కోటా.. కోత! | kota cut | Sakshi
Sakshi News home page

కోటా.. కోత!

Published Thu, Apr 20 2017 12:08 AM | Last Updated on Tue, Sep 5 2017 9:11 AM

కోటా.. కోత!

కోటా.. కోత!

టీబీ డ్యాంలో 2.054 టీఎంసీల నిల్వ
– ఎల్‌ఎల్‌సీ వాటాగా 1.146 టీఎంసీలు
– తాగునీటికి 650 క్యుసెక్కులకు ఇండెంట్‌ పెట్టిన ఇంజినీర్లు
– 300 క్యుసెక్కులకు తగ్గిన నీటి ప్రవాహం
– దాహంతో అల్లాడుతున్న పశ్చిమ ప్రాంత ప్రజలు
– నోరు మెదపని అధికార పార్టీ నేతలు
 
కర్నూలు సిటీ: కరువు కోరలు చాస్తోంది. భూగర్భ జలాల నీటి మట్టం రోజు రోజుకు తగ్గుతోంది. పశ్చిమ ప్రాంత ప్రజల గొంతెండుతోంది. పరిస్థితి ఇంత దారుణంగా ఉన్నా అధికార పార్టీ నేతలు నోరు మెదపకపోవడం విమర్శలకు తావిస్తోంది. తుంగభద్ర డ్యాం నుంచి జిల్లాకు ఎల్‌ఎల్‌సీ వాటా నుంచి రావాల్సిన నీటిని రాబట్టడంలో నేతలు పూర్తిగా విఫలమయ్యారు. దీంతో 650 క్యుసెక్కుల నీరు ఏపీ సరిహద్దు వద్ద రావాల్సి ఉండగా.. 300 క్యుసెక్కులు కూడా రాని దుస్థి«తి నెలకొంది. ఈ విషయంపై జిల్లాలోని టీడీపీ నేతలకు జల వనరుల శాఖ ఇంజినీర్లు సమాచారం ఇచ్చినా ఏ మాత్రం పట్టించుకోని పరిస్థితి ఉంది.
 
ఫలితంగా టీబీ డ్యాం అధికారులు నీటి విడుదలను పూర్తి స్థాయిలో తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగానే డ్యాంలో నిల్వ తక్కువగా ఉందనే కారణంతో బోర్డు అధికారులు నీటి ప్రవాహాన్ని రెండు రోజుల నుంచి రోజురోజుకూ తగ్గిస్తున్నారు. అయినా నేతలు నోరు మెదపకపోవడంతో బోర్డు అధికారులు ఏకంగా నీటి విడుదలను నిలిపేసేందుకు తెగబడినట్లు తెలుస్తోంది. నీటి ప్రవాహం తగ్గడంపై కర్నూలు పార్లమెంట్‌ సభ్యురాలు బుట్టా రేణుక బోర్డు అధికారులకు ఫోన్‌ చేసి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో పెంచినట్టే పెంచి తగ్గించారు. ఈ కారణంగా జిల్లాలోని పశ్చిమ ప్రాంత ప్రజలు తీవ్ర నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నారు.
 
దాహం తీర్చేదెట్టా...!
జిల్లాకు తుంగభద్ర జలాలే ప్రధానం. కర్ణాటక, ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు టీబీ డ్యాం ఉమ్మడి జలాశయం. ఈ డ్యాంలో ప్రతి ఏటా వాటా నీటికి గండి పడుతున్నా నేతలు పట్టించుకోవడం లేదు. ప్రతి వేసవిలో పశ్చిమ పల్లె దాహం తీర్చేందుకు కనీసం 3 టీఎంసీల నీరు నిల్వ చేసే వారు. అయితే ఈ ఏడాది అశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడంతో వాటా నీరు తగ్గింది. కానీ బోర్డు అధికారులు ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయాల వల్ల కొంత నీరు పక్క జిల్లాకు తరలిపోయింది. దీంతో డ్యాం డెడ్‌ స్టోరేజీకి చేరింది. ప్రస్తుతం 2.054 టీఎంసీల నీరు నిల్వ ఉంది. వాటా ప్రకారం జిల్లాకు 1.146 టీఎంసీల నీరు రావాల్సి ఉంది.
 
ఇందులో నుంచి తాగునీటి కోసం 650 క్యుసెక్కుల నీరు ఇవ్వాలని ఇంజినీర్లు ఇండెంట్‌ పెట్టారు. మొదట్లో ఆ ప్రకారం నీటిని విడుదల చేశారు. ఆ తర్వాత డ్యాంలో నీరు లేదనే సాకుతో నీటి ప్రవాహాన్ని తగ్గించారు. ఈ నీటిపైనే జిల్లాలోని 9 మండలాల్లో 17 సమగ్ర రక్షిత తాగు నీటి పథకాలు, 164 గ్రామాలకు చెందిన 4,19,836 మంది జనాభా దాహం ఆధారపడి ఉంది. వస్తున్న నీటిలో 0.2 టీఎంసీల నీరు కూడా జిల్లాకు చేరని పరిస్థితి. ఈ నేపథ్యంలో మరో రెండు నెలలు ప్రజల దాహాం ఏలా తీరుస్తారో నాయకులు, అధికారులకే తెలియాలి.
 
కోర్టు అక్షింతలు వేసినా మారని తీరు
మూడు రాష్ట్రాల ఉమ్మడి ప్రాజెక్టు తుంగభద్ర జలాశయం నీటి విడుదలలో బోర్డు అధికారులు ఎగువ రాష్ట్రామైన కర్ణాటక ఒత్తిళ్లకు తలొగ్గి దిగువ రాష్ట్రాల హక్కులకు భంగం కల్గించారు. దీంతో కొంత మంది ఎల్‌ఎల్‌సీ రైతులు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై కోర్టు స్పందించి బోర్డు అధికారులపై తీవ్రంగా అగ్రహించింది. చివరికి బోర్డు అధికారులు ఇకపై తప్పులు జరుగకుండా చూస్తామని కోర్టుకు ఆఫిడవిట్‌ సమర్పించారు. కొద్ది రోజులకే గుట్టు చప్పుడు కాకుండా టీబీ డ్యాంలో 0.9 టీఎంసీల నీటిని పక్క జిల్లాకు మళ్లించినట్లు రికార్డులను బట్టి తెలుస్తోంది. దీంతో పాటు ఎల్‌ఎల్‌సీ వాటా నుంచి సైతం కొద్దిమేర నీటిని మళ్లించారు. ఈ విషయం జిల్లాలోని అధికార పార్టీ నేతలకు తెలిసినా నోరు మెదపకపోవడం గమనార్హం.
 
ముందుగానే మేల్కొని ఉంటే కనీసం 1.3 టీఎంసీల తుంగభద్ర జలాలు జిల్లాకు వచ్చేవనే చర్చ జరుగుతోంది. దీనికి తోడు ఎల్‌ఎల్‌సీ ఇంజినీర్లు పర్యవేక్షణ లేకుండా నీటిని కాల్వకు వదులుతుండడంతో నీరు వృథా అవుతోంది. గ్రామీణ నీటి సరఫరా, పారిశుద్ధ్య విభాగం, జల వనరుల శాఖ అధికారుల మధ్య సమన్వయం కొరవడింది. ఈ కారణంతోనే వచ్చిన నీరు సైతం సద్వినియోగం చేసుకోలేని పరిస్థితి నెలకొంది. టీబీ డ్యాంలో నీటి నిల్వ తగ్గడంతో ఈ డ్యాంకు ఎగువన ఉన్న భద్ర ప్రాజెక్టు నుంచి 2 టీఎంసీల నీటిని విడుదల చేయాలని అక్కడి ప్రభుత్వం ఆదేశించింది. అయితే ఈ నీటితో ఏపీకి ఎలాంటి సంబంధం లేదన్నట్లు బోర్డు అధికారులు చెబుతుండటం గమనార్హం.
 
నీటి ప్రవాహం తగ్గింది.
తుంగభద్ర జలాశయం నుంచి దిగువ కాలువకు వస్తున్న నీటి ప్రవాహం తగ్గిన మాట వాస్తవమే. ఈ విషయం కలెక్టర్‌ దృష్టికి కూడా తీసుకుపోయాం. ఇప్పటి వరకు 0.23 టీఎంసీల నీరు వచ్చి ఉండొచ్చు. డ్యాంలో నీటి నిల్వ తగ్గడంతోనే నీటి విడుదలను తగ్గించినట్లు బోర్డు అధికారులు చెబుతున్నారు.
– చంద్రశేఖర్‌ రావు, పర్యవేక్షక ఇంజినీర్, జల వనరుల శాఖ
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement