ఈసారి తక్కువే! | Less time! | Sakshi
Sakshi News home page

ఈసారి తక్కువే!

Published Wed, Jun 18 2014 3:41 AM | Last Updated on Sat, Sep 2 2017 8:57 AM

ఈసారి తక్కువే!

ఈసారి తక్కువే!

ఈ ఏడాది ఖరీఫ్ సీజన్‌లో తుంగభద్ర డ్యాంలోకి 144 టీఎంసీల నీరు వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు.

ఈ ఏడాది తుంగభద్రలోకి 144 టీఎంసీలు చేరే అవకాశం
కర్ణాటకకు 94.5 టీఎంసీలు = ఆంధ్రప్రదేశ్‌కు 49.5 టీఎంసీలు
గత ఏడాది కంటే డ్యాంలోకి నీరు తక్కువ వస్తుందని అంచనా

 

ఈ ఏడాది ఖరీఫ్ సీజన్‌లో తుంగభద్ర డ్యాంలోకి  144 టీఎంసీల నీరు వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు. ప్రతి ఏటా మాదిరిగానే ఖరీఫ్ సీజన్‌కు ముందు తుంగభద్ర డ్యాంలోకి నీరు ఎంత చేరుతుందనే విషయంపై అధికారులు ముందస్తు సమావేశం నిర్వహించడం అనవాయితీగా వస్తోంది. ఇందులో భాగంగా సోమవారం రాత్రి తుంగభద్ర డ్యాం ప్రధాన కార్యాలయంలో టీబీ డ్యాం ఎస్‌ఈ శ్రీనివాసరావు అధ్యక్షతన వాటర్ రివ్యూ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఈ ఖరీఫ్ సీజన్‌లో తుంగభద్ర డ్యాంలోకి ఎన్ని టీఎంసీల నీరు వస్తుంది.. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు ఏమేరకు నీరు కేటాయించవచ్చు అనే విషయంపై ఓ నిర్ణయానికి వచ్చారు. తుంగభద్ర బోర్డు ఎస్‌ఈ శ్రీనివాసరావు, అనంతపురం ఎస్‌ఈ మురళీనాథ్‌రెడ్డి, కర్నూలు ఎస్‌ఈ నాగేశ్వరరావు, మునిరాబాద్ ఎస్‌ఈ భోజ్యానాయక్, ఈఈలు ఇంగళిగి, నారాయణ నాయక్, ఎస్‌డీఓ రమేష్ తదితరులు పాల్గొన్న ఈ సమావేశంలో తుంగభద్ర డ్యాంలోకి ఎంత నీరు  వస్తుందనే దానిపై ఒక అవగాహ నకు వచ్చారు. డ్యాం ప్రారంభించినప్పటి నుంచి అంటే 60 సంవత్సరాలుగా ఖరీఫ్ సీజన్‌కు ముందుగా ఎస్‌ఈ నేతృత్వంలో సమీక్ష సమావేశం నిర్వహించి డ్యాంలోకి నీరు ఎంత చేరుతుందనే దానిపై అంచనాకు రావడం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ ఏడాది కాస్త వర్షాలు తక్కువగా కురిసే అవకాశం ఉందని, డ్యాంలోకి కూడా గత ఏడాది కంటే నీరు తక్కువ వచ్చే అవకాశం ఉందని అధికారులు సమీక్షించినట్లు తెలుస్తోంది. గత ఏడాది 150 టీఎంసీల నీరు వస్తుందని ముందుగా అంచనాలు వేశారు. చివరకు 135 టీఎంసీలు నీరు చేరినట్లు నిర్ధారించి ఆ మేరకు ఇరు రాష్ట్రాలకు నీటి కేటాయింపులు చేయడంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైతులకు నీరు తక్కువ చేరిందనే విమర్శలు వచ్చాయి.

ఈ ఏడాది కూడా 144 టీఎంసీల నీరు వస్తుందని అంచనాలు వేసినప్పటికీ, డ్యాంలోకి వచ్చే నీటిని బట్టి మళ్లీ నీటిని కేటాయిస్తారు. ప్రస్తుతం ఈ ఏడాది అధికారులు సమీక్షా సమావేశంలో తీర్మానించిన మేరకు 144 టీఎంసీలలో కర్ణాటక రాష్ట్రంలోని బళ్లారి, రాయచూరు, కొప్పళ జిల్లాలకు ఖరీఫ్, రబీ సీజన్‌లకు గాను 94.5 టీఎంసీలు, ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం, కర్నూలు, వైఎస్‌ఆర్ జిల్లాలకు 49.5 టీఎంసీల నీటిని అందించేందుకు అవకాశం ఉన్నట్లు తీర్మానించారు. ఆయా రాష్ట్రాలకు అందించిన నీటి కేటాయింపుల ప్రకారం జిల్లాల వారీగా మళ్లీ కేటాయిస్తారు. ఇదిలా ఉండగా ప్రస్తుతం ఈ ఏడాది డ్యాంలోకి గత ఏడాది కంటే నీరు తక్కువగా వచ్చే అవకాశం ఉన్నందున ఖరీఫ్ సీజన్‌లో పంటలను త్వరగా వేసుకోవాలని రైతాంగానికి తుంగభద్ర బోర్డు ఎస్‌ఈ శ్రీనివాసరావు సూచించారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన అధికారులు జూలై మొదటి వారం నుంచి నీరు విడుదల చేయాలని ఇండెంట్ ఇచ్చారని, అయితే కర్ణాటక అధికారులు జూలై ఆఖరు కల్లా కాలువలకు నీరు విడుదల చేయాలని కోరారని చర్చించారు. రెండు రాష్ట్రాలకు చెందిన రైతాంగానికి ఒకే కాలువ గుండా నీరు విడుదల చేస్తే పంటలకు నీరు సక్రమంగా అందుతుందని, ఈ ఏడాది నీరు తక్కువగా వచ్చే సూచనలు ఉన్నందున త్వరగా పంటలు వేసుకుంటే నీటిని ఆదా చేసుకుని ఖరీఫ్, రబీలకు నీరు అందించేందుకు ఇబ్బందులు ఉండవని, ఆమేరకు రైతులకు దిశానిర్దేశం చేయాలని ఎస్‌ఈ సూచించారు. మొత్తం మీద డ్యాంలోకి గత ఏడాది కంటే నీరు తక్కువగా వస్తుందని అంచనా వేశారు. ఈ నేపథ్యంలో ఖరీఫ్‌కు త్వరగా ఏర్పాట్లు చేసుకోవాలని బోర్డు ఉన్నతాధికారులు రైతులకు సూచించారు.
 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement