పంటను దున్నేస్తున్న రైతన్న
కష్టాలు వినండి.. కన్నీళ్లు తుడవండి!
Published Mon, Jan 23 2017 11:40 PM | Last Updated on Mon, Oct 1 2018 2:44 PM
కరువు.. దరువు
– ఏడాదిలో 39 మంది రైతుల ఆత్మహత్య
– 630 గ్రామాల్లో పశుగ్రాసం కొరత
– దాహార్తితో అల్లాడుతున్న 750 గ్రామాలు
– కరువు మండలాల గుర్తింపులోనూ వివక్షే..
– నేడు జిల్లాలో కేంద్ర కరువు బృందం పర్యటన
కర్నూలు(అగ్రికల్చర్): జిల్లాలో కరువు కరాళ నృత్యం చేస్తోంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా కరువు పరిస్థితులు ఏర్పడటంతో ఒక్క రైతులే కాదు.. అన్ని వర్గాల ప్రజలు పడుతున్న ఇక్కట్లు వర్ణనాతీతం. ఎటుచూసినా ఎండిన చెరువులు, తాగునీటి కోసం అల్లాడుతున్న ప్రజలు, పశుగ్రాసం లేక బక్క చిక్కిన పశువులే. భూగర్భ జలాలు వేగంగా పడిపోతుండటంతో రోజురోజుకు నీటి సమస్య పెరిగిపోతోంది. గత ఏడాది ఖరీఫ్‌లో కీలకమయిన ఆగస్టు, అక్టోబర్ నెలల్లో వర్షాలు పడకపోవడం వల్ల అన్ని పంటలు దెబ్బతిన్నాయి.
అనావృష్టి ప్రభావం రబీపైనా ఎక్కువగా ఉండటంతో రైతులు కోలుకోలేని విధంగా దెబ్బతిన్నారు. పెట్టుబడుల్లో 50శాతం కూడా దక్కలేదంటే ఎంత దయనీయమైన పరిస్థితుల్లో ఉన్నాయో తెలుస్తోంది. పంటలు పంటడకపోవడం, కరువు పరిస్థితులు తీవ్రతరమై అప్పుల బాధలు పెరగడంతో ఏడాది కాలంలో 39 మంది రైతులు అత్మహత్యలకు పాల్పడ్డారు. జిల్లాలో నెలకొన్న కరువు పరిస్థితిని ప్రత్యక్షంగా పరిశీలించి రైతులతో ముఖాముఖి చర్చించేందుకు ముగ్గురు సభ్యులతో కూడిన కేంద్ర కరువు బృందం నేడు జిల్లాలో పర్యటిస్తున్న నేపథ్యంలో ‘సాక్షి’ అందిస్తున్న ప్రత్యక కథనం ఇది.
కరువును పైపైనే పరిశీలించే అవకాశం
ఖరీఫ్ సీజన్ అక్టోబర్‌తోనే ముగిసింది. రబీ సీజన్ కూడా పూర్తయింది. ఈ నేపథ్యంలో జిల్లాలో నెలకొన్న కరువును పరిశీలించేందుకు కేంద్ర బృందం జిల్లాకు వస్తోంది. గతంలో మాదిరి వ్యవసాయ సీజన్ ముగిసిన తర్వాతనే కేంద్ర బృందం వస్తుండటం గమానార్హం. జిల్లాకు వచ్చే కరువు బృందం కూడా రోడ్డు పక్కనున్న గ్రామాలకు మాత్రమే వెళ్తుండటం తీవ్ర అసంతృప్తిని కలిగించే అంశం. గ్రామాల్లోకి వెళ్లి రైతుల దుస్థితిని మరింత లోతుగా పరిశీలించాల్సిన అవసరం ఉన్నా కేంద్ర బృందం పర్యటన క్షేత్రస్థాయిలో కేవలం నాలుగు గంటలకే పరిమితం అవుతోంది.
ఖరీఫ్‌లో 2.68 లక్షల హెక్టార్లలో పంటలు నష్టం
ఖరీఫ్ సాధారణ సాగు 6,21,155 హెక్టార్లు ఉండగా.. 6,56,214 హెక్టార్లలో సాగు చేశారు. సాగు విస్తీర్ణం పెరిగినా కీలకమైన ఆగస్టు, అక్టోబర్ నెలల్లో వర్షాల జాడ లేకపోవడం వల్ల పంటలన్నీ దెబ్బతిన్నాయి. ఖరీఫ్‌లో సాగు చేసిన వేరుశనగ, కంది, మొక్కజొన్న, ఆముదం, కొర్ర తదితర పంటలు దెబ్బతినడంతో దిగుబడులు 75శాతం వరకు పడిపోయాయి. ప్రభుత్వం రెయిన్‌గన్లంటూ హడావుడి చేసినా ఫలితం లేకపోయింది. జిల్లాలో 38 మండలాలు కరువు బారిన పడినట్లు జిల్లా యంత్రాంగం తేల్చింది. అయితే ప్రభుత్వం 36 మండలాలను కరువు ప్రాంతాలుగా గుర్తించింది. ఖరీఫ్‌లో 2,68,654.1 హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నాయి. అనధికారికంగా ఈ నష్టం భారీ స్థాయిలోనే ఉంది. 3,21,847 లక్షల మంది రైతులు పంటలను కోల్పోయారు. రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ కింద జిల్లాకు రూ.347కోట్లు అవసరమని జిల్లా యంత్రాంగం ప్రభుత్వానికి నివేదిక పంపింది. అయితే పెట్టుబడి రాయితీ ఎప్పటికి విడుదల అవుతుందో తెలియని పరిస్థితి ఏర్పడింది.
రబీ పరిస్థితి దారుణం
రబీ సాధారణ సాగు 3,54,341 హెక్టార్లు కాగా.. కేవలం 2,59,374 హెక్టార్లలో మాత్రమే పంటలు సాగయ్యాయి. రబీ సీజన్ అక్టోబర్ నుంచి మొదలవుతుంది. అప్పటి నుంచి చినుకు జాడ లేకపోవడం తీవ్ర నిరాశే మిగిలింది. రబీలో 94,967 హెక్టార్లలో పొలాలు బీళ్లుగా ఉన్నాయి. రబీలో ప్రధానంగా శనగ సాగయింది. ప్రకృతి వైపరీత్యాల వల్ల శనగ పంట పూర్తిగా దెబ్బతినంది. శనగతో పాటు జొన్న, వేరుశనగ, ధనియాలు తదితర పంటలను రైతులు కోల్పోయారు. రబీలో దెబ్బతిన్న పంటలకు ప్రభుత్వం ఇన్‌పుట్ సబ్సిడీ ఇవ్వక పోవడం పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం అవుతోంది.
పెట్టుబడి నష్టం రూ.2వేల కోట్లు పైనే..
ఖరీఫ్, రబీలో దాదాపు 5లక్షల హెక్టార్లలో పంటలు 50శాతం పైగా దెబ్బతిన్నాయి. రైతులు హెక్టారుకు సగటున పెట్టుబడులు రూ.40 వేల వరకు పెట్టారు. అంటే ఈ లెక్కన పెట్టబడి రూ.2వేల కోట్లు. ఇందులో 50శాతం కూడా లభించలేదంటే పంట నష్టం ఏ స్థాయిలో ఉందో ఊహించుకోవచ్చు. జిల్లాలో రైతులు దాదాపు 6.75 లక్షల మంది ఉన్నారు. వరుసగా కరువు వస్తుండటంతో 90 శాతం రైతులు అప్పుల్లో కూరుకుపోయారు.
ఆ మండలాల్లో కరువు లేదట..
జిల్లాలో 36 మండలాలను ప్రభుత్వం కరువు ప్రాంతాలుగా గుర్తించింది. అయితే 10 మండలాల్లో కరువు లేదని, పంటలు దెబ్బతినలేదని సంబంధిత మండల అధికారులు తేల్చడం పట్ల రైతులు ఇన్‌పుట్ సబ్సిడీకి దూరమయ్యారు. సంజామల, కోవెలకుంట్ల, కొలిమిగుండ్ల, అవుకు, ఆళ్లగడ్డ, చాగలమర్రి, గోస్పాడు, శిరువెల్ల, కొత్తపల్లి, బండిఆత్మకూరు మండలాలు కరువు మండలాలు అయినప్పటికీ అధికారులు ఆ ఊసే లేదని తేల్చడం పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. నీటిపారుదల మండలాలు అయినప్పటికీ సాగునీరు అందక పంటలు దెబ్బతిన్నాయి. ఈ మండలాల్లోనూ 50శాతం పంటలు దెబ్బతిన్నా కరువు లేదని తేల్చడం గమనార్హం.
తీవ్రమైన పశుగ్రాసం కొరత
జిల్లాలో పశుగ్రాసం కొరత తీవ్రంగా ఉంది. పశుసంవర్ధక శాఖ అధికారుల లెక్కల ప్రకారమే 630 గ్రామాల్లో పశుగ్రాసం కొరత ఉందంటే సమస్య ఏ స్థాయిలో ఉందో తెలుస్తోంది. వర్షాలు కురిసి ఖరీఫ్ సీజన్ మొదలయ్యే వరకు జిల్లాలో 36,721 టన్నుల పశుగ్రాసం కొరత ఏర్పడుతోంది. మేత సమస్యను అధిగమించాంలంటే పశుసంవర్ధక శాఖకు రూ.15.38 కోట్లు అవసరం అవుతాయి. ప్రభుత్వం కరుణించి ని«ధులు ఇస్తేనే పశువులకు మేత సమస్య తీరుతుంది. పశుగ్రాసం కొరతను ఎదుర్కోవాలంటే 7500 టన్నుల సైలేజి గడ్డి, 10వేల టన్నుల దాణా, 250 టన్నుల పశుగ్రాసం విత్తనాలు, 1000 టన్నుల దాణామృతం, 1000 అజొల్లా యూనిట్లు అవసరం. ఇవన్నీ కార్యరూపం దాల్చాలంటే నిధులు అవసరం.
గొంతెండుతున్న గ్రామాలు
తాగునీటిపై కరువు తీవ్ర ప్రభావం చూపుతోంది. వర్షాభావం వల్ల చెరువుల్లో చుక్క నీరు లేకపోవడం, తద్వారా భూగర్బ జలాలు వేగంగా పడిపోతుండటంతో నీటి సమస్యతో గ్రామాలు అల్లాడుతున్నాయి. ఇప్పటికే వందలాది గ్రామాల్లో 5రోజులకు ఒకసారి మాత్రమే నీరు సరఫరా చేస్తున్నారంటే సమస్య ఏ స్థాయిలో ఉందో స్పష్టం అవుతోంది. వేసవిలో సమస్య మరింత తీవ్రం అయ్యే ప్రమాదం ఏర్పడింది. అధికారుల లెక్కల ప్రకారం దాదాపు 750 గ్రామాల్లో నీటి సమస్య తీవ్రంగా ఉంది. 100 గ్రామాలకు ట్యాంకర్ల ద్వారా సరఫరా చేయాల్సి ఉందంటే సమస్య ఏ స్థాయిలో ఉందో ఊహించుకోవచ్చు. 3వేల బోర్లు చెడిపోయి పనికిరాకుండా పోయాయి. నీటి సమస్య నుంచి గట్టెక్కాలంటే ఆర్‌డబ్ల్యూఎస్‌కు కనీసం రూ.10.62 కోట్ల నిధులు అవసరం అవుతాయని అంచనా.
ఉపాధి కరువు
జిల్లాలో కనీవీనీ ఎరుగని రీతిలో కరువు ఏర్పడినా వ్యవసాయ కూలీలు, రైతులకు ఉపా«ధి కల్పించడంలో ప్రభుత్వం విఫలమయింది. పంటలు లేకపోవడంతో గ్రామాల్లో కూలీలకు పనులు కరువయ్యాయి. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఉన్నా పని కల్పించడంలో అలసత్వం నెలకొంది. జిల్లాలో ఇప్పటికే దాదాపు 2లక్షల కుటుంబాలు వలస బాట పట్టాయి. కరువు పరిస్థితులు తీవ్రంగా ఉన్న నేపథ్యంలో కేంద్ర బృందం పర్యటన ప్రాధాన్యతను సంతరించుకుంది.
దిగుబడి 8 కింటాళ్లే..
2016 ఖరీఫ్‌లో 16 ఎకరాల్లో కంది సాగు చేసినా. పురుగు మందులకే రూ.50వేలు ఖర్చయింది. రసాయన ఎరువులకు రూ.7వేలు, కంది కోయనీక ఎకరాకు రూ.700 ప్రకారం రూ.8400 ఖర్చు పెట్టాం. కంది కట్టెను కొట్టడానికి రూ.10వేలు ఖర్చయింది. మొత్తంగా పెట్టుబడి రూ.75వేల వరకు వచ్చింది. దిగుబడి 8 క్వింటాళ్లే వచ్చింది. వీటికి ప్రస్తుతం లభిస్తున్న ధర రూ.4వేలే. పెట్టుబడిలో సగం కూడా రాలేదు. ఒకటిన్నర ఎకరాలో ఉల్లి సాగు చేయగా.. 50 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. మార్కెట్‌లో క్వింటాకు లభించిన ధర రూ.60 మాత్రమే. - వి.రాముడు, బోగోలు, వెల్దుర్తి మండలం
Advertisement
Advertisement