ఏడు గ్రామాల్లో తీవ్రమైన నీటి కరువు
సమీప గ్రామాల నుంచి ట్యాంకర్ల ద్వారా సరఫరా
672 ఆవాసాల్లో ప్రైవేటు బోర్లు అద్దెకు
ఆర్‌డబ్ల్యూఎస్ నివేదికలో వెల్లడి
వరంగల్ : తాగునీటి కోసం జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలోని అన్ని ప్రాంతాల్లోనూ తాగునీటి కష్టాలు మొదలయ్యూయి. గ్రామీణ తాగునీటి సరఫరా(ఆర్‌డబ్ల్యూఎస్) విభాగం నివేదిక ప్రకారం ఏడు గ్రామాల్లో నీటి సమస్య తీవ్రంగా ఉంది. తాగేందుకు నీరు దొరకడంలేదు. ఈ ఊర్లలో నీరు దొరకకపోవడంతో సమీప గ్రామాల నుంచి ట్యాంకర్ల ద్వారా సరఫరా చేస్తున్నట్లు ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు వెల్లడించారు. ట్యాంకర్లతో సరఫరా చేసినా నీరు సరిపోక ఈ గ్రామాల్లోని ప్రజలు అల్లాడిపోతున్నారు. జనగామ నియోజకవర్గంలోని బచ్చన్నపేట మండల కేంద్రం, కొన్నె, కొడవటూరు గ్రామాల్లో దర్భరమైన నీటి ఎద్దడి నెలకొంది. ఈ మూడు గ్రామాల్లో తాగేందుకు చుక్క నీరు దొరకడం లేదు. నర్మెట మండలం అంకుశాపూర్, శాయంపేట మండల కేంద్రంలోనూ తాగునీటి సమస్య ఎక్కువగా ఉంది. నర్సింహులపేట మండలం రామానుజపల్లి, భూపాలపల్లి మండలం గొర్లవీడులో ఇతర గ్రామాల నుంచి తాగునీటిని ట్యాంకర్ల ద్వారా సరఫరా చేస్తున్నారు. జిల్లాలో మొత్తం 2403 ఆవాసాలు ఉండగా.. 672 ఆవాసాల్లో తాగునీటి సమస్య ఉంది.
ప్రభుత్వ వనరుల నుంచి తాగునీరు అందే పరిస్థితి లేకపోవడతో ఈ గ్రామాల్లో 1095 ప్రైవేటు బోర్లను అద్దెకు తీసుకుని తాగునీటిని సరఫరా చేస్తున్నారు. ఎండల తీవ్రత ఎక్కువగా ఉండడంతో మరికొన్ని గ్రామాల్లోనూ ఇదే పరిస్థితి వచ్చే ప్రమాదం ఉందని ఆధికారులు ఆందోళనపడుతున్నారు. కరువు నేపథ్యంలో తాగునీటి సమస్యను అధిగమించేందుకు రాష్ట్ర ప్రభుత్వం జిల్లా కోసం ప్రత్యేకంగా రూ.17.27 కోట్లు కేటాయించింది. బోరు బావులు, పైపులైన్ మరమ్మతు, విస్తరణ, ఎండిపోయిన నీటి వనరుల పునరుద్ధరణ వంటి పనులను ఈ నిధులతో పూర్తి చేయాల్సి ఉంది. అదేవిధంగా విపత్తు సహాయ నిధి(సీఆర్‌ఎఫ్) నుంచి రాష్ట్ర ప్రభుత్వం మరో రూ.2.59 కోట్లను విడుదల చేసింది. సీఆర్‌ఎఫ్‌లోని రూ.1.54 కోట్లతో తాగునీటి సరఫరా కోసం 730 పనులను చేపట్టారు. విపత్తు నిర్వహణ నిధుల కింద గత ఏడాది పనులు చేపట్టిన బిల్లుల కోసం ప్రభుత్వం రూ.3.97 కోట్లను విడుదల చేసింది. ప్రభుత్వ పరంగా నిధుల కోసం ఇబ్బంది లేకున్నా... గ్రామాల్లో నీటి కష్టాలు మాత్రం పెరుగుతునే ఉన్నాయి. జిల్లాలో మొత్తం 2403 ఆవాసాలు ఉండగా.. 672 ఆవాసాల్లో తాగునీటి సమస్య ఉంది. ప్రభుత్వ వనరుల నుంచి తాగునీరు అందే పరిస్థితి లేకపోవడతో ఈ గ్రామాల్లో 1095 ప్రైవేటు బోర్లను అద్దెకు తీసుకుని నీటిని సరఫరా చేస్తున్నారు.
సమస్య లేకుండా చూస్తున్నాం
వేసవి తీవ్రతతో గ్రామాల్లో తాగునీటి సమస్య ఏర్పంది. ఎప్పటికప్పడు సమస్య ఉన్న గ్రామాలను గుర్తించి తగిన చర్యలు తీసుకుంటున్నాం. తాగునీటి పరమైన ఇబ్బందులు ఉంటే మా అధికారులను సంప్రదిస్తే వెంటనే పరిష్కరిస్తారు. ప్రస్తుతం 672 గ్రామాల్లో ప్రైవేటు వ్యక్తుల బోర్లను అద్దెకు తీసుకుని తాగునీరు సరఫరా చేస్తున్నాం. - ఎల్.రాంచంద్, ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఈ