గర్జించిన రైతన్న
► తాగు, సాగునీటి కోసం నినాదం
► బయలుసీమ రైతుల చలో విధానసౌధ
► దేవనహళ్లి నుంచి వేలాదిమందితో బైక్ ర్యాలీ
► అడ్డుకున్న పోలీసులు, రోజంతా నిరసన
► హైదరాబాద్ హైవే దిగ్బంధం
దొడ్డబళ్లాపురం: కరువు కోరల్లో చిక్కుకున్న బయలుసీమ జిల్లాలకు శాశ్వత సాగు, తాగునీటి పథకం అమలు చేయాలని డిమాండుచేస్తూ రైతన్నలు మరోసారి పోరుబాట పట్టారు. బయలుసీమ జిల్లాలయిన కోలారు, చిక్కబళ్లాపురం, బెంగళూరు గ్రామీణ, రామనగర, తుమకూరు తదితర జిల్లాల నుంచి గురువారం బెంగళూరుకు బృహత్ బైక్ ర్యాలీ చేపట్టి ప్రభుత్వానికి సవాల్ విసిరారు. విధానసౌధను ముట్టడించాలని వేలాదిమంది రైతులు బెంగళూరు–హైదరాబాద్ జాతీయ రహదారి మార్గంలోని దేవనహళ్లి మీదుగా సాగుతుండగా రెండువేల మంది పోలీసులు వారిని అడ్డుకున్నారు.
నిజానికి రైతు సంఘాల నేతలను బుధవారం రాత్రే ఆయా ప్రాంతాల్లోనే అరెస్టు చేసిన పోలీసులు చివరకు దేవనహళ్లి వరకూ మాత్రమే ర్యాలీ నిర్వహించాలనే షరతుతోతో బైక్ ర్యాలీకి అనుమతించారు. గతంలో రైతులు ఇలాగే ర్యాలీ చేపట్టి బెంగళూరులో గందరగోళం సృష్టించిన నేపథ్యంలో ఈసారి పకడ్బందీగా అడ్డగించారు. రైతులందరూ మొదట దేవనహళ్లి చేరుకుని రాష్ట్ర రైతు సంఘం అధ్యక్షుడు కోడిహళ్లి చంద్రశేఖర్ ఆధ్వర్యంలో నగరంవైపు సాగారు.
బెంగళూరు సీఎం అబ్బసొత్తా?
రైతులను రాణిక్రాస్ వద్ద పోలీసులు అడ్డుకోవడంతో అక్కడే బైఠాయించి ఆందోళనకు దిగారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కోడిహళ్లి చంద్రశేఖర్ మాట్లాడుతూ రైతులను రాజ్యాంగ హక్కు ప్రకారం పోరాటం కూడా చేసుకోనివ్వడంలేదని మండిపడ్డారు. ముఖ్యమంత్రి బెంగళూరును అబ్బసొత్తు అనుకుంటున్నారా? అని ప్రశ్నించారు.పాతికేళ్లుగా అన్ని ప్రభుత్వాలూ బయలుసీమ జిల్లాల రైతులను మోసం చేస్తూనే ఉన్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. అన్నదాత వ్యవసాయం కోసం నీరడిగితే పోలీసులతో కొట్టిస్తారా అని ధ్వజమెత్తారు. ప్రభుత్వం తరఫున ప్రతినిధులు వచ్చి శాశ్వత సాగునీటి పథకం పట్ల స్పష్టమైన హామీ ఇచ్చేవరకూ ఇక్కడి నుంచి కదిలే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు.
మంత్రి భైరేగౌడ రాయబారం
సాయంత్రం సుమారు 6 గంటల సమయంలో వ్యవసాయ శాఖ మంత్రి కృష్ణభైరేగౌడ ఘటనాస్థలానికి వచ్చారు.ఈ సందర్భంగా కోడిహళ్లి చంద్రశేఖర్ మాట్లాడుతూ గతంలో బెంగళూరు ముట్టడించిన సమయంలో ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలలో ఒక్కటీ నెరవేర్చలేదని,రైతుల పట్ల మీకున్న గౌరవం ఇదేనా?అని ప్రశ్నించారు. మంత్రి స్పందిస్తూ బయలుసీమ జిల్లాలకు నీరందించే ఎత్తినహోళె పథకం ముగింపు దశలో ఉందని, రెండేళ్లలో పనులు పూర్తవుతాయని చెప్పారు. భూ స్వాధీనం ఆలస్య పనులు జరగలేదన్నారు. ఎత్తినహోళె నీరు ఆయా తాలూకాలకు, చెరువులకు సరఫరా చేసేందుకు పైపు లైన్లు పనులు ప్రారంభిస్తామన్నారు. దొడ్డబళ్లాపురం వద్ద ఎత్తినహోళె నీటి నిల్వకు జలాశయం నిర్మించాల్సి ఉందన్నారు. ముఖ్యమంత్రితో మాట్లాడి బయలుసీమ జిల్లాలకు అవసరమైతే మరిన్ని సాగునీటి పథకాలు అందేలా చూస్తామన్నారు.
రైతుల అరెస్టు
మంత్రి కృష్ణభైరేగౌడ మాటలకు సమ్మతించని రైతులు పోరాటం కొనసాగిస్తామని మమ్మల్ని విధానసౌధ ముట్టడించడానికి అనుమతించాలని బ్యారికేడ్లను తోసుకుని నినాదాలు చేస్తూ బెంగళూరు వైపు వెళ్లడానికి ప్రయత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు. మంత్రి మాటలు నమ్మకశక్యంగా లేవని, రాజకీయ ప్రసంగంలా ఉందని రాష్ట్ర రైతు సంఘం అధ్యక్షుడు కోడిహళ్లి చంద్రశేఖర్ ఎద్దేవా చేశారు. పోలీసులు కోడిహళ్లితో పాటు పలువురు రైతులను అరెస్టు చేశారు.
హైవేపై ప్రయాణికుల యాతన
రోజంతా హైదరాబాద్ హైవే స్తంభించడంతో ఎయిర్‌పోర్టుకు, హైదరాబాద్ వైపు వెళ్లే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పోలీసులు నంది క్రాస్,దొడ్డబళ్లాపురం మీదుగా వాహనాల రాకపోకలు మళ్లించినప్పటికీ అనేకమందికి దారి తెలీకపోవడంతో రోడ్లపక్కనే పడిగాపులు కాశారు.