవాహం వచ్చింది.
ఇందులో 1,632.74 అడుగుల్లో 104.74 టీఎంసీలను నిల్వచేస్తూ (గత నీటిసంవత్సరం ముగిసేనాటికి అంటే మే 31 నాటికి డ్యామ్‌లో 37.63 టీఎంసీల నీరు ఉంది).. ఆయకట్టుకు నీళ్లందిస్తూ, దిగువకు 390 టీఎంసీల మేర విడుదల చేశారు. తుంగభద్ర డ్యామ్‌లోకి సహజసిద్ధ ప్రవాహం డిసెంబర్ వరకు కొనసాగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో డ్యామ్‌లో ఈ ఏడాది బచావత్ ట్రిబ్యునల్ అంచనా వేసిన మేరకు 230 టీఎంసీల లభ్యత ఉంటుందని, మూడు రాష్ట్రాలకు వాటా మేరకు నీటిని సరఫరా చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయని తుంగభద్ర బోర్డు అధికారులు అంచనా వేస్తున్నారు.
నీటి లభ్యతపై ఆనందోత్సాహాలు
తుంగభద్ర డ్యామ్‌లో 230 టీఎంసీల లభ్యత ఉంటుందని అంచనా వేసిన బచావత్ ట్రిబ్యునల్ ఆంధ్రప్రదేశ్‌కు72 (హెచ్చెల్సీ 32.5, ఎల్లెల్సీ 29.5, కేసీ కెనాల్‌కు అసిస్టెన్స్), తెలంగాణకు 6.51 (ఆర్డీఎస్‌కు అసిస్టెన్స్), కర్ణాటకకు 151.49 టీఎంసీలను పంపిణీ చేసింది. 1980లో మాత్రమే బచావత్ ట్రిబ్యునల్ కేటాయించిన దానికంటే 1.383 టీఎంసీలు అధికంగా అంటే 231.383 టీఎంసీలను తుంగభద్ర డ్యామ్ ద్వారా మూడు రాష్ట్రాలు వినియోగించుకున్నాయి.
డ్యామ్‌లో పూడిక పేరుకుపోతుండటంవల్ల నిల్వ సామర్థ్యం తగ్గడంతో.. నీటిలభ్యత ఆధారంగా దామాషా పద్ధతిలో మూడు రాష్ట్రాలకు తుంగభద్ర బోర్డు వాటా జలాలను పంపిణీ చేస్తోంది. ఈ ఏడాది 1980 తరహాలోనే నీటిలభ్యత ఉంటుందని తుంగభద్ర బోర్డు వర్గాలు అంచనా వేస్తున్నాయి. దీనిపై మూడు రాష్ట్రాల ఆయకట్టు రైతులు ఆనందోత్సాహాలను వ్యక్తం చేస్తున్నారు. తుంగభద్ర డ్యామ్‌పై నేరుగా ఆధారపడి ఆంధ్రప్రదేశ్‌లో ఎల్లెల్సీ (దిగువ కాలువ) 1,57,062, హెచ్చెల్సీ (ఎగువ కాలువ) 2,84,992.. కర్ణాటకలో 8,96,456.. కలిపి 13,38,510 ఎకరాల ఆయకట్టు ఉంది. డ్యామ్ దిగువన రాయబసవన చానల్స్, విజయనగర చానల్స్ కింద కర్ణాటకలో 30,368, ఆంధ్రప్రదేశ్‌లో కేసీ కెనాల్ కింద 2,78,000, తెలంగాణలో ఆర్డీఎస్ కింద 87,000.. కలిపి 3,95,368 ఎకరాల ఆయకట్టు ఉంది. అంటే.. డ్యామ్‌పై ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆధారపడిన 17,33,878 ఎకరాల ఆయకట్టు ఈ ఏడాది సస్యశ్యామలం కానుంది.
నాలుగో అతిపెద్ద వరద
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటకల ఉమ్మడి ప్రాజెక్టు తుంగభద్ర 1958లో పూర్తయింది. డ్యామ్ చరిత్రలో 1978లో 558.775 టీఎంసీల ప్రవాహమే అతి పెద్ద వరద. ఆ తర్వాత 1980లో వచ్చిన 553.1 టీఎంసీల ప్రవాహం రెండో అతిపెద్ద వరదగా నమోదైంది. 1992లో డ్యామ్‌లోకి వచ్చిన 519.60 టీఎంసీల ప్రవాహం మూడో అతిపెద్ద వరద. మూడు దశాబ్దాల తర్వాత ఈ ఏడాది తుంగభద్ర డ్యామ్‌లోకి శుక్రవారం వరకు వచ్చిన 487.76 టీఎంసీల ప్రవాహం నాలుగో అతిపెద్ద వరద. డిసెంబర్ వరకు డ్యామ్‌లోకి వరద ప్రవాహం కొనసాగే అవకాశం ఉన్న నేపథ్యంలో.. 1992 కంటే ఎక్కువ ప్రవాహం వస్తుందని అంచనా వేస్తున్నారు.