అప్పుల బాధతో రైతు ఆత్మహత్య
– జి.సింగవరంలో విషాదం
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు) : అప్పుల బాధ తాళలేక పురుగుల మందు తాగి రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన జి.సింగవరంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన కరుణాకరరెడ్డి(40) శనివారం పురుగుల మందు తాగి పెద్దాసుపత్రిలో చికిత్స పొందుతూ కోలుకోలేక శుక్రవారం సాయంత్రం 5 గంటలకు తుది శ్వాస విడిచాడు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు... జి.సింగవరం గ్రామానికి చెందిన ధర్మారెడ్డి కుమారుడు కరుణాకరరెడ్డికి ఆరు ఎకరాల పొలం ఉంది. దీనికితోడుగా ఆయన మరో నాలుగు ఎకరాలను కౌలుకు తీసుకొని సాగుచేసేవాడు.
గతేడాది చెరకు పంటను వేసి తీవ్రంగా నష్టపోయాడు. ఈ యేడాది రెండు బోరు బావులను తవ్వించాడు. వీటన్నింటి కోసం కోపరేటివ్ బ్యాంకులో బంగారు, పట్టాదారు పాసు బుక్కులు పెట్టి రూ.5 లక్షలు, బయట వ్యక్తుల దగ్గర మరో రూ.5 లక్షలు అప్పులు చేశాడు. దీంతో వాటికి వడ్డీలు పెరిగిపోతుండడంతో తీర్చే మార్గం లేక గత శనివారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. భార్య నాగమణి గమనించి కేకలు వేయడంతో ఇరుగుపొరుగు వారు వచ్చి కరుణాకరరెడ్డిని ఆసుపత్రికి తరలించారు. వారం రోజులుగా చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు. మృతుడికి భార్య నాగమణి, ఇద్దరు కుమారులు ఉన్నారు. పెద్దకుమారుడు ధర్మారెడ్డి తొమ్మిదో తరగతి, చిన్నకుమారుడు హరినాథరెడ్డి ఎనిమిదో తరగతి చదువుతున్నారు. కాగా, కరుణాకరరెడ్డి మృతితో జి.సింగవరంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.