కాటేసిన కరువు | Farmer suicides was not stoped in AP | Sakshi
Sakshi News home page

కాటేసిన కరువు

Published Sat, Sep 15 2018 4:04 AM | Last Updated on Mon, Oct 1 2018 2:36 PM

Farmer suicides was not stoped in AP - Sakshi

వైఎస్సార్‌ జిల్లా లక్కిరెడ్డిపల్లెలో ఎండిన వేరుసెనగ పొలంలో దిగాలుగా కూర్చున్న రైతు వెంకటసుబ్బారెడ్డి

ఎండిపోయిన పైర్లు.. బీళ్లుగా మారిన పొలాలు.. కబేళాలకు తరలుతున్న పశువులు, వలస బాట పట్టిన రైతన్నలు.. రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లోని గ్రామాల్లో ఇలాంటి హృదయ విదారక దృశ్యాలే కనిపిస్తున్నాయి. అన్నదాతలు కరువు కాటుకు చిక్కి విలవిల్లాడుతున్నారు. పంటల సాగు కోసం చేసిన అప్పులు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఇంతటి కరువును తమ జీవితంలో ఎప్పుడూ చూడలేదని రైతులు బోరుమంటున్నారు. దుర్భిక్షం ధాటికి పంటలు కోల్పోయి దిక్కుతోచని స్థితిని ఎదుర్కొంటున్న తమను ప్రభుత్వం సైతం ఆదుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వేసిన పంట చేతికి రాక, ఉన్న ఊళ్లో బతుకుదెరువు లేక పొట్ట చేత పట్టుకుని పక్క రాష్ట్రాలకు వలస వెళ్తున్నారు.

రాయలసీమ నుంచి ‘సాక్షి’ ప్రత్యేక ప్రతినిధి: పచ్చని పైర్లతో కళకళలాడాల్సిన పంట భూములు కరువు ధాటికి బీళ్లుగా మారాయి. జూన్‌ ఆరంభంలో అరకొర వర్షాలకు విత్తిన పైర్లు వాడిపోయాయి. కర్నూలు జిల్లాలోని పత్తికొండ, ఆలూరు, అనంతపురం జిల్లాలోని కదిరి, గుత్తి, వైఎస్సార్‌ జిల్లాలోని రాయచోటి, గాలివీడు, చిత్తూరు జిల్లాలోని వాయల్పాడు, పెద్దమండ్యం తదితర ప్రాంతాల్లో ఎండిపోయిన వేరుశనగ పైర్లను ట్రాక్టర్లతో దున్నేస్తున్న దృశ్యాలు కంటతడి తెప్పిస్తున్నాయి. తేమలేక ఎండిపోయిన ఉల్లిని చాలామంది రైతులు పీకకుండానే అలాగే పొలాల్లో వదిలేశారు. టమోటా, మిరప, బెండ తదితర కూరగాయల తోటలు సైతం చేతికి రాకుండా పోయాయి. అప్పులు చేసి వేసిన పంటలు కరువు కాటుకు మట్టిలోనే కలిసి పోవడంతో రైతన్నలు కుమిలిపోతున్నారు. చేసిన అప్పులు భయపెడుతున్నాయి. చాలాచోట్ల తాగడానికి గుక్కెడు నీరు దొరక్క జనం అల్లాడిపోతున్నారు. దుర్భిక్షం వల్ల మేత, నీరు సమకూర్చడం కష్టం కావడంతో చాలామంది రైతులు విధిలేని పరిస్థితుల్లో పశువులను కారుచౌకగా కబేళాలకు విక్రయిస్తున్నారు. అనంతపురం, వైఎస్సార్, కర్నూలు, చిత్తూరు జిల్లాల నుంచి ఆవులు, గేదెలు, మేకలు, గొర్రెలు లారీల్లో కబేళాలకు తరలిపోతున్నాయి. ఇప్పటికే రాయలసీమ నుంచి ఎంతోమంది అన్నదాతలు పొట్ట చేత పట్టుకుని పక్క రాష్ట్రాలకు వలస వెళ్లారు. 

వేరుశనగ రైతులకు రూ.2,250 కోట్ల నష్టం 
రాయలసీమ జిల్లాల్లో వేరుశనగ పంట 90 శాతానికి పైగా ఎత్తిపోయింది. ఇప్పటికే పంట కాలం పూర్తికావడం వల్ల పశువుల మేతకైనా మొక్కలు బాగా పెరిగే అవకాశం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత ఏడాది రెయిన్‌ గన్లతో సెంటు భూమి  కూడా ఎండిపోకుండా పంటలను కాపాడామని ఘనంగా ప్రచారం చేసుకున్న ప్రభుత్వం ఈ ఏడాది రెయిన్‌ గన్ల ఊసే మర్చిపోయింది. రాయలసీమలో 16.50 లక్షల ఎకరాల్లో వేరుశనగ సాగు కాగా, 15 లక్షల ఎకరాల్లో పంట ఎండిపోయింది దీంతో రైతులు రూ.2,250 కోట్ల మేర నష్టపోయినట్లు అనధికారిక అంచనా.   

మండుతున్న ఎండలు.. వట్టిపోతున్న బోర్లు  
రాష్ట్రంలో ప్రస్తుత ఖరీఫ్‌ సీజన్‌లో అధికారిక గణాంకాల ప్రకారం 16.50 లక్షల ఎకరాల్లో వేరుశనగ సాగు కాగా, ఇందులో 90 శాతం పంట ఎండిపోయింది. కర్నూలు జిల్లాలో 50.3 శాతం, అనంతపురం జిల్లాలో 47.4 శాతం లోటు వర్షపాతం నమోదు కావడంతో పంటలన్నీ ఎండిపోయాయి. వేసవి కాలాన్ని తలపించేలా ఎండలు మండుతున్నాయి. రెండు మూడు రోజుల క్రితం రాయలసీమలో అక్కడక్కడా కొద్దిపాటి వర్షం పడింది. ఎండిపోయిన పంటలు ఈ వర్షానికి కొంచెం పచ్చగా మారినా మళ్లీ ఎండ తీవ్రత వల్ల వాడిపోతున్నాయి. కర్నూలు, అనంతపురం జిల్లాల్లో చేతికందాల్సిన దశలో ఉల్లిపంట చాలావరకు ఎండిపోయింది. దిగుబడి 25 నుంచి 30 శాతం లోపే వచ్చిందని రైతులు వాపోతున్నారు. వర్షాధారంగా వేసిన పంటలే కాకుండా బోర్ల కింద వేసిన పైర్లు కూడా ఎండిపోతున్నాయి. వరుస కరువులతో భూగర్భ జలమట్టం పాతాళానికి పడిపోయింది. 

చందోలిలో నీటికి కటకట  
కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గంలోని చందోలి గ్రామంలో 400 ఇళ్లు ఉన్నాయి. ఈ గ్రామస్థులు తాగునీరు దొరక్క అష్టకష్టాలు పడుతున్నారు. గ్రామంలో గత నాలుగేళ్లలో 14 బోర్లు వేసినా అన్నీ ఎండిపోయాయని, ఒక బోరులో మోటారు వేస్తే కొద్దిసేపు సన్నటి ధార వచ్చి ఆగిపోతోందని సర్పంచి లక్ష్మీదేవి కుమారుడు రంగప్ప తెలిపారు. గ్రామంలోని బోర్ల నుంచి నీరు రానందున గ్రామస్థులు పొలాల్లో కొద్దికొద్దిగా బోర్ల నుంచి వస్తున్న నీరు తెచ్చుకుంటున్నారని, పంటలు ఎండిపోతున్నందున పొలాల యజమానులు అభ్యంతరం చెబుతున్నారని రంగప్ప వివరించారు. గొర్రెలు, మేకలు ఉన్న వారు ఎడ్ల బండిలో డ్రమ్ములు పెట్టుకుని దూర ప్రాంతాల నుంచి నీరు తెచ్చుకుంటున్నారు. 

సీమలో 51.1 శాతం వర్షంపాత లోటు 
రాయలసీమలో కరువు కరాళ నృత్యం చేస్తోంది. ఈ సీజన్‌లో ఇప్పటి (జూన్‌ 1 నుంచి సెప్టెంబర్‌ 12వ తేదీ) వరకూ రాయలసీమ జిల్లాల్లో 329.2 మిల్లీమీటర్ల సగటు సాధారణ వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా, కేవలం 160.9 మిల్లీమీటర్ల వర్షం మాత్రమే కురిసింది. సాధారణం కంటే 51.1 శాతం తక్కువ వర్షం కురవడం వల్ల పంటలు ఎండిపోయాయి. నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లోనూ కరువు తీవ్రత అధికంగానే ఉంది. వర్షాభావం వల్ల పంటలు చేతికి రాలేదు. గుంటూరు జిల్లాలో 16.1 శాతం లోటు వర్షపాతమే ఉన్నప్పటికీ పల్నాడు ప్రాంతంలో కరువు ఎక్కువగా ఉంది.  

ఇలాంటి కరువు ఎప్పుడూ చూడలేదు 
రాయలసీమ జిల్లాల్లో కరువు వల్ల పనులు దొరక్క, ఉపాధి కోసం ఇప్పటికే చాలామంది రైతులు, రైతు కూలీలు ఇతర ప్రాంతాలకు వలస వెళ్లారు. వలస వెళ్ల లేని వారు గ్రామాల్లో రచ్చబండలు, గ్రామ చావిళుపై కూర్చుని తీవ్రంగా మథన పడుతున్నారు. పెద్దవయసు వారు పొద్దుపోక మేక–పులి ఆట ఆడుతున్నారు. కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గంలోని చందోలి గ్రామంలోని సుంకులమ్మ గుడి వద్ద కూర్చున్న కొందరు రైతులను ‘సాక్షి’ పలుకరించగా.. ఇంతటి కరువును తాము ఇప్పటివరకూ చూడలేదని 65 ఏళ్ల వీరన్న, 64 ఏళ్ల తిమ్మప్ప ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘ఇప్పటికే మా గ్రామం నుంచి చాలామంది పనుల్లేక వలస వెళ్లారు. త్వరలో పీర్ల పండుగ ఉందని ఆగాం. పండుగ తర్వాత పౌర్ణమికి మేము కూడా బెంగళూరుకు వలస వెళ్లాలని నిర్ణయించుకున్నాం’’ అని చందోలి గ్రామంలోని పలువురు రైతన్నలు చెప్పారు. 

చివరకు అప్పులే మిగిలాయి 
‘‘రెండెకరాల్లో పత్తి, ఒకటిన్నర ఎకరాల్లో వేరుశనగ పంటలు వేశా. నీరు సరిపోదనే ఉద్దేశంతో పత్తికి డ్రిప్‌ పెట్టా. రూ.40 వేలు వెచ్చించి రాళ్లతో పెద్ద తొట్టి కట్టించా. బోరు నుంచి మొదట నీటిని ఈ తొట్టిలోకి మోటారు ద్వారా ఎక్కించి, తర్వాత తొట్టి నుంచి డ్రిప్‌ ద్వారా పొలానికి అందించి పంటలను రక్షించుకునేందుకు ప్రయత్నించా. దురదష్టవశాత్తూ పత్తి పంట రెండడుగుల ఎత్తు కూడా పెరగకముందే బోరు ఎండిపోయింది. పత్తి, వేరుశనగ పంటలు చేతికి రాలేదు. ఇన్నాళ్లూ నేను చేసిన కష్టమంతా మట్టిపాలైంది. చివరకు అప్పులే మిగిలాయి’’ 
– కురువ ఆనంద్, పత్తికొండ, కర్నూలు జిల్లా 

ప్రభుత్వం ఆదుకోవాలి
‘‘వేరుశనగ ఎండిపోవడం వల్ల తీవ్ర నష్టం వాటిల్లింది. పంటలు కోల్పోయిన రైతాంగాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి. గత నాలుగేళ్లుగా వర్షాభావంతో పంటలు పండలేదు. ఐదు ఎకరాల్లో వేరుశనగ వేస్తే పూర్తిగా ఎండిపోయింది’’    
 – చింతల రాయుడు,టీఎన్‌ పాళ్యం, అనంతపురం జిల్లా 

రూ.30 వేల పెట్టుబడి మట్టిపాలు 
‘‘నాకున్న రెండు ఎకరాల్లో వేరుశనగ వేశా. ఇందుకోసం రూ.30 వేలు పెట్టుబడిగా పెట్టా. జూన్‌లో కురిసిన వానకు పంట వేశా. ఆ తరువాత చినుకు జాడేలేదు. దీంతో పంటంతా ఎండిపోయింది. కనీసం పశువుల మేతకు కూడా పనికిరాలేదు. పెట్టిన పెట్టుబడి అంతా మట్టిపాలైంది’’ 
– దుగ్గిరెడ్డి వెంకటసుబ్బారెడ్డి, దేవలంపల్లె, లక్కిరెడ్డిపల్లె మండలం, వైఎస్సార్‌ జిల్లా 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement