ప్రాణం తీసిన కరువు
ప్రాణం తీసిన కరువు
Published Tue, Feb 21 2017 11:15 PM | Last Updated on Mon, Oct 1 2018 2:44 PM
-బోర్లు ఎండి..పంటలు పండక అన్నదాత ఆత్మహత్య
- విషాదంలో మృతుడి కుటంబసభ్యులు
ఆలూరురూరల్: బోర్లు ఎండిపోయి..పంటలు పండకపోవడంతో చేసిన అప్పులు ఎలా తీర్చాలనే బెంగతో ఆలూరు మండలం అంగస్కల్ గ్రామానికి చెందిన సోమేష్ (45) అను రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. మంగళవారం చోటు చేసుకున్న ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి.
సోమేష్‌కు రెండు ఎకరాల బోరు బావి పొలం ఉంది. ఆ పొలంలో ఐదేళ్ల క్రితం రెండు బోర్ల ద్వారా వివిధ రకాల పంటలను సాగు చేస్తూ మంచి దిగుబడులు సాధించాడు. నాలుగేళ్లుగా వర్షాలు లేక బోర్లలో నీరు రాక పంటలు పండలేదు. మొక్కవోని ధైర్యంతో ఎండిపోయిన బోర్ల స్థానంలో కొత్తగా బోర్లు వేయించాడు. ఇలా ఆరు బోర్లు వేసినా ఫలితం లేకపోయింది. అందుకు చేసిన అప్పులు పెరిగిపోయాయి. మళ్లీ గతేడాది ఖరీఫ్‌లో ఒక బోరు వేయించాడు. అందులో రెండు ఇంచుల నీరు పడటంతో ఇక కష్టాలు తొలగుతాయని సంతోషపడి ఉల్లిపంట సాగు చేశాడు. పంట చేతికొచ్చాక ధర లేకపోవడంతో తీవ్రంగా నష్టపోయాడు. తర్వాత మిర్చిని సాగు చేస్తే పంట చేతికందే సమయంలో రెండు ఇంచుల బోరులో నీరు కూడా అడుగంటిపోయింది. దీంతో నీరు లేక పైరు పూర్తిగా ఎండిపోయింది. దిక్కుతోచని సోమేష్ మంగళవారం ఉదయం పొలానికి వెళ్తున్నానని భార్య రాజమ్మకు చెప్పి ఇంటి నుంచి వెళ్లాడు. పొలంలో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. మృతుడికి భార్యతో పాటు ముగ్గురు ఆడపిల్లలు, ఒక కొడుకు ఉన్నాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతుడు బోర్లు వేయించేందుకు, పంటల సాగుకు దాదాపు 7 లక్షల వరకు అప్పు చేశాడని గ్రామస్తులు తెలిపారు.
Advertisement
Advertisement